
ప్రథమార్ధంలో 59 లక్షల యూనిట్లు
టాప్ మోడల్ ఐఫోన్ 16
ఐడీసీ డేటాలో వెల్లడి
న్యూఢిల్లీ: ఈ ఏడాది ప్రథమార్ధంలో భారత్‌లో యాపిల్ ఉత్పత్తుల సరఫరా వార్షికంగా 21.5 శాతం పెరిగి 59 లక్షల యూనిట్లకు చేరుకుంది. అత్యధికంగా సరఫరా అయిన మోడల్‌గా ఐఫోన్ 16 నిల్చింది. మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) ఓ నివేదికలో ఈ విషయాలు తెలిపింది.
దీని ప్రకారం గతేడాది ప్రథమార్ధంతో పోలిస్తే దేశీ మార్కెట్లో స్మార్ట్‌ఫోన్ల సరఫరా 0.9 శాతం పెరిగి 7 కోట్లకు చేరింది. పోకో, షావోమీ, వన్‌ప్లస్, రియల్‌మి తదితర చైనా సంస్థల ఫోన్ల సప్లై తగ్గింది. ఇక రెండో త్రైమాసికంలో మొత్తం 3.7 కోట్ల స్మార్ట్‌ఫోన్స్ సరఫరా అయ్యాయి. యాపిల్ ఐఫోన్ల సరఫరా 19.7 శాతం పెరిగి 27 లక్షల యూనిట్లకు చేరింది. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 7.5 శాతం వాటా దక్కించుకుంది.
మరిన్ని విశేషాలు..
→ జూన్ క్వార్టర్‌లో 19 శాతం మార్కెట్ వాటాతో వివో అగ్ర స్థానంలో (23.5 శాతం వార్షిక వృద్ధి) నిల్చింది. 14.5 శాతం వాటాతో శాంసంగ్ (21 శాతం వృద్ధి) రెండో స్థానంలో ఉంది. ఒప్పో (13.4 శాతం వాటా, 25.4 శాతం వృద్ధి), మోటరోలా (8 శాతం వాటా, 39.4 శాతం వృద్ధి) ఆ తర్వాత ర్యాంకుల్లో ఉన్నాయి.
→ వన్‌ప్లస్ మార్కెట్ వాటా 4.4 శాతం నుంచి 2.5 శాతానికి, సరఫరా 39.4 శాతం మేర పడిపోయాయి.
→ రియల్‌మి మార్కెట్ వాటా 9.7 శాతానికి, స్మార్ట్‌ఫోన్ల సప్లై 17.8 శాతం మేర క్షీణించాయి. అటు షావోమీ మార్కెట్ వాటా కూడా 9.6 శాతానికి, వాల్యూమ్స్ 23.5 శాతం స్థాయిలో తగ్గాయి. పోకో 3.8 శాతానికి తగ్గగా, సరఫరా 28.8 శాతం మేర క్షీణించింది.
→ ప్రీమియం సెగ్మెంట్ డివైజ్‌లు (రూ.52,000 నుంచి రూ. 70,000 వరకు) అత్యధికంగా 96.4% వృద్ధి చెందాయి. మార్కెట్ వాటా 2 నుంచి 4 శాతానికి పెరిగింది. ఈ విభాగంలో ఐఫోన్ 16/15ల వాటా అయిదింట మూడొంతులు ఉంది.
→ సూపర్ ప్రీమియం సెగ్మెంట్ ఫోన్లు (రూ. 70,000 కన్నా పైన) 15.8% వృద్ధి చెందగా, మార్కెట్ వాటా పెద్దగా మార్పులు లేకుండా 7 శాతంగా కొనసాగింది. శాంసంగ్, యాపిల్ మార్కెట్ వాటా వరుసగా 49%, 48%గా ఉంది. ఈ సెగ్మెంట్లో ఐఫోన్ 16, గెలాక్సీ ఎస్25, ఎస్24 అల్ట్రా, ఎస్25, ఐఫోన్ 16ప్లస్ కీలక మోడల్స్‌గా ఉన్నాయి.
→ స్మార్ట్‌ఫోన్ల సగటు విక్రయ ధర (ఏఎస్‌పీ) 10.8% పెరిగి రికార్డు స్థాయిలో 275 డాలర్లకు చేరింది.
→ ఎంట్రీ స్థాయి (రూ. 8,700 లోపు) సెగ్మెంట్ 22.9 శాతం వృద్ధి చెందింది. గతేడాది క్వార్టర్‌తో పోలిస్తే మార్కెట్ వాటాను 14 శాతం నుంచి 16 శాతానికి పెరిగింది.
→ మాస్ బడ్జెట్ సెగ్మెంట్ (రూ. 8,700 నుంచి రూ. 17,400 వరకు) ఫోన్ల సరఫరా పరిమాణం 1.1 శాతం పెరగ్గా, ఎంట్రీ ప్రీమియం సెగ్మెంట్ (రూ. 17,400 – రూ. 35,000) సరఫరా 2.5 శాతం, మార్కెట్ వాటా 30 శాతం నుంచి 27 శాతానికి తగ్గాయి.