
మెజార్టీ ఫోన్ల తయారీ ఇక మన దేశంలోనే
వెల్లడించిన యాపిల్ సీఈఓ టిమ్ కుక్
2026 నాటికి అగ్ర రాజ్యానికి 6 కోట్ల యూనిట్లు
భారత్‌లో ఐఫోన్ల తయారీ సామర్థ్యం పెంపు
చైనాపై ఆధారపడడం తగ్గించేందుకే నిర్ణయం
టాటా కొత్త ప్లాంటులో ప్రారంభమైన ఉత్పత్తి
కొద్ది రోజుల్లో ఫాక్స్‌కాన్ నూతన ప్లాంటులోనూ
ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో అమెరికాలో విక్రయించే మెజార్టీ ఐఫోన్లు భారత్‌లో తయారైనవే ఉంటాయని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో అమ్మేవి కాకుండా ఇతర దేశాల్లో విక్రయించే ఉత్పత్తులు మాత్రమే అత్యధికంగా చైనాలో తయారవుతాయని స్పష్టం చేశారు. టిమ్ కుక్ నిర్ణయం వెనక కారణాలేంటి? భారీ టారిఫ్‌ల కారణంగా యాపిల్ కంపెనీ నెమ్మదిగా చైనాతో తెగతెంపులు చేసుకుంటోందా? ఈ నిర్ణయంతో మనదేశానికి లాభమేంటి? – సాక్షి, స్పెషల్ డెస్క్
దిద్దుబాటలో కంపెనీ..
ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ల ఉత్పత్తిలో చైనా వాటా ఏకంగా 75% పైగా ఉంది. ఈ అంశమే ఇప్పుడు యాపిల్‌కు కష్టాలను తెచ్చిపెట్టింది. యూఎస్–చైనా వాణిజ్య యుద్ధం తారాస్థాయికి చేరడమే ఇందుకు కారణం. చైనా నుంచి యూఎస్‌కు దిగుమతయ్యే వస్తువులపై ట్రంప్ సర్కార్ భారీగా 145% సుంకాలు విధించడం.. ఆ తరువాత ప్రతీకార సుంకాల నుంచి స్మార్ట్‌ఫోన్స్‌ను మినహాయించడంతో వీటిపై టారిఫ్ కాస్తా 20%కి వచ్చి చేరింది. టారిఫ్‌ల విషయంలో ప్రస్తుతానికి ఉపశమనం ఉన్నా.. తయారీపై సింహభాగం ఒక దేశంపై ఆధారపడడం ఏమాత్రం శ్రేయస్కరం కాదన్న వాస్తవం యాపిల్‌కు అర్థం అయినట్టుంది.
అందుకే చైనాలో తయారీ తగ్గించి భారత్‌పై ఫోకస్ చేసింది. యూఎస్ మార్కెట్‌కు పూర్తిగా భారత్ నుంచే ఐఫోన్లను సరఫరా చేయాలని నిర్ణయించింది. జనవరి–మార్చి కాలంలో రూ.48,000 కోట్ల విలువైన మేడిన్‌ఇండియా ఐఫోన్స్ యూఎస్‌కు ఎగుమతి అయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో ఎగుమతైన ఫోన్ల విలువ రూ.28,500 కోట్లు. మొత్తం ఐఫోన్స్ తయారీలో గత ఏడాది భారత్ వాటా 20% ఉంది. 2025లో ఇది 25–30 శాతానికి చేరే అవకాశం ఉంది.
రెండు కొత్త ప్లాంట్లు..
యూఎస్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని చైనాకు ప్రత్యామ్నాయ తయారీ స్థావరంగా భారత్‌ను తీర్చిదిద్దే పనిలో యాపిల్ నిమగ్నమైంది. ఈ నిర్ణయం భారత్‌కు లాభించే విషయమే. ఈ క్రమంలో యాపిల్ ఉత్పత్తులను తయారు చేస్తున్న భాగస్వామ్య కంపెనీలూ తమ సామర్థ్యాన్ని విస్తరిస్తున్నాయి. తమిళనాడులోని హోసూర్ వద్ద ఉన్న టాటా ఎల్రక్టానిక్స్ కొత్త ప్లాంట్‌లో ఐఫోన్ల తయారీ ఇటీవలే ప్రారంభం అయింది. కర్ణాటకలోని బెంగళూరు వద్ద రూ.22,139 కోట్లతో ఫాక్స్‌కాన్‌నిర్మిస్తున్న కేంద్రంలో కొద్ది రోజుల్లో తొలి దశ ఉత్పత్తి మొదలు కానుంది.
ఐఫోన్స్ ముచ్చట్లు..
⇒ 2024లో ప్రపంచవ్యాప్తంగా 23.2 కోట్ల ఐఫోన్ల అమ్మకాలు
⇒ 2024లో దేశంలో ఐఫోన్ల విక్రయాల్లో 35% వృద్ధి. 1.2 కోట్ల ఐఫోన్ల అమ్మకాలు.
⇒ భారత స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లో అమ్మకాల విలువ పరంగా అగ్రస్థానంలో ఐఫోన్.
⇒ 2024–25లో భారత్ నుంచి రూ.1,50,000 కోట్ల విలువైన ఐఫోన్లు ఎగుమతి. 2023–24లో ఇది రూ.85,000 కోట్లు.
⇒ గత ఆర్థిక సంవత్సరంలో దేశంలో 4.3 కోట్ల యూనిట్ల యాపిల్ ఫోన్లు తయారయ్యాయి.
వాటా రెండింతలకు..
దేశంలో 2017 నుంచి ఐఫోన్ల అసెంబ్లింగ్ మొదలైంది. 2026 చివరినాటికి భారత్‌లో ఏటా 7–8 కోట్ల ఐఫోన్లు ఉత్పత్తి కానున్నాయని నివేదికలు చెబుతున్నాయి. అలాగే ఒక్క యూఎస్ కోసమే 6 కోట్ల యూనిట్లను భారత్ నుంచి దిగుమతి చేసుకోవాలని కంపెనీ నిర్ణయించినట్లు సమాచారం. గత ఆర్థిక సంవత్సరంలో దేశంలో 4.3 కోట్ల యాపిల్ ఫోన్లు తయారయ్యాయి. వీటి విలువ రూ.1,87,000 కోట్లు. ఇందులో 80% ఎగుమతులు. ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ల తయారీలో భారత్ వాటా 18 నెలల్లో రెండింతలకు చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. కాగా, ఐఫోన్స్‌ను తయారు చేయడానికి చైనా నుండి కీలక యంత్రాలను దిగుమతి చేసుకోవడానికి అనుమతిలో పెరుగుతున్న జాప్యం ఐఫోన్ 17 విడుదలను మాత్రమే కాకుండా.. దేశం నుండి ఫోన్ల ఉత్పత్తిని రెట్టింపు చేయాలనే కంపెనీ ప్రణాళికను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది.
యాప్ స్టోర్ సైతం..
ఎలక్ట్రానిక్స్ తయారీలో ప్రపంచంలో అతిపెద్దదైన యాపిల్ కంపెనీకి భారత్‌లో ఐఓఎస్ యాప్ వ్యవస్థ 2024లో రూ.44,447 కోట్ల ఆదాయం సమకూర్చింది. యాపిల్‌కు గత ఏడాది అన్ని విభాగాల్లో కలిపి భారత్ సుమారు రూ.2.3 లక్షల కోట్ల ఆదాయాన్ని అందించినట్టు తెలుస్తోంది. భారత్‌లో డెవలపర్లకు అద్భుత అవకాశాలు ఉన్నాయని యాపిల్ సీఈవో టిమ్ కుక్ గతంలో అన్నారు. ప్రతి వారం సగటున 2.2 కోట్ల మంది ఇండియా యాప్ స్టోర్‌ను వినియోగిస్తున్నారు. 2024లో యాప్ డౌన్‌లోడ్స్ 110 కోట్లకుపైమాటే.