భారత్‌కు మరో షాకిచ్చిన అమెరికా.. ట్రంప్ ప్లాన్‌ అదేనా? | Trade deal US team India visit Cancel amid tariff war | Sakshi
Sakshi News home page

భారత్‌కు మరో షాకిచ్చిన అమెరికా.. ట్రంప్ ప్లాన్‌ అదేనా?

Aug 17 2025 9:40 AM | Updated on Aug 17 2025 9:40 AM

Trade deal US team India visit Cancel amid tariff war

ఢిల్లీ: భారత్‌, అమెరికా మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వాణిజ్య చర్చల కోసం భారత్‌కు రావాల్సిన అమెరికా బృందం ట్విస్ట్‌ ఇస్తూ.. తమ పర్యటనను రద్దు చేసుకుంది. ఈ మేరకు పలు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. దీంతో, వారి తదుపరి పర్యటనపై సస్పెన్స్‌ నెలకొంది.

వివరాల ప్రకారం.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారనే కారణంతో అమెరికా అ‍ధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. భారత్‌ను టార్గెట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ కారణంతో భారత్‌పై అమెరికా భారీగా సుంకాల భారాన్ని మోపింది. ట్రంప్‌ ఇటీవల భారత్‌పై 50శాతం సుంకాలు విధించారు. పాత 25శాతం సుంకాలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. అదనపు 25% టారిఫ్‌లు ఈ నెల 27ను అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో సుంకాలు అమలులోకి రాకముందే.. అమెరికాతో వాణిజ్య చర్చలు జరిపి మధ్యంతర ఒప్పందం చేసుకోవాలని ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

ఈ క్రమంలో దీనికి సంబంధించి ఇప్పటికే ఇరు దేశాల ప్రతినిధుల మధ్య ఐదు దఫాలు చర్చలు జరిగాయి. ఆరో దఫా చర్చలకు అమెరికా ప్రతినిధులు ఈ నెల 25-29 మధ్య భారత్‌లో పర్యటించాల్సి ఉంది. ఈ దఫా చర్చల్లో భాగంగా.. వ్యవసాయం, పాడి పరిశ్రమ రంగాలకు సంబంధించిన చిక్కుముడులు వీడే అవకాశం ఉందని అందరూ భావించారు. అయితే, తాజాగా వారు ఆ పర్యటనను రద్దు చేసుకున్నట్లు  తెలుస్తోంది. దీనికి సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది. మరోవైపు.. చర్చలకు సంబంధించిన తదుపరి తేదీలను కూడా వారు వెల్లడించలేదు. దీంతో, మరోసారి ఇరు దేశాల మధ్య చర్చలు ఉంటాయా? లేదా? అనే సందిగ్థత నెలకొంది. ఒకవేళ చర్చలు విఫలమైతే.. భారత్‌పై టారీఫ్‌ల భారం పడే అవకాశం ఉంది. కాగా, భారత్‌పై సుంకాలు విధించాలనే ఆలోచనతోనే ట్రంప్‌ ఇలా ప్లాన్‌ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా, భారత్‌ను టార్గెట్‌ చేసి ట్రంప్‌ సుంకాలు విధిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ దేశ ప్రజలకు సూచనలు చేశారు. రైతుల ప్రయోజనాలపై ఎన్నటికీ రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఆయన మరోసారి అమెరికాలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. ట్రంప్‌తో కూడా ఆయన భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల మధ్య చర్చలు సఫలం అవుతాయా? అని అందరూ ఆసక్తికంగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement