
భారత్‌పై అమెరికా సుంకాల విధింపును సమర్థించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్‌స్కీ(Volodymyr Zelenskyy).. యూటర్న్ తీసుకున్నారు. ఈ క్రమంలో.. రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేస్తూ యుద్ధానికి భారత్ వనరులు అందిస్తోందన్న ట్రంప్ విమర్శలను ఆయన తప్పుబట్టారు. ఒకవైపు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ట్రంప్ జెలెన్‌స్కీపై ప్రశంసలు గుప్పించిన వేళ.. ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో.. భారత్ రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేస్తూ యుద్ధానికి వనరులు అందిస్తోందని ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలు గుప్పించారు. అయితే ఈ ఆరోపణలపై ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెలెన్‌స్కీ ఖండించారు. భారత్ మావైపే ఉంది అంటూ అంటూ కీలక వ్యాఖ్యలే చేశారాయన.
ట్రంప్ వ్యాఖ్యలను ఖండిస్తూ జెలెన్‌స్కీ.. ‘‘ఇంధన రంగంలో కొన్ని సమస్యలు ఉన్నా.. భారత్ ఈ యుద్దంలో ఉక్రెయిన్‌కు మద్దతు ఇస్తోంది. భారత్‌ను వదిలిపెట్టడం అంటే అది పెద్ద పొరపాటే అవుతుంది. భారత్ ఎప్పటికీ పశ్చిమ దేశాలతో బలమైన సంబంధాలు కలిగి ఉండాలి’’ అని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో అమెరికా, యూరప్ దేశాలకూ ఆయన ఓ కీలక సూచన చేశారు. ‘‘భారత్‌తో వ్యూహాత్మక సంబంధాలను మరింత బలపరుచుకోవాలి. ఇంధన సంబంధాల విషయంలో భారత్‌కు సరైన పరిష్కారాలను అందించాలి’’ అని సూచించారు.
ఇదిలా ఉంటే.. షాంగై సదస్సు సమయంలో ఇదే జెలెన్‌స్కీ భిన్నంగా స్పందించడం తెలిసిందే. భారత్‌పై ట్రంప్ సుంకాలు విధించడం సరైందేనంటూ అన్నారాయన. ‘‘రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్న భారత్‌తోసహా వాణిజ్య భాగస్వామ్య దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ సుంకాలు విధించడం సబబే. రష్యా ఇంధన వాణిజ్యమే పుతిన్‌కి ఉక్రెయిన్‌పై ప్రయోగిస్తున్న ఆయుధం. అందుకే రష్యా నుంచి ఎగుమతులను అడ్డుకోవాల్సిందే’’ అని అన్నారు. పనిలో పనిగా.. రష్యాతో ఇంధన వాణిజ్యాన్ని కొనసాగిస్తున్న తమ యూరోపియన్ మిత్రదేశాలపై కూడా జెలెన్‌స్కీ విమర్శలు గుప్పించారు. ‘‘యూరోపియన్ల పట్ల ట్రంప్ వైఖరి సరైనదిగా తాను భావిస్తున్నా. యుద్ధంలో పుతిన్‌పై అదనపు ఒత్తిడి అవసరం. ఈయూ భాగస్వామ్య పక్షాలలో కొన్ని రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు కొనసాగిస్తున్నాయి. ఇది ఏమాత్రం సమంజసం కాదు. ఆ దేశాలు రష్యా నుంచి ఎటువంటి ఇంధనాన్ని కొనుగోలు చేయరాదు’’ అని అన్నారు. ఆ సమయంలో.. భారత ప్రధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడిన కొన్నిగంటలకే జెలెన్‌స్కీ అలా మాట్లాడడం గమనార్హం. ఇక..
యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ(UNGA) సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ, భారత్, చైనాలు రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేస్తూ యుద్ధానికి నిధులు సమకూరుస్తున్నాయని, భారత్‌పై 25% పెనాల్టీ సుంకాలు విధించడాన్ని సమర్థిస్తూ సరైన చర్య అని పేర్కొన్నారు. అదే సమయంలో రష్యాను కాగితం పులిగా అభివర్ణించిన ఆయన.. జెలెన్‌స్కీపై ప్రశంసలు గుప్పించారు. అలాగే రష్యా విమానాలు నిబంధలను ఉల్లంఘిస్తున్నాయని, నాటో దేశాలు వాటిని కూల్చేయాలంటూ సంచలన వ్యాఖ్యలే చేశారు.
ఇదీ చదవండి: హనుమంతుడిపై ట్రంప్ పార్టీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు