సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి. ఒకే రోజు మూడు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఏపీలోని సత్యసాయి జిల్లాలో ఐచర్ వాహనాన్ని ట్రావెల్స్ బస్సు ఢీకొంది. హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 8 మంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రి కి తరలించారు. రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండలం దామాజిపల్లి వద్ద ఘటన జరిగింది.
నల్లగొండ జిల్లా: వేములపల్లి మండలం బుగ్గుబావిగూడెం వద్ద ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కావలి నుంచి హైదరాబాద్ వెళ్తున్నచెర్రీ ట్రావెల్స్ బస్సు నార్కెట్ పల్లి -అద్దంకి హైవే పై ట్రాక్టర్ ను డికొట్టింది. బస్సు వెనుక నుంచి ఢీకొట్టడంతో రోడ్డుపై ట్రాక్టర్ పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదు మందికి గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన వారిని మిర్యాలగూడ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 45 A మంది ప్రయాణికులు ఉన్నారు.
కరీంనగర్ జిల్లా: తిమ్మాపూర్ మండలం రేణికుంట బ్రిడ్జి రాజీవ్ రహదారిపై వడ్ల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఆర్టీసీ బస్సు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 15 మంది గాయపడ్డారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ క్షతగాత్రులను అంబులెన్స్‌లో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. మెట్‌పల్లి డిపోకి చెందిన బస్సు.. హైదరాబాద్‌నుంచి మెట్టుపల్లికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
