
నమ్మకమైన సలహాదారుగా ఈ సెర్చ్ ఇంజిన్
సప్లిమెంట్లు, విటమిన్ల నుంచి షూ వరకు
ఆరోగ్య సంబంధ సందేహాల నివృత్తికీ అదే
భారీగా పెరిగిన శోధనలే ఇందుకు నిదర్శనం
ఒకప్పుడు.. తేలికపాటి అనారోగ్య సమస్య వచ్చినా వైద్యుడి దగ్గరికో దగ్గరిలోని మెడికల్ షాపుకో వెళ్లేవాళ్లం. డాక్టర్ రాసినవో, మెడికల్ షాపువాళ్లు ఇచ్చినవో మందులు తెచ్చుకునేవాళ్లం. దగ్గరివాళ్లు ఇచ్చే ఆరోగ్య సలహా పాటించేవాళ్లం. ఇప్పుడు ఇంటర్నెట్ కాలం నడుస్తోంది. ఆరోగ్యం, శరీర సంరక్షణకు సంబంధించి ప్రజల ప్రవర్తన, ప్రాధాన్యతలు ఎంతలా మారాయంటే సమస్య వచ్చినప్పుడే కాదు ఆర్యోగంగా ఉండేందుకూ ఏం చేయాలో సింపుల్‌గా గూగుల్‌ను అడిగేస్తున్నారు! – సాక్షి, స్పెషల్ డెస్క్
ఆరోగ్యానికి సంబంధించి కొన్ని సమస్యలు, అనుమానాలను.. ఇతరులతో చర్చించడానికి చాలామంది ఇష్టపడరు. అంతేకాదు, హాస్పిటల్‌కు వెళితే ఖర్చు అని వెనకడుగు వేసేవారూ ఉన్నారు. ఇంటర్నెట్ రాక, గూగుల్ సెర్చ్ ఇంజిన్ దైనందిన జీవితంలో భాగమయ్యాక ఇలాంటి వాళ్లందరికీ పెద్ద ఉపశమనం లభించినట్టు అయింది. చిన్న సమస్య తలెత్తినా, అనుమానం ఉన్నా, వేరొకరికి చెప్పలేనిదైనా.. ఒకరిపై ఆధారపడకుండా సింపుల్‌గా గూగుల్‌ని అడిగేస్తున్నారు.
అంతర్జాతీయ మార్కెటింగ్ డేటా, అనలిటిక్స్ కంపెనీ ‘కాంటార్’ రూపొందించిన ‘హెల్త్ అండ్ వెల్‌నెస్ ఇన్ ఇండియా’ నివేదికే ఇందుకు నిదర్శనం. హెల్త్, వెల్‌నెస్‌కు సంబంధించి 2024లో నెటిజన్లు గూగుల్‌లో వెతికిన 110 రకాలకుపైగా అంశాలను విశ్లేషించి ఈ నివేదిక రూపొందించారు.
‘మన’ గూగుల్
‘ఫలానా ఉత్పత్తి వాడాను, చాలా బాగా పనిచేసింది’. ‘ఫలానా పద్ధతి పాటించడం వల్ల పరిష్కారం దొరికింది’ అంటూ మన అనుకున్నవారిచ్చే సలహా పాటిస్తాం. మరి మన అని అనుకున్నవారు లేకపోతే? గూగుల్‌ను ఆశ్రయిస్తున్నారు! ప్రపంచవ్యాప్తంగా రోజుకు 850 కోట్ల వరకు గూగుల్ సెర్చెస్ నమోదవుతున్నాయంటే ఏ స్థాయిలో ఈ సెర్చ్ ఇంజిన్ ‘మన’ అయిందో అర్థం చేసుకోవచ్చు.
భారత్ నుంచి గూగుల్‌లో నెలకు 1,200 కోట్ల విజిట్స్ నమోదవుతున్నట్టు సమాచారం. ఈ విషయంలో యూఎస్ తర్వాత రెండో స్థానం మనదే. అయితే సెర్చ్ ఇంజిన్ చూపించే ఉత్పాదనను ఎంత మంది కొన్నారు, రేటింగ్స్ ఏంటి, రివ్యూలు ఏం చెబుతున్నాయో తెలుసుకున్నాకనే యూజర్లు అడుగు ముందుకేస్తున్నారు.
జాగ్రత్త అవసరం
గూగుల్ లాంటి సెర్చ్ ఇంజిన్లను నమ్మి ఔషధాలు కొని, వాడేయటం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వైద్యుడు.. పేషెంట్ శరీర తత్వాన్ని పూర్తిగా తెలుసుకుని మందులు సిఫార్సు చేస్తాడు. కానీ గూగుల్ అలాకాదు.. సాధారణీకరించి మందులు చెప్పేస్తుంది. అందువల్ల గూగుల్ సలహాల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటున్నారు.
ఎక్కువగా సెర్చ్ చేసిన అంశాలు
పోషకాలు–సప్లిమెంట్లు, ప్రత్యామ్నాయ వైద్యం, చర్మ సంరక్షణ, శారీరక దృఢత్వం, శరీర బరువు నిర్వహణ, మానసిక ఆరోగ్యం, మహిళల ఆరోగ్యం, నిద్ర, రోగనిరోధక శక్తి, అధునాతన వైద్యం, డీటాక్సిఫికేషన్ , దీర్ఘాయువు, బీ12 అధికంగా ఉండే ఆహారం, నడకకు ఉత్తమమైన షూ, సున్నిత చర్మానికి సౌందర్య సాధనాలు, చక్కెర లేని ఆహార పదార్థాలు.. వగైరా.
టాప్–5 పోకడలు
నమ్మదగిన ఆరోగ్య పరిష్కారాలు
ప్రత్యక్షంగా కనిపించే, నమ్మకమైన ఫలితాలను వినియోగదారులు కోరుకుంటున్నారు. చర్మ సంరక్షణ, శరీర బరువు నిర్వహణ, వ్యాయామంపై 2.66 కోట్ల సెర్చులు నమోదయ్యాయి. 2023తో పోలిస్తే ఇవి 39% పెరిగాయి. చర్మ ఆరోగ్యానికి కొల్లాజెన్, మెరుగైన నిద్ర కోసం మెలటోనిన్, శక్తి కోసం ప్రీ–వర్కౌట్ సప్లిమెంట్స్ కోసం జనంలో ఆసక్తి పెరిగింది.
క్లినికల్, స్వీయ–సంరక్షణ
సైన్ ్స ఆధారిత వెల్‌నెస్ ఎక్కువగా కోరుకుంటున్నారు. బరువు తగ్గించే జీఎల్‌పీ–1 మందులు, జ్ఞాపకశక్తి పెంచే సప్లిమెంట్లు, హార్మోన్ల ట్రాకింగ్ కోసం 1.46 కోట్ల శోధనలు జరిగాయి. 2023తో పోలిస్తే ఇవి 13 శాతం ఎక్కువ.
అంతర్గత ఆరోగ్యం–బాహ్య శక్తి
అందం, మానసిక స్థితి, శరీర బరువు నిర్వహణ, వృద్ధాప్యం వంటి సమస్యలు.. పోషకాహారం, పేగు (గట్) ఆరోగ్యం, రోగనిరోధక శక్తితో ముడిపడి ఉన్నాయని చాలామంది భావిస్తున్నారు. ఈ తరహా సెర్చ్‌లు 1.45 కోట్ల వరకు జరిగాయి. చర్మం, జుట్టు ఆరోగ్యానికి సహకరించే ఔషధాలు, మల్టీవిటమిన్ లపై జనంలో ఆసక్తి పెరిగింది.
ఆరోగ్యకర దినచర్యలు
రోజువారీ దినచర్యలు, ఆరోగ్య నిర్వహణలపై ప్రజల శ్రద్ధ పెరిగింది. 9% పెరుగుదలతో ఈ విభాగంలో 99 లక్షల శోధనలు నమోదయ్యాయి. హైడ్రేషన్, ఋతు చక్రం, ధ్యానం, యోగా వంటివి ట్రాక్ చేయడానికి సాంకేతికతను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మహిళలు నెలసరి సమస్యలపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
ప్రత్యామ్నాయ వైద్యం
ఆయుర్వేదం, హోమియోపతి, ఆక్యుపంక్చర్, డిటాక్స్ టీ, బయోహ్యాకింగ్ వంటి వాటి గురించి 17% వృద్ధితో 87 లక్షల సెర్చ్‌లు జరిగాయి. (శాస్త్ర, సాంకేతికతల సాయంతో మన శరీరాన్ని, మనసును ఆరోగ్యంగా ఉంచుకోవడం లేదా ఆరోగ్యాన్ని మరింత మెరుగుపర్చుకోవడాన్ని బయో హ్యాకింగ్ అంటారు.)
పోషకాలు–సప్లిమెంట్లు
విటమిన్ బీ12 కోసం 27 లక్షల శోధనలు నమోదయ్యాయి. 2023తో పోలిస్తే ఇవి 54 శాతం ఎక్కువ కావడం గమనార్హం.
చర్మ ఆరోగ్యం
సున్నితమైన చర్మం కోసం సెర్చులు 30% పెరిగాయి.
బరువు నిర్వహణ
జీఎల్‌పీ1 ఔషధాలైన ఓజెంపిక్ కోసం 216%, జెప్‌బౌండ్‌కు 943% అధికంగా సెర్చులు నమోదయ్యాయి.
ఒత్తిడి తగ్గేందుకు
కార్టిసాల్ కోసం శోధనలు 59% పెరిగాయి.
మహిళల ఆరోగ్యం
గతంతో పోలిస్తే.. రుతుచక్రంలోని దశల గురించి వెతకడం 100 శాతానికిపైగా పెరిగింది.
నిద్ర
మెలటోనిన్ సంబంధిత స్ప్రే, గమ్మీలు, ట్యాబ్లెట్ల కోసం సెర్చులు 27% పెరిగి 45 లక్షలకు చేరుకున్నాయి.
చక్కెర
చక్కెర రహిత, చక్కెరకు ప్రత్యామ్నాయాల కోసం.. గతంలో కంటే 14 శాతం ఎక్కువగా 74 లక్షల శోధనలు జరిగాయి.