
గుండె మార్పిడి రోగులకు రియల్ టైం సమాచారం కోసం వాట్సాప్ గ్రూప్
హార్టియెస్ట్ పీపుల్ పేరిట సేవలందిస్తున్న 240 మంది గుండెమార్పిడి చేయించుకున్న వ్యక్తులు
సాక్షి, హైదరాబాద్: వారంతా సరికొత్త హృదయాలతో కొంగొత్త జీవనం గడుపుతున్నారు.. కానీ ఆ పునర్జన్మ పొందేందుకు పడిన కష్టనష్టాలు, వ్యయప్రయాసలు తమ లాంటి వైద్య పరిస్థితి ఎదుర్కొంటున్న వారికి రాకూడదని నిర్ణయించుకున్నారు. అందుకే గుండె మార్పిడి శస్త్రచికిత్సల కోసం నిరీక్షిస్తున్న రోగుల కోసం నిరంతరం హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ల సంబంధ సమాచారం అందించేందుకు వీలుగా హారి్టయెస్ట్ పీపుల్ పేరిట ఓ వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా గుండె మార్పిడి ఆపరేషన్లు చేయించుకున్న 240 మంది వ్యక్తులు, వారి కుటుంబీకులు కలిసి దీన్ని నిర్వహిస్తున్నారు. గుండె మార్పిడికి ముందు, ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల వివరాలను ఎప్పటికప్పుడు గ్రూప్‌లో షేర్ చేస్తూ రోగులు, వారి కుటుంబ సభ్యులకు చేదోడువాదోడుగా నిలుస్తున్నారు.
కీలక సమయంలో సహాయం..
గ్రూప్ వ్యవస్థాపక సభ్యురాలు, గ్రూప్ అడ్మిన్లలో ఒకరైన ముంబైకి చెందిన ఆర్మైటీ హోమి ఇందులో కీలకంగా వ్యవహరిస్తున్నారు. పదేళ్ల క్రితం గుండె మార్పిడి ఆపరేషన్ కోసం తన కుమార్తెను ఎయిర్ అంబులెన్స్‌లో చెన్నైకి తరలించే క్రమంలో ఎదురైన సమస్యలు, సవాళ్లు ఇతర రోగులకు ఎదురవకుండా చూసేందుకే వాట్సాప్ గ్రూప్‌కు శ్రీకారం చుట్టినట్లు ఆమె పేర్కొన్నారు. ‘చాలా మంది గుండె, ఇతర అవయవాల మార్పిడి కోసం చిన్న పట్టణాల నుంచి ముంబై, ఢిల్లీ, చెన్నై వంటి మహానగరాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ కీలక సమయంలోనే మా గ్రూప్ సభ్యులు అవసరమైన సహాయం చేస్తారు’అని హోమి వివరించారు. ఐఐటీ బాంబే మాజీ ప్రొఫెసర్, ఏడేళ్ల క్రితం గుండె మార్పిడి చేయించుకున్న డా. వినీ కిర్పాల్ సైతం ఈ గ్రూప్‌లో చేరారు.
తనకు ఎదురైన అనుభవాల సారంతో ఇప్పటికే ‘న్యూ లైఫ్ న్యూ బిగినింగ్స్’పుస్తకం ద్వారా అవయవ గ్రహీతలు, దాతలు, అవయవ మార్పిడి వైద్యుల విశ్లేషణలు, అభిప్రాయాలను వినీ కిర్పాల్ వెలుగులోకి తీసుకొచ్చారు. మరో గ్రూప్ సభ్యురాలు, కిడ్నీ గ్రహీత జయ జైరామ్.. 28 ఏళ్లకుపైగా అవయవదాన రంగంలో కీలకపాత్ర పోషిస్తున్న మోహన్ ఫౌండేషన్ (మల్టీ ఆర్గాన్ హార్వెస్టింగ్ ఎయిడ్ నెట్‌వర్క్) ముంబై విభాగానికి ప్రాజెక్ట్ కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. బ్రెయిన్ డెడ్‌కు గురయ్యే రోగుల కుటుంబాలను అవయవదానానికి ప్రోత్సహించడంపై ఆమె దృష్టిపెట్టారు.