
తన కూతురితో పాటు తనపైనా కన్నేసిన ఓ మృగాన్ని భార్య కడతేరిస్తే.. ఆ మృతదేహాం ఆనవాలు కూడా దొరక్కుండా మాయం చేస్తాడు ఓ భర్త. అటుపై ఈ కేసులో కుటుంబాన్ని రక్షించుకునేందుకు అతగాడు చేసే ప్రయత్నాల ఆధారంగా అటు మలయాళం, ఇటు తెలుగు, మిగతా భాషల్లోనూ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘దృశ్యం’ సిరీస్ అలరిస్తూ వస్తోంది. తాజాగా ఒరిజినల్ లాంగ్వేజ్‌లో మూడో పార్ట్ షూటింగ్ కూడా మొదలైంది. అయితే..
ఈ సినిమా స్ఫూర్తితో చాలా నేరాలు జరగడమూ చూశాం. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోనూ ఈ తరహాలో జరిగిన ఓ నేరాన్ని పోలీసులు ఎట్టకేలకు చేధించగలిగారు. తన భార్య పట్ల అనుచితంగా ప్రవర్తించాడని ఓ వ్యక్తిని హత్య చేసి ఆ శవాన్ని కనపడకుండా చేశారు ఇక్కడ. వివరాల్లోకి వెళ్తే..
అల్లుగుండుకు చెందిన అమర్నాథ్ మిస్సింగ్ కేసు రెండేళ్ల తర్వాత సాల్వ్ అయ్యింది. తన భర్త, అతని ఇద్దరు స్నేహితుల సాయంతో ఓ మహిళ అతన్ని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. అమర్నాథ్ తనను అసభ్యంగా ఫొటోలు తీసి బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడనే ఆమె రగిలిపోయింది. విషయాన్ని తన భర్త దాదా పీర్‌కు చెప్పి వాపోయింది. దీంతో..
అమర్నాథ్‌పై కోపంతో రగిలిపోయిన దాదా పీర్.. స్నేహితులు సాధిక్, యాసిన్‌లతో కలిసి అమర్నాథ్‌ను హతమార్చాడు. ఆపై మృతదేహాన్ని చెర్లోపల్లి రిజర్వాయర్‌లో పడేశాడు. తాజాగా కేసు మిస్టరీని చేధించిన పోలీసులు.. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన అదనపు సమాచారం అందాల్సి ఉంది.