
సాధారణంగా స్పోర్ట్స్ డ్రామా సినిమాలంటే అంతంత మాత్రంగానే వర్కౌట్ అవుతుంటాయి. కొన్నిసార్లు మాత్రం బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తుంటాయి. అలా కొన్నాళ్ల క్రితం థియేటర్లలోకి వచ్చిన ఓ హాలీవుడ్ మూవీ.. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియుల్ని అలరించింది. రిలీజై దాదాపు నెలన్నర కావొస్తున్న ఇప్పటికీ ప్రేక్షకుల్ని రప్పిస్తోంది. అలాంటిది ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులోకి రానుంది?
హాలీవుడ్ సినిమాలు అప్పుడప్పుడు చూసినా సరే నటుడు బ్రాడ్ పిట్ కాస్త పరిచయం ఉండే ఉంటాడు. అతడు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'ఎఫ్ 1'. కార్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ కథతో తెరకెక్కించగా.. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. తెలుగులోనూ రిలీజ్ చేయగా.. మన ఆడియెన్స్ కూడా చూసి ప్రశంసించారు. ఇప్పుడు ఈ చిత్రం ఆగస్టు 22 నుంచి అమెజాన్ ప్రైమ్, ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీల్లో అందుబాటులోకి రానుంది.
(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు)
'ఎఫ్ 1' విషయానికొస్తే.. ఫార్ములా వన్ రేసులో డ్రైవర్‌గా అదరగొట్టిన సన్నీ హెయస్ (బ్రాడ్ పిట్).. కెరీర్‌కి రిటైర్మెంట్ ఇచ్చి, వ్యాన్ డ్రైవర్ పనిచేస్తుంటాడు. అలా వయసు పైబడిన సన్నీకి ఏపీఎక్స్‌జీపీ (APXGP) అనే టీమ్‌లో రేసర్‌గా పనిచేయాలని అవకాశం ఇస్తారు. అయితే రేసింగ్ నుంచి తప్పుకొని చాలారోజులు అయిపోవడంతో సన్నీకి ఇప్పుడు చాలా సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా తన జట్టులోని యువకుడైన జోషువా పియర్స్ (డామ్సన్ ఐడ్రీస్) దూకూడు తట్టుకోవడం, అతడి నుంచి ఎదురైన అవమానాలు భరించడం కష్టంగా ఉంటుంది.
అసలు స్పానిష్ గ్రాండ్ ప్రీ రేసింగ్ తర్వాత సన్నీ.. ఎందుకు రేసింగ్ నుంచి తప్పుకొన్నాడు? మళ్లీ ఫార్ములా వన్ రేసింగ్ ట్రాక్ పైకి వచ్చిన సన్నీకి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? చివరకు విజేతగా నిలిచాడా లేదా అనేది మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: ఫహాద్ ఫాజిల్ కామెడీ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)
