breaking news
hate coments
-
హనుమాన్ నకిలీ దేవుడు
హూస్టన్: అమెరికాలో అధికార రిపబ్లికన్ పార్టికి చెందిన ఓ నాయకుడు హిందూమతంపై తీవ్ర విద్వేషం వెల్లగక్కాడు. టెక్సాస్‌కు చెందిన అలెగ్జాండర్ డంకన్.. హిందువులు ఎంతో భక్తితో పూజించే హనుమంతుడిని నకిలీ దేవుడిగా అభివరి్ణంచాడు. టెక్సాస్ రాష్ట్రంలోని సుగర్లాండ్లో ఉన్న అష్టలక్ష్మి ఆలయం వద్ద 90 అడుగుల ఎత్తయిన హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటుచేస్తున్నారు. ఈ విగ్రహానికి సంబంధించిన వీడియోను గతవారం ఎక్స్‌లో పోస్ట్ చేసిన ఆయన.. ‘టెక్సాస్‌లో ఇలాంటి నకిలీ దేవుడి నకిలీ విగ్రహాన్ని ఏర్పాటుచేయటానికి మనం ఎందుకు అనుమతిస్తున్నాం. మనది క్రైస్తవ దేశం’అని పేర్కొన్నాడు. ఆయన వ్యాఖ్యలపై హిందూ అమెరికన్ ఫౌండేషన్ (హెచ్ఏఎఫ్) ఆగ్రహం వ్యక్తంచేసింది. డంకన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని రిపబ్లికన్ పార్టీని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎక్స్‌లో టెక్సాస్ రిపబ్లికన్ పార్టీకి ఫిర్యాదు చేసింది. ‘హలో టెక్సాస్ జీవోపీ.. ఎవరిమీదా.. ఎలాంటి వివక్షనూ ప్రదర్శించరాదన్న మీ సొంత మార్గదర్శకాలనే మీ పార్టీ సెనేట్ కాండిడేట్ ఉల్లంఘించి హిందూ మతంపై విద్వేష ప్రకటన చేశాడు. ఆయనను మీరు క్రమశిక్షణలో పెడతారా?’అని చురకలంటించింది. డంకన్ వ్యాఖ్యలపై అమెరికన్లు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. ‘నువ్వు హిందువు కానంత మాత్రాన నకిలీ దేవుడు అంటావా? జీసస్ భూమిపై నడవటానికి 2000 ఏళ్లకు ముందే వేదాలు రచించబడ్డాయి. అవి ఎంతో ఉత్కృష్టమైనవి. క్రైస్తవ మతంపై కూడా వాటి ప్రభావం ఉంది. కాబట్టి వాటిని గౌరవించాలి. వీలైతే అధ్యయనం చేయండి’అని ఒక ఇంటర్నెట్ యూజర్ డంకన్‌కు సలహా ఇచ్చాడు. ఆ విగ్రహం ఇతర మతస్తులు ఎవరిపైనా బలవంతంగా హిందువుల నమ్మకాలను రుద్దదు అని మరో ఇంటర్నెట్ యూజర్ పేర్కొన్నాడు. ‘మనది క్రిస్టియన్ మెజారిటీ దేశమే కావచ్చు. కానీ, ఇక్కడ ఇతర మతాలను అనుమతించబోము అని అంటే.. మీరు మతపరమైన రాజ్యానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లే లెక్క. అది అమెరికా విలువలకు విరుద్ధం’అని మరో వ్యక్తి ఎక్స్‌లో డంకన్‌కు చివాట్లు పెట్టాడు. అయితే, ఈ వివాదంపై టెక్సాస్ రిపబ్లికన్ పార్టీ విభాగం మాత్రం ఇంతవరకు స్పందించకపోవటం గమనార్హం. -
పుతిన్, జెలెన్స్కీ మధ్య అంతులేని విద్వేషం
వాషింగ్టన్: రష్యా, ఉక్రెయిన్ అధినేతలు పుతిన్, జెలెన్స్కీలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి రుసరుసలాడారు. రష్యా–ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని నివారించి, శాంతిని నెలకొల్పడానికి తాను చేస్తున్న ప్రయత్నాలను వారు ముందుకు సాగనివ్వడం లేదని మండిపడ్డారు. ఆ ఇద్దరు నాయకుల మధ్య అంతులేని విద్వేషం కనిపిస్తోందని చెప్పారు. అయినప్పటికీ యుద్ధాన్ని ముగించే విషయంలో ఇప్పటికే ఎంతో పురోగతి సాధించానని అన్నారు. ఆదివారం ఫ్లోరిడాలోని తన ప్రైవేట్ క్లబ్ ‘మర్–అ–లాగో’లో ‘ఎన్బీసీ న్యూస్’వార్తా సంస్థకు ట్రంప్ ఇంటర్వ్యూ ఇచ్చారు. జెలెన్స్కీ విశ్వసనీయతను పుతిన్ ప్రశ్నించడం తనకు నచ్చలేదని చెప్పారు. శాంతి ఒప్పందంపై సంతకం చేసే హక్కు జెలెన్స్కీకి లేదని, ఉక్రెయిన్‌కు బాహ్య పరిపాలన అవసరమని పుతిన్ చేసిన వ్యాఖ్యల పట్ల ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇకనైనా పద్ధతి మార్చుకోకపోతే రష్యాపై మరిన్ని ఆంక్షలు విధిస్తామని పరోక్షంగా సంకేతాలిచ్చారు. రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత పుతిన్ పట్ల సానుకూల ధోరణితో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు హఠాత్తుగా స్వరం మార్చేయడం చర్చనీయాంశంగా మారింది. ఉక్రెయిన్–రష్యా యుద్ధం విషయంలో తాను అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోవడం పట్ల ఆయన ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. క్రిటికల్ మినరల్స్ మైనింగ్‌పై మాట తప్పితే.. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని నిలిపివేస్తానంటూ పుతిన్ తనకు హామీ ఇచ్చారని, ఈ విషయంలో ఆయన వెనక్కి తగ్గబోరని భావిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. పుతిన్ తనకు ఎన్నో ఏళ్లుగా తెలుసని, తాము కలిసి పనిచేస్తామని అన్నారు. కాల్పుల విరమణకు పుతిన్ ఎప్పుడు అంగీకరిస్తారో చెప్పలేనని, దానిపై సైకలాజికల్ డెడ్‌లైన్ ఉందని వెల్లడించారు. ఉక్రెయిన్‌కు ఇన్నాళ్లూ అందించిన ఆర్థిక, సైనిక సాయానికి బదులుగా అరుదైన ఖనిజాల తవ్వకానికి అమెరికాకు అనుమతి ఇవ్వడానికి జెలెన్స్కీ అంగీకరించిన సంగతి తెలిసిందే. అయితే, విషయంలో జెలెన్స్కీ మోసం చేసే అవకాశం ఉన్నట్లు తమకు సమాచారం అందని ట్రంప్ చెప్పారు. క్రిటికల్ మినరల్స్ మైనింగ్ విషయంలో మాట తప్పితే చాలాచాలా పెద్ద సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని జెలెన్స్కీని ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. ఉక్రెయిన్ భద్రతకు స్పష్టమై హామీని ఇవ్వాలంటూ మిత్రదేశాలతో ఒప్పందం కుదుర్చుకోవాలన్న ఆలోచనలో జెలెన్స్కీ ఉన్నట్లు తెలిపారు. ఉక్రెయిన్‌కు ‘నాటో’సభ్యత్వం లభించే అవకాశమే లేదని, ఆ విషయం జెలెన్స్కీకి కూడా తెలుసని తే ల్చిచెప్పారు. సాధ్యమైనంత త్వరగా కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవాలని ట్రంప్ ప్రభుత్వం చెబుతుండగా పుతిన్ ప్రభుత్వం అంగీకరించడంలేదు. కనీసం 30 రోజులపాటు దాడులు ఆపేయాలని కోరినా లెక్కచేయడం లేదు. పైగా ఉక్రెయిన్‌పై వైమానిక, క్షిపణి దాడులను మరింత ఉధృతం చేస్తుండడం గమనార్హం. -
సీసీజీ లేఖ రాజకీయ ప్రేరేపితం
న్యూఢిల్లీ: దేశంలో విద్వేష రాజకీయాలు కొనసాగుతున్నాయంటూ ప్రధాని నరేంద్ర మోదీకి ఇటీవల రాసిన బహిరంగ లేఖలో మాజీ సివిల్ సర్వీస్ అధికారులు చేసిన ఆరోపణలను మాజీ న్యాయమూర్తులు, ప్రభుత్వ మాజీ అధికారులు తీవ్రంగా ఖండించారు. వారి లేఖ రాజకీయ ప్రేరేపితమని, మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని మార్చడానికి చేసిన ప్రయత్నమని మండిపడ్డారు. కానిస్టిట్యూషన్ కాండక్ట్ గ్రూప్(సీసీజీ) పేరిట 108 మంది మాజీ సివిల్ సర్వీసు అధికారులు రాసిన లేఖలో నిజాయతీ లేదని తేల్చిచెప్పారు. మోదీకి అండగా నిలుస్తున్న ప్రజల పట్ల వారి ఆక్రోశం ఇందులో వ్యక్తమవుతోందన్నారు. ఈ మేరకు ‘కన్సర్న్డ్ సిటిజెన్స్’ పేరిట 8 మంది మాజీ న్యాయమూర్తులు, 97 మంది మాజీ ఉన్నతాధికారులు, 92 మంది మాజీ సైనికాధికారులు ప్రధాని మోదీకి తాజాగా బహిరంగ లేఖ రాశారు. ఆయనకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సీసీజీ లేఖలోని ఆరోపణలను ఇందులో తిప్పికొట్టారు. సిక్కిం హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ప్రమోద్ కోహ్లీ, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శులు కన్వల్ సిబల్, శశాంక్, ‘రా’ మాజీ చీఫ్ సంజీవ్ త్రిపాఠి తదితరులు ఇందులో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ప్రజల్లో విద్వేష బీజాలు నాటే కుతంత్రలు సాగవని తేల్చిచెప్పారు. -
‘తరిమేయండి.. లేదా తలలో బుల్లెట్లు దించండి’
పోనిక్స్: వలసదారుల గురించి అమెరికాలో ఓ మహిళా టీచర్ తీవ్రమైన పరుష పదజాలం వాడింది. మైగ్రెంట్స్‌ను తిరిగి వెనక్కి పంపించడానికి బదులు వారిని చంపేయండి అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. పాయింట్ బ్లాంక్‌లో తుపాకి పెట్టి వలసదారులను చంపండి అంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది. ఇలా ఒక్కటి కాదు పలు తీవ్రమైన మాటలతో వలసదారులను కించపరిచేలాగ మాట్లాడగా ఆమెపై పాఠశాల యాజమాన్యం క్రమశిక్షణా చర్యలు తీసుకొంది. స్కాట్స్ డేలోని పరదేశ్ జ్యూయిష్ డే పాఠశాలలో చదువుతున్న బోన్నీ వర్నె అనే మహిళా ఉపాధ్యాయురాలు గత పన్నేండుళ్లుగా థర్డ్ గ్రేడ్ టీచర్‌గా పనిచేస్తోంది. ట్రంప్ అధికారంలోకి వచ్చాక వలసదారులు భయపడిపోతుండగా వారి భయాన్ని మరింత రెట్టింపు చేసే తీరుగా బోన్నీ వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియాలో అవతలి వారు అడిగిన దానికి డిమాండ్‌గా అక్రమ వలసదారులను తిరిగి వెనక్కి పంపించండి లేదంటే వారి తలలోకి బుల్లెట్లు ఉన్నపలంగా దించేయండి’ అంటూ కామెంట్ చేసింది. తాను ఈ స్వేఛ్చా దేశం(అమెరికా)లో కంపుకొట్టేలా పేరుకుపోయిన చెత్తకుప్పల్లో(వలసదారులు, శరణార్థులు) మునిగిపోతున్నానంటూ కూడా వివక్ష పూరితమైన వ్యాఖ్యలు చేసింది. ఈ మాటలు ఇంటర్నెట్లో వారం రోజులపాటు హల్చల్ చేశాయి. దీంతో పాఠశాల యాజమాన్యం ఆమెను పిలిచి సమావేశం అయిన తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఆమెకు ఉన్న హక్కులను తాము గౌరవిస్తామని, అయితే, అలాగని సమాజం గర్హించని, తగని వ్యాఖ్యలు స్కూల్ పరిధిలో ఉంటూ చేస్తే అంగీకరించబోమని స్కూల్ వ్యాఖ్యానించింది. వ్యక్తిగత పొరపాట్లకు తమ పాఠశాల ఏమాత్రం అనుమతించదని స్పష్టం చేసింది.