
అమెరికాలో ట్రంప్ పార్టీ నేత అనుచిత వ్యాఖ్యలు
తీవ్రంగా మండిపడుతున్న హిందూ సంఘాలు
హూస్టన్: అమెరికాలో అధికార రిపబ్లికన్ పార్టికి చెందిన ఓ నాయకుడు హిందూమతంపై తీవ్ర విద్వేషం వెల్లగక్కాడు. టెక్సాస్‌కు చెందిన అలెగ్జాండర్ డంకన్.. హిందువులు ఎంతో భక్తితో పూజించే హనుమంతుడిని నకిలీ దేవుడిగా అభివరి్ణంచాడు. టెక్సాస్ రాష్ట్రంలోని సుగర్‌లాండ్‌లో ఉన్న అష్టలక్ష్మి ఆలయం వద్ద 90 అడుగుల ఎత్తయిన హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటుచేస్తున్నారు.
ఈ విగ్రహానికి సంబంధించిన వీడియోను గతవారం ఎక్స్‌లో పోస్ట్ చేసిన ఆయన.. ‘టెక్సాస్‌లో ఇలాంటి నకిలీ దేవుడి నకిలీ విగ్రహాన్ని ఏర్పాటుచేయటానికి మనం ఎందుకు అనుమతిస్తున్నాం. మనది క్రైస్తవ దేశం’అని పేర్కొన్నాడు. ఆయన వ్యాఖ్యలపై హిందూ అమెరికన్ ఫౌండేషన్ (హెచ్‌ఏఎఫ్) ఆగ్రహం వ్యక్తంచేసింది. డంకన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని రిపబ్లికన్ పార్టీని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎక్స్‌లో టెక్సాస్ రిపబ్లికన్ పార్టీకి ఫిర్యాదు చేసింది.
‘హలో టెక్సాస్ జీవోపీ.. ఎవరిమీదా.. ఎలాంటి వివక్షనూ ప్రదర్శించరాదన్న మీ సొంత మార్గదర్శకాలనే మీ పార్టీ సెనేట్ కాండిడేట్ ఉల్లంఘించి హిందూ మతంపై విద్వేష ప్రకటన చేశాడు. ఆయనను మీరు క్రమశిక్షణలో పెడతారా?’అని చురకలంటించింది. డంకన్ వ్యాఖ్యలపై అమెరికన్లు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. ‘నువ్వు హిందువు కానంత మాత్రాన నకిలీ దేవుడు అంటావా? జీసస్ భూమిపై నడవటానికి 2000 ఏళ్లకు ముందే వేదాలు రచించబడ్డాయి. అవి ఎంతో ఉత్కృష్టమైనవి. క్రైస్తవ మతంపై కూడా వాటి ప్రభావం ఉంది.
కాబట్టి వాటిని గౌరవించాలి. వీలైతే అధ్యయనం చేయండి’అని ఒక ఇంటర్నెట్ యూజర్ డంకన్‌కు సలహా ఇచ్చాడు. ఆ విగ్రహం ఇతర మతస్తులు ఎవరిపైనా బలవంతంగా హిందువుల నమ్మకాలను రుద్దదు అని మరో ఇంటర్నెట్ యూజర్ పేర్కొన్నాడు. ‘మనది క్రిస్టియన్ మెజారిటీ దేశమే కావచ్చు. కానీ, ఇక్కడ ఇతర మతాలను అనుమతించబోము అని అంటే.. మీరు మతపరమైన రాజ్యానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లే లెక్క. అది అమెరికా విలువలకు విరుద్ధం’అని మరో వ్యక్తి ఎక్స్‌లో డంకన్‌కు చివాట్లు పెట్టాడు. అయితే, ఈ వివాదంపై టెక్సాస్ రిపబ్లికన్ పార్టీ విభాగం మాత్రం ఇంతవరకు స్పందించకపోవటం గమనార్హం.