ప్రముఖ సినీనటి ఆమని భారతీయ జనతా పార్టీలో అధికారికంగా చేరారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆధ్వర్యంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. ఆమెతో పాటు మేకప్ ఆర్టిస్ట్ శోభలత పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అక్కడ ఉన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఆమని తమిళ సినిమా నిర్మాతను పెళ్లి చేసుకుని సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు. అయితే, రీఎంట్రీలో పలు చిత్రాలతో బిజీగానే ఉన్నారు. ఈ ఏడాదిలో ఏకంగా 5 చిన్న సినిమాల్లో ఆమె నటించారు.
తెలుగు సినీ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్న ఆమని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. సినీ రంగం నుంచి చాలామంది తమకు నచ్చిన రాజకీయ పార్టీలో చేరడం సహజమే.. కానీ, ఆమని బీజేపీలో చేరడం ప్రాధాన్యత ఉంది. సోషల్‌మీడియా వేదికగా ఇప్పటికే పలు సామాజిక అంశాల గురించి ఆమె మాట్లాడుతూనే ఉన్నారు. ఆమె వాయిస్ బీజేపీకి ఉపయోగపడుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు.
ఆమని తెలుగు, తమిళ సినిమాల్లో రాణించారు. శుభలగ్నం, శుభసంకల్పం, శుభమస్తు, మావిచిగురు, ఘరానా బుల్లోడు, అమ్మ దొంగా వంటి భారీ హిట్ సినిమాల్లో నటించారు. ఈ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వం వహించిన జంబలకిడిపంబ (1993) సినిమాలో నరేష్ సరసన కథానాయకిగా సినీ రంగప్రవేశం చేశారు. ఆ సినిమా భారీ విజయం సాధించడంతో ఆమెకు ఆఫర్స్ వరించాయి. బాపు దర్శకత్వం వహించిన మిస్టర్ పెళ్ళాం సినిమాలో నటించిన ఆమనికి ఉత్తమ నటిగా నంది బహుమతిని అందుకున్నారు. ఆ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ ఫిల్మ్ అవార్డు కూడా దక్కింది.
తమిళ సినీ నిర్మాత ఖాజా మొహియుద్దీన్ను పెళ్ళి చేసుకొని సినిమా రంగానికి దూరమైన ఆమని తిరిగి 2003లో రాంగోపాల్ వర్మ చిత్రం మధ్యాహాన్నం హత్యతో సినీ రంగప్రవేశం చేశారు. ఈమె భర్త నిర్మించిన చిత్రాలు విజయవంతము కాక ఆర్థిక ఇబ్బందులలో పడి 2005 జూలై 14న అత్మహత్యాప్రయత్నం చేశాడు. ఆర్థిక ఇబ్బందులే ఈమె తిరిగి సినిమాలలో నటించడానికి కొంత కారణమని భావిస్తారు.


