
2021లో కదిరిలో నగల వ్యాపారి కిరణ్ హత్య
2022లో హతమైన కిరాణా దుకాణం యజమాని ప్రమీల
నేర పరిశోధనలో చతికిలపడిన పోలీసులు
ఖాకీల ప్రమేయంతోనే హత్యలంటూ ఊహాగానాలు
నూతన ఎస్పీకి సవాల్‌గా మారిన పెండింగ్ కేసుల దర్యాప్తు
శ్రీ సత్యసాయి జిల్లా: రెండు వేర్వేరు కీలక హత్య కేసుల్లో మిస్టరీని ఛేదించడంలో పోలీసులు చతికిల పడ్డారు. ఆ రెండు కేసులను లోతుగా దర్యాప్తు చేస్తే ఒకరిద్దరు పోలీసు అధికారులు సైతం జైలుకెళ్లాల్సి వస్తుందనే ఆరోపణలు బలంగా వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ హత్యలు జరిగి మూడు, నాలుగేళ్లు కావస్తున్నా నేటికీ దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. రెండు రోజుల క్రితం జిల్లా ఎస్పీగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఎస్.సతీష్ కుమార్ ఈ రెండు కేసుల దర్యాప్తు సవాల్‌గా నిలిచాయి. ప్రత్యేక చొరవ చూపి, నిందితులకు శిక్ష పడేలా చూడాలని బాధిత కుటుంబసభ్యులు కోరుతున్నారు.
గదిలోనే కిరణ్ దారుణ హత్య
మహారాష్ట్రకు చెందిన కిరణ్(23) కొన్నేళ్లుగా కదిరి పట్టణంలోని ఎంజీ రోడ్డులో మేడపై ఓ గదిని అద్దెకు తీసుకొని బంగారు నగలు తయారీతో జీవనం సాగించేవాడు. సకాలంలో నగలు సిద్దం చేసి ఇస్తుండడంతో నగల వ్యాపారులందరూ అతనికే పని ఇచ్చేవారు. దీంతో రోజంతా బిజీగా ఉంటూ పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాడు. అతని వద్ద కిలోకు పైగా బంగారం, 10 కిలోలకు పైగా వెండి ఉండేదని కొందరు నగల వ్యాపారులు అంటున్నారు.
ఈ నేపథ్యంలో 2021 సెప్టెంబర్ 12న రాత్రి తన గదిలో నిద్రిస్తుండగా కిరణ్‌ను కొందరు వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. మొదట్లో ఈ కేసు విషయంలో పోలీసులు కొంత హడావుడి చేసినా ఆ తర్వాత ఉన్నఫళంగా దర్యాప్తు ఆగిపోయింది. ఈ కేసు విచారణలో భాగంగా అప్పటి ఓ పోలీసు అధికారి తన చేతి వాటం ప్రదర్శించి పెద్ద మొత్తంలో నగదు, బంగారు నగలు సొమ్ము చేసుకున్నట్లుగా ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలపైనే సదరు పోలీసు అధికారిని వీఆర్‌కు అప్పట్లో ఉన్నతాధికారులు పంపినట్లుగా సమాచారం.
ప్రమీల శరీరంపై 26 కత్తిపోట్లు
కదిరిలోని కాలేజీ రోడ్డులో కిరాణా కొట్టు నిర్వహించే రంగారెడ్డి అనే వ్యక్తి ఆరేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయారు. ఆ తర్వాత అతని భార్య ప్రమీల(24) ఇంట్లోనే ఉంటూ కిరాణా దుకాణం నిర్వహించేది. 2022, మార్చి 21న అర్రధరాత్రి తన కిరాణా కొట్టులోనే ఆమె దారుణ హత్యకు గురయ్యారు. ఆమె శరీరంపై 26 కత్తిపోట్లు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదిక స్పష్టం చేసింది. తన సమీప బంధువులతో ఆస్తి తగాదా విషయంలో అప్పట్లో తరచూ పట్టణ పోలీస్ స్టేషన్‌కు వెళుతున్న ఆమె అమాయకత్వాన్ని అప్పటి ఒక పోలీసు అధికారి ‘క్యాష్’ చేసుకోవడంతో పాటు వివాహేతర సంబంధం కూడా కొనసాగించారనే ఆరోపణలు ఉన్నాయి.
ప్రమీల సెల్‌ఫోన్‌కు అందిన కాల్స్ ఆధారంగా సదరు పోలీసు అధికారి తరచూ ఆమెతో మాట్లాడినట్లు అప్పట్లో పోలీసుల విచారణలో వెలుగు చూసింది. దీంతో సదరు పోలీసు అధికారిని అప్పట్లో విధుల నుంచి తప్పించినట్లుగా పోలీసు వర్గాల సమాచారం. కాగా, సదరు పోలీసు అధికారి అప్పట్లో స్థానిక సబ్‌జైలు ఎదురుగా ఉన్న పోలీస్ గెస్ట్‌హౌస్‌లోనే ఉండేవారు. ఆయనకు ప్రమీల తన ఇంటి నుంచి క్యారియర్ తీసుకెళ్లి ఇస్తుండడం తాము కళ్లారా చూశామని కొందరు పోలీసులు సైతం అంగీకరిస్తున్నారు.
అలాంటి మహిళ రాత్రికి రాత్రి హత్యకు గురి కావడం నమ్మలేక పోతున్నామని వారంటున్నారు. ఆమె సమీప బంధువులు సైతం ఇదే అంశాన్ని బలపరుస్తున్నారు. ఈ హత్య జరిగి మూడేళ్లకు పైగా కావస్తున్నా నిందితులను ఇప్పటి వరకూ ఎందుకు అరెస్ట్ చేయలేదని బంధువులు ప్రశ్నిస్తున్నారు. ఈ రెండు కేసుల్లోనూ కొందరు ఖాకీల పాత్ర ఉన్నందునే విచారణ పక్కదారి పట్టినట్లుగా బలమైన విమర్శలున్నాయి.