
పాన్ ఇండియా స్థాయికి మన ఇండస్ట్రీ ఎదిగిపోయింది అని అనుకుంటున్నాం కానీ నిర్మాతల పరిస్థితి ఘోరంగానే ఉంది. ఒకప్పటితో పోలిస్తే సినిమాల్లో సరైన కంటెంట్ ఉండట్లేదు. దీంతో ప్రేక్షకులు కూడా థియేటర్లకు వచ్చి చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. దానికి తోడు స్టార్ హీరోలు కూడా రీమేక్స్ చేయడం, అవి డిజాస్టర్ కావడం అడపాదడపా జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఓ నిర్మాత.. తను తీసిన ఓ రీమేక్ వల్ల ఎదురైన అనుభవాన్ని బయటపెట్టారు.
అప్పట్లో దూకుడు, లెజెండ్, వన్ నేనొక్కడినే తదితర సినిమాలు తీసిన అనిల్ సుంకర.. గత కొన్నాళ్లలో మాత్రం ఘోరమైన నష్టాల్ని చవిచూశారు. మహాసముద్రం, ఏజెంట్, భోళా శంకర్ తదితర చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. ఈయనకు నష్టాల్ని మిగిల్చాయి. ప్రస్తుతం నిర్మాణాన్ని పక్కనబెట్టి 'షో టైమ్' పేరుతో ఓ రియాల్టీ షో తీస్తున్నారు. దీని లాంచ్ శనివారం జరగ్గా.. ఇందులోనే మాట్లాడుతూ చిరంజీవితో తీసిన 'భోళా శంకర్' గురించి పరోక్షంగా కామెంట్ చేశారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ... తెలుగులోనూ)
'ఏదైనా ఫ్లాప్ సినిమా రాగానే అసలు కథ వినే తీశారా? అని నన్ను అడుగుతుంటారు. కథలు వినకుండా మూవీస్ ఎందుకు చేస్తారు అని కూడా అడుగుతారు. ఓసారి నేను ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీస్‌కి వెళ్తే.. అక్కడ పనిచేస్తున్న ఓ క్లర్క్ నన్ను చూసి జాలిపడ్డాడు. ఎందుకండీ స్టోరీ లేని సినిమాలు చేస్తున్నారు అని అన్నాడు. నేను తీసింది రీమేక్ అని చెప్పినా అతడికి అర్థం కాలేదు. రీమేక్ ఆడలేదు నేనేం చేస్తాను? అని చెప్పాను. ఈ పాటికే మీకు సినిమా ఏంటనేది అర్థమై ఉంటుంది కదా!' అని తనకు ఎదురైన విచిత్ర అనుభవాన్ని బయటపెట్టారు.
మెహర్ రమేశ్ దర్శకత్వం వహించిన 'భోళా శంకర్'లో చిరంజీవి హీరోగా నటించారు. అనిల్ సుంకర నిర్మించారు. తమిళంలో హిట్ అయిన 'వేదాళం' అనే మూవీ రీమేక్‌గా దీన్ని తెరకెక్కించారు. అయితే రిలీజ్‌కి ముందే విమర్శలు ఎదుర్కొన్న 'భోళా శంకర్'.. థియేటర్లలోకి వచ్చిన తర్వాత మరిన్ని ట్రోల్స్‌కి గురైంది. చిరంజీవి ఇలాంటి మూవీ ఎందుకు చేశారా? అని అందరూ మాట్లాడుకున్నారు. అలాంటిది ఇప్పుడు స్వయంగా నిర్మాతనే పరోక్షంగా ఈ సినిమాని మరోసారి గుర్తుచేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: కోకాపేటలో ఇల్లు కొన్న బేబక్క.. పిల్లి కోసం స్పెషల్‌గా..)