
కోలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించి మెప్పించిన మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil), వడివేలు నటించిన చిత్రం 'మారీశన్'(Maareesan).. జులైలో విడుదలైన ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. కామెడీ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రం తమిళ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఈ మూవీ సుదీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కింది. థియేటర్స్‌లో ప్రేక్షకులను నవ్వించడంతో పాటు ఉత్కంఠతకు గురిచేసింది. కోవై సరళ, వివేక్ ప్రసన్న, సితార, లివింగ్‌స్టన్, తీనప్పన్, రేణుక, శరవణన్ సుబ్బయ్య వంటి వారు నటించారు. సంగీతం యువన్ శంకర్ రాజా అందించారు.

ఆగష్టు 22 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో మారీశన్ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ,కన్నడ, మలయాళంలో విడుదల కానున్నట్లు ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా ఫహాద్ ఫాజిల్‌కి మరో విభిన్న పాత్రను అందించగా, వడివేలు హాస్యంతో పాటు భావోద్వేగాన్ని కూడా చూపించారు. మీరు కామెడీ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడితే.. మారీశన్ తప్పక చూడవచ్చు.
దయాలన్ (ఫహాద్ ఫాజిల్) అనే దొంగ, వేలాయుధం పిళ్లై (వడివేలు) అనే అల్జీమర్స్ బాధితుడి వద్ద చాలా డబ్బు ఉందని తెలుసుకుంటాడు. వేలాయుధం తన స్నేహితుడిని కలవడానికి ఊరికి బయలుదేరుతాడు. దయాలన్ అతన్ని మాటలతో మాయ చేసి, తన బైక్‌పై తీసుకెళ్తాడు. ఆ ప్రయాణంలో ఏం జరిగింది? దయాలన్ దోచుకున్నాడా..? లేక వేలాయుధం పరిస్థితిని చూసి మారిపోయాడా..? అనే ప్రశ్నలకి సమాధానం ఈ సినిమాలో ఉంటుంది.