 
													18 నెలలుగా ఒక్క పింఛనూ మంజూరు చేయని ప్రభుత్వం
ఇప్పటికే వేలాది మంది పింఛన్లకు కత్తెర
పింఛన్ పంపిణీకి జిల్లాకు వస్తున్న చంద్రబాబుపై జనం ఆగ్రహం
కదిరి ఎన్‌జీఓ కాలనీకి చెందిన జయమ్మ భర్త ఏడాది క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి ఆమె వితంతు పింఛన్ కోసం స్థానిక సచివాలయంతో పాటు మున్సిపల్ కార్యాలయానికి తిరుగుతూనే ఉంది. కానీ నేటికీ ఆమెకు పింఛన్ మంజూరు చేయలేదు.
పెనుకొండకు చెందిన నరసమ్మకు 52 ఏళ్లు. బీసీ వర్గానికి చెందిన ఆమె...బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్ అని ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పడంతో ఇప్పుడు పింఛన్ కోసం స్థానిక సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది.
ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదని అధికారులు చెబుతున్నారు... ..కూటమి సర్కార్ ఏడాదిన్నర కాలంలో ఒక్కటంటే ఒక్క కొత్త పింఛన్ మంజూరు చేయకపోవడంతో వేలాది మంది అర్హులు ప్రభుత్వ కార్యాలయాలచుట్టూ తిరుగుతూనే ఉన్నారు.
కదిరి: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 18 నెలలు కావస్తున్నా... కొత్త పింఛన్ మంజూరు చేయకపోగా ఉన్న పింఛన్లను తొలగిస్తోంది. దివ్యాంగుల కేటగిరీలో పింఛన్ పొందుతున్న 10 వేల మందికిపైగా లబ్ధిదారులకు ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఇందులో కొందరి పేర్లు పింఛన్ జాబితా నుంచి తొలగింది.
పింఛన్ల వెబ్ సైట్ క్లోజ్.. 
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఏటా జనవరి, జూలై మాసాల్లో కొత్త పింఛన్లు మంజూరు చేసేవారు. 6 నెలల్లో వచ్చిన దరఖాస్తులను స్థానిక సచివాలయ ఉద్యోగులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హుడా..కాదా? అనే విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించేవారు. ఆపై ఆన్‌లైన్ ప్రక్రియలో కూడా అన్ని ప్రభుత్వ శాఖల వద్ద ఉండే సమాచారంతో సరిపోల్చుకోవడానికి ఆరు దశల పరిశీలన(సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్) జరిపేవారు. ఆ తర్వాత అర్హులకు పింఛన్ మంజూరు చేసేవారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. కొత్త పింఛన్ల దరఖాస్తుకు సంబంధించిన వెబ్‌సైట్‌ను కూటమి ప్రభుత్వం పూర్తిగా క్లోజ్ చేసింది. దీంతో కనీసం దరఖాస్తు చేసుకునే వీలు కూడా లేకపోయింది. పైగా పింఛన్లు వెరిఫికేషన్ పేరుతో ఇప్పటికే ఎంతో మంది పేర్లను జాబితా నుంచి తొలగించారు. అందుకే జిల్లాలో సామాజిక భద్రత పింఛన్లు పొందుతున్న లబి్ధదారుల సంఖ్య ప్రతి నెలా తగ్గిపోతోంది. గత ప్రభుత్వంలో జిల్లాలో 2,74,839 మంది పింఛన్‌దారులు ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 2,63,173కు తగ్గింది. 
ప్రతినెలా పింఛన్ల కోతే.. 
జగన్ ప్రభుత్వంలో జిల్లా వ్యాప్తంగా అర్హతే ప్రామాణికంగా వైఎస్సార్ పింఛన్ కానుక అందజేశారు. జిలాల్లో 2,74,839 మందికి వైఎస్సార్     పింఛన్ కానుక ద్వారా ప్రతి నెలా రూ. 4,131.52 కోట్లు లబ్ధి చేకూరింది. కానీ కూటమి ప్రభుత్వం ప్రతి నెలా పింఛన్లలో కోత పెడుతోంది. సెపె్టంబర్ నెలలో జిల్లాలోని 2,64,384 మందికి పింఛన్ అందజేయగా.. అక్టోబర్‌లో ఆ సంఖ్య 2,63,987కు తగ్గింది. ఒకేనెల 397 మందిని పింఛన్ జాబితా నుంచి తొలగించారు. ఇక అక్టోబర్ నెలలో సుమారు 814 పింఛన్లు తగ్గించారు. ఇలా అర్హులను పింఛన్ జాబితా    నుంచి తొలగించేలా చర్యలు తీసుకున్న సీఎం చంద్రబాబు...      పింఛన్ పంపిణీ పేరుతో జిల్లా పర్యటనకు వస్తుండటంపై బాధితులు పెదవి విరుస్తున్నారు. ‘‘మా పింఛన్లు పీకేసి       పింఛన్లు పంపిణీ అని మా ఊరికే వస్తారా’’ అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  
ఎన్నికల హామీ నెరవేర్చండి  
మాది బీసీ(బెస్త)సామాజిక వర్గం. ఎన్నికల సమయంలో చంద్రబాబుతో పాటు కూటమి నేతలు బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని చెప్పారు. రెండేళ్లు కావస్తున్నా... ఇంత వరకూ అతీ..గతీ లేదు. నాకిప్పుడు 58 ఏళ్లు. పింఛన్ కోసం ఎదురు చూస్తున్నా. అధికారులను అడిగితే చంద్రబాబునే అడుగు..అని అంటున్నారు. 
– జి.గోవిందు, ఉప్పార్లపల్లి, నల్లచెరువు మండలం     

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
