breaking news
Car Travels
-
థక్ థక్ గ్యాంగ్: కాలు తొక్కారు.. అద్దం దించండి
ఢిల్లీలో ఒంటరిగా కారు నడుపుతున్న స్త్రీల వస్తువుల చోరీకి ఒక గ్యాంగ్ ప్రయత్నిస్తోంది. ఆ గ్యాంగ్‌ను థక్‌థక్ గ్యాంగ్ అంటారు. వీరు ఎలా చోరీ చేస్తారు? ఒంటరి స్త్రీలు కారు ప్రయాణం చేసేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? విస్తృతంగా వాహనాలు నడుపుతున్న స్త్రీలూ... బహుపరాక్. థక్‌థక్ గ్యాంగ్ ఎక్కడైనా ఉండొచ్చు. సంఘటన 1: నిర్మానుష్య ప్రాంతం అక్కర్లేదు. బాగా రద్దీ ఉన్న రోడ్డు మీదే. ట్రాఫిక్ సమయంలోనే. మీరు కారు మెల్లగా పోనిస్తుంటారు. ఒక మనిషి మీ కారు ముందు నుంచి దాటుతాడు. ఆ తర్వాత వేగంగా వెనక్కు వచ్చి మీ పక్క అద్దం మీద ‘టక్ టక్’మని వేలితో కొట్టి అద్దం దించమని కోపంగా అంటాడు. ‘నా కాలు తొక్కావు. అద్దం దించు’ అని హడావిడి చేస్తాడు. మీరు కంగారులో అద్దం దించుతారు. అంతే! మీ పక్క సీటులో మీరు ఉంచుకున్న హ్యాండ్‌బ్యాగ్, పర్స్, ల్యాప్‌టాప్ తీసుకుని తుర్రుమంటాడు. మీరు కారు దిగి వెంటాడ లేరు. ట్రాఫిక్‌లో ఉంటారు. ఇదీ ‘టక్ టక్’ లేదా ‘థక్‌థక్ గ్యాంగ్’ నేరం చేసే తీరు. సంఘటన 2: ఇలాగే ట్రాఫిక్‌లో మీరు వెళుతుంటారు. మెల్లగా వెళుతున్న మీ కారు వెనుక టైరు ఏదో ఎక్కి దిగినట్టుగా అవుతుంది. వెంటనే ఒక మనిషి డ్రైవింగ్ సీట్ దగ్గరకు వచ్చి అద్దం మీద బాది ‘నా కాలు తొక్కావ్’ అంటాడు. మీరు ఇంజన్ ఆఫ్ చేసినా, కారు పక్కకు తీసి ఆ మనిషితో వాదనకు దిగినా, మరో మనిషి మీ కారు వెనుక సీటులో ఉన్న వస్తువు తీసుకుని ఉడాయిస్తాడు. మీరు స్లోగా వెళుతున్నప్పుడు వెనుక టైరు కింద రాయి పెట్టి కాలు తొక్కిన భావన కలిగిస్తారు. ఇంకా ఏం చేస్తారు?: మీ కారు బైక్ మీద వెంబడించి ఇంజన్ లీక్ అవుతుంది అంటారు. అలా అనిపించడానికి వారే వెనుక కొంత ఆయిల్ వేస్తారు. మిమ్మల్ని అలెర్ట్ చేసిన వారు మిమ్మల్ని దాటి వెళ్లిపోతారు. కాని మీరు కారు ఆపి ఇంజన్ ఆయిల్‌ను చెక్ చేస్తుంటే ఇంకో బ్యాచ్ వచ్చి డోర్లు తీసి దోచుకుని పోతుంది. కారు ఎక్కేటప్పుడు కొన్ని నోట్లు కింద పడేసి మీ డబ్బు పడింది అంటారు. మీరు నోట్లు ఏరుకుంటుంటే కారులో ఉన్న వస్తువులు పట్టుకెళతారు. బ్యాక్ టైర్ పంక్చర్ అయ్యిందని చెప్తారు. కారు ఆపితే అంతే సంగతులు. కొన్నిసార్లు క్యాటపల్ట్ (క్యాట్‌బాల్)తో రాయి విసిరి అద్దం మీద కొడతారు. టప్పున అద్దం తాకితే మీరు కంగారులో కారు ఆపి దిగుతారు. వారు చేతివాటం చూపుతారు. ఒంటరి స్త్రీలు ఉన్నప్పుడు ఇవన్నీ థక్ థక్ గ్యాంగ్ చాలా సులువుగా చేస్తుంది. కాబట్టి జాగ్రత్త. ఏం చేయాలి? అద్దాలు ఎప్పుడూ ఎత్తి పెట్టాలి ► ఎవరు వచ్చి వాదనకు దిగినా అద్దం దించకుండా పోలీసులకు ఫోన్ చేయాలి. ఇంజన్ ఆఫ్ చేయకూడదు. చేస్తే డోర్లు తెరుచుకుంటాయి. ► మీ పక్క సీటులో, వెనుక సీటులో విలువైన ఏ వస్తువులూ కనిపించేలా పెట్టకూడదు. ► ఏదైనా రాయి వచ్చి అద్దాన్ని కొట్టినా వెంటనే ఆపకుండా బాగా దూరం వెళ్లి ఎవరూ వెంబడించడం లేదని గమనించుకుని ఆపాలి. ► ముఖ్యంగా ఫ్లై ఓవర్లు దిగేప్పుడు, ట్రాఫిక్ ఉంటే ఇలాంటి దాడులు చేస్తారు. ఫ్లై ఓవర్ మీద కారు పక్కకు తీసి మీరు వారిని పట్టుకునే ప్రయత్నం చేయలేకపోవడమే ఇందుకు కారణం. కాబట్టి ఫ్లై ఓవర్ల మీద జాగ్రత్తగా ఉండాలి. -
హత్య కేసు ఛేదింపు
ఇద్దరు నిందితులు అరెస్టు నాలుగేళ్ల క్రితం జరిగిన సంఘటన వివరాలు వెల్లడించిన అద్దంకి సీఐ ప్రసాద్ అద్దంకి : బాడుగకు కారు మాట్లాడుకుని ప్రయాణిస్తూ మార్గమధ్యంలో ఆపి డ్రైవర్ (ఓనర్)ను హత్యచేసి కారుతో పరారైన సంఘటనపై నమోదైన కేసును కొరిశపాడు పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. నాలుగేళ్ల క్రితం 2010లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి మొత్తం నలుగురు నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అద్దంకి సీఐ బేతపూడి ప్రసాద్ ఆ వివరాలు వెల్లడించారు. పలు నేరాలకు సంబంధించి చెంచల్గూడా జైలులో శిక్ష అనుభవిస్తున్న కర్నూలు జిల్లా పెద్దపూజర్ల గ్రామానికి చెందిన నర బసవరాజు, మహ్మద్ఫ్రీ, కె.రాజశేఖర్ అలియాస్ సుదర్శన్‌లు స్నేహితులుగా మారారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ముఠాగా ఏర్పడి దొంగతనాలు, దోపిడీలు చేయడం ప్రారంభించారు. హైదరాబాదు, కర్ణాటక తదితర ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో 2010లో కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన రూపేష్ కార్‌ట్రావెల్స్ ఓనర్ (డ్రైవర్) ఏ గోవిందరావు ఇన్నోవా కారును బాడుగకు మాట్లాడుకున్నారు. కర్నూలు జిల్లా పెద్దపూజర్ల గ్రామం నుంచి విజయవాడ వెళ్లేందుకు బాడుగ మాట్లాడుకుని ప్రయాణిస్తున్నారు. జాతీయ రహదారిపై కొరిశపాడు మండలం పీ గుడిపాడు గ్రామ శివార్లలోకి కారు రాగానే ఆపించారు. రోడ్డుపక్కన పొలాల్లోకి వెళ్లి మద్యం సేవించి డ్రైవర్ గోవిందరావుకు కూడా తాపించారు. అనంతరం అతని చేతులు, కాళ్లను తాళ్లతో కట్టేసి చెట్టుకు కట్టిపడేశారు. శ్వాస తీసుకోలేని విధంగా చేసి హత్యచేశారు. ఆ తర్వాత ముగ్గురూ కారుతో ఉడాయించారు. ఆ మరుసటిరోజు గోవిందరావు మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు.. అతని చొక్కా జేబులో ఉన్న సెల్‌ఫోన్ ఆధారంగా వివరాలు తెలుసుకున్నారు. సంఘటనపై అప్పటి కొరిశపాడు ఎస్సై శ్రీకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం నలుగురు ఎస్సైలు, ఆరుగురు సీఐలు మారిన నాలుగేళ్ల తర్వాత ప్రస్తుత ఎస్సై శివకుమార్ కేసును ఛేదించారు. కేసు ఛేదింపు ఇలా... నిందితుల్లో ఒకరైన రఫీ చిత్తూరు జిల్లా చంద్రగిరి పీఎస్‌లో నమోదైన మరో కేసులో పట్టుబడి విచారణలో వెల్లడించిన వివరాల ప్రకా రం కొరిశపాడు హత్య కేసును పోలీసులు ఛేదించారు. డ్రైవర్‌ను హత్యచేసి అపహరిం చిన కారు కర్ణాటక రిజిస్ట్రేషన్‌కు సంబంధిం చింది కాగా, హైదరాబాద్‌కు చెందిన కార్లకు నకిలీ నంబర్లు మార్పిడిచేసే ఎం.బుచ్చిరెడ్డి సాయంతో ఏపీ రిజిస్ట్రేషన్‌గా మార్చివేశారు. అనంతరం ఆ కారును విక్రయించగా, ఇప్పటి వరకూ ఆరుగురి చేతులు మారింది. ఆ కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు కొనుగోలు చేసిన వారందరినీ విచారించుకుంటూ వెళ్లి నిందితులను పట్టుకున్నారు. నిందితుల్లో ఒకరు మృతి, మరొకరు జైలులో... 2011లో కారు అమ్మగా వచ్చిన నగదు పంపిణీలో విభేదాలు తలెత్తడంతో నిందితుల్లో రాజశేఖర్ అలియాస్ సుదర్శన్‌ను బసవరాజు అనే మరో నిందితుడు హత్యచేశాడు. మరో నిందితుడు రఫీ వేరే కేసులో కడప సెంట్రల్ జైలులో ఉన్నాడు. మూడో నిందితుడైన బసవరాజుతో పాటు కారుకు నకిలీ నంబర్ మార్పిడిచేసిన ఎం.బుచ్చిరెడ్డిని ప్రస్తుతం పోలీసులు అరెస్టు చేశారు. సంతమాగులూరు మండలంలోని పుట్టావారిపాలెం వద్ద నిందితులు ఉండగా అరెస్టు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. కేసును ఛేదించిన ఎస్సై శివకుమార్, సిబ్బందిని ఆయన అభినందించారు. విలేకరుల సమావేశంలో ఏఎస్సై సూర్యనారాయణ, ఏ ప్రభాకర్‌రావు, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.