
సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా, భవిష్యత్ సురక్షితంగా ఉండేలా అట్టడుగు వర్గాల బాలికలకు ఉచిత హెచ్‌పీవి వ్యాక్సిన్ అందించే లక్ష్యంగా సుదీర్ఘ కారు యాత్ర ప్రారంభించారు ప్రియా రాజ్‌గోపాల్, మీనాక్షి సాయి. ‘హెచ్‌పీవీ–ఫ్రీ ఇండియా’ నినాదంతో ముంబైలో మొదలైన ఈ కారు యాత్ర 40 రోజుల్లో 15 రాష్ట్రాలను చేరుతుంది.
తాము వెళ్లిన ప్రాంతాలలో గర్భాశయ క్యాన్సర్, నివారణ గురించి పేదింటి మహిళలకు అవగాహన కలిగిస్తున్నారు ప్రియా, మీనాక్షి. ప్రస్తుతం వారి యాత్ర తమిళనాడుకు చేరింది. అక్కడ వారికి ఘనస్వాగతం లభించింది.
చెన్నైలోని అడయార్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌లో డా.జయశ్రీ ఆధ్వర్యంలో 50 మంది నిరుపేద బాలికలు ఉచిత హెచ్‌పీవి టీకా తీసుకున్నారు. హెచ్‌పీవీ వ్యాక్సిన్ సర్వైకల్ క్యాన్సర్‌కు మాత్రమే కాకుండా వెజైనల్ క్యాన్సర్, వల్వర్ క్యాన్సర్‌లను కూడా నివారిస్తుంది. లక్షమంది నిరుపేద బాలికలకు హెచ్‌పీవీ టీకా వేయించాలనేది ప్రియా రాజ్‌గోపాల్, మీనాక్షి సాయిల లక్ష్యం. మనోబలం మూర్తీభవించిన ఈ మహిళలకు అదేమీ పెద్ద కష్టం కాబోదు.