
సాక్షి, అనంతపురం: శ్రీసత్యసాయి జిల్లా చెందిన ఓ వంట మనిషికి పాకిస్థాన్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉండటం తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చిన సమాచారం ఆధారంగా ధర్మవరం పట్టణానికి చెందిన నూర్ మహ్మద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బయటకు సాధారణ జీవితం గడుపుతూ.. లోపల మాత్రం పాకిస్థాన్ ఉగ్రవాదులతో కలిసి పనిచేసిన వైనం తీవ్ర సంచలనం గా మారింది.
ధర్మవరం పట్టణానికి చెందిన నూర్ మహ్మద్ లోనికోట ఏరియాలో నివసిస్తున్నారు. ఓ హోటల్లో వంట మనిషిగా... టీ చేసే వ్యక్తిగా సాధారణ జీవితం గడుపుతున్నారు. చాలీచాలని జీతంతో అప్పులు చేసిన ఇతను... కొంత కాలం క్రితం అజ్ఞాతంలోకి వెళ్లారు. తొమ్మిది సంవత్సరాల క్రితం వివాహామైన నూర్ మహ్మద్‌కు నలుగురు పిల్లలు ఉన్నారు. భార్యతో విభేదాలు రావడంతో విడిగా ఉంటున్నారు నూర్ మహ్మద్. తాడిపత్రికి చెందిన ఓ మహిళతో నూర్ మహ్మద్‌కు వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది.
నూర్ మహ్మద్ అరెస్ట్ తర్వాత తాడిపత్రికి చెందిన మహిళ అదృశ్యం అయ్యింది. ఆమెకు కూడా ఉగ్ర లింకులు ఉన్నాయా? ఆమె ద్వారానే నూర్ మహ్మద్‌కు ఉగ్రవాదులతో సంబంధాలు ఏర్పడ్డాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ధర్మవరం ఉగ్రవాది నూర్ మహ్మద్ ఇంట్లో జిహాద్ పుస్తకాలు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న మీడియాకు వివరాలు వెల్లడించారు.
అరెస్ట్ అయిన నూర్ మహ్మద్‌పై దేశ ద్రోహం, చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టాల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కదిరి కోర్టులో హాజరు పరిచారు. నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించింది కదిరి కోర్టు. ఎన్ఐఏ, కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో సహకారంతో పూర్తి స్థాయిలో ధర్మవరం పోలీసులు విచారణ చేస్తున్నారు. ధర్మవరంలో నూర్ మహమ్మద్‌తో పాటు మరో వ్యక్తిని ఉపా చట్టం కింద అరెస్ట్ చేసినట్లు ఎస్పీ రత్న వెల్లడించారు. వీరిద్దరూ నిషేధిత వాట్సప్ గ్రూపుల్లో సమాచారం షేర్ చేసినట్లు గుర్తించినట్లు ఆమె తెలిపారు.
నిందితులను అరెస్టు చేసి కడప జైలుకు తరలించామని.. పాక్‌కు చెందిన వాట్సప్ గ్రూపుల్లో నిందితుడు సభ్యుడిగా ఉన్నాడని ఎస్పీ పేర్కొన్నారు. కస్టడీలోకి తీసుకొని లోతుగా విచారిస్తామని ఎస్పీ తెలిపారు. నిషేధిత వాట్సప్ గ్రూప్‌లు 6, పాక్‌కు చెందిన మరో 30 గ్రూపుల్లో నూర్ మహ్మద్ సభ్యుడిగా ఉన్నాడు’’ అని ఎస్పీ రత్న మీడియాకు వివరించారు.