
35 మంది భారత ఫుట్‌బాల్ ప్రాబబుల్స్ ప్రకటన
నేషన్స్ కప్‌నకు ముందు శిక్షణ శిబిరం ప్రారంభం
న్యూఢిల్లీ: సుదీర్ఘ కాలంగా భారత ఫుట్‌బాల్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న సునీల్ ఛెత్రీకి... తాజా ప్రాబబుల్స్‌లో చోటు దక్కలేదు. త్వరలో జరగనున్న సీఏఎఫ్‌ఏ నేషన్స్ కప్ కోసం కొత్త కోచ్ ఖాలిద్ జమీల్ శనివారం 35 మందితో ప్రాబబుల్స్‌ను ప్రకటించాడు. అందులో స్టార్ స్ట్రయికర్ ఛెత్రి పేరు లేదు. ఇప్పటికే అంతర్జాతీయ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించి... ఆ తర్వాత జట్టు అవసరాల కోసం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని తిరిగి బరిలోకి దిగిన సునీల్ ఛెత్రి గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ ప్రభావం చూపలేకపోయాడు.
అయితే కేవలం ప్రదర్శన ఆధారంగానే ఛెత్రిని ఎంపిక చేయలేదా లేక... అతడే స్వయంగా ఈ టోర్నీకి దూరంగా ఉంటానని చెప్పాడా అనే విషయంలో స్పష్టత కొరవడింది. దీనిపై అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) అధికారులను వివరణ కోరగా... ‘జట్టు ఎంపికలో మా ప్రమేయం లేదు. దీనికి సంబంధించిన అన్నీ విషయాలు హెడ్ కోచ్ చూసుకుంటారు’ అని వెల్లడించారు. రెండేళ్ల పదవీ కాలానికి గానూ భారత మాజీ ప్లేయర్ జమీల్ ఇటీవలే టీమిండియా కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు.
ప్రాబబుల్స్‌కు ఎంపికైన వారితో శనివారమే బెంగళూరులో శిక్షణ శిబిరం ప్రారంభమైంది. అందులో 22 మంది పాల్గొనగా... మిగిలిన 13 మంది ఆటగాళ్లు డ్యురాండ్ కప్ మ్యాచ్‌లు ముగియగానే జట్టుతో చేరనున్నారు. ప్రాబబుల్స్‌లో గోల్‌కీపర్ గుర్‌ప్రీత్ సింగ్ సంధు, చింగ్లెన్‌సనా సింగ్, రాహుల్ భేకె, రోషన్ సింగ్, సురేశ్ సింగ్, అనిరూధ్ థాపా, దీపక్ టాంగ్రి, లాలెంగ్‌మావియా రాల్టె, లిస్టన్ కొలాకో, మన్‌వీర్ సింగ్, అమ్దుల్ సమద్, అన్వర్ అలీ, జాక్సన్ సింగ్, మహేశ్ సింగ్ తదితరులు ఉన్నారు.
రిటైర్మెంట్ వెనక్కి తీసుకొని...
గతేడాది జూన్‌లో కువైట్‌తో మ్యాచ్ అనంతరం ఛెత్రీ అంతర్జాతీయ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే ఆ తర్వాత భారత జట్టు ప్రదర్శన మరింత పడిపోవడంతో... ఈ ఏడాది మార్చిలో మాల్దీవులుతో మ్యాచ్‌కు ముందు అప్పటి టీమిండియా హెడ్ కోచ్ మారŠెక్వజ్ మనోలో విజ్ఞప్తి మేరకు తన నిర్ణయాన్ని పక్కన పెట్టి ఛెత్రీ తిరిగి జట్టుతో చేరాడు. మాల్దీవులుతో మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించగా.. అందులో ఛెత్రీ ఒక గోల్ చేశాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ‘డ్రా’ కాగా... హాంకాంగ్ చేతిలో టీమిండియా ఓడింది.
థాయ్‌లాండ్‌తో స్నేహపూర్వక మ్యాచ్‌లో సైతం పరాజయం పాలైంది. దీంతో జట్టు ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ మనోలో హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో ఏఐఎఫ్‌ఎఫ్ జమీల్‌ను కొత్తకోచ్‌గా ఎంపిక చేసింది. అతడి ఆధ్వర్యంలో భారత జట్టు నేషన్స్ కప్‌లో బరిలోకి దిగనుంది. ఇందులో భాగంగా ఈ నెల 29న తజకిస్తాన్‌తో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 1న ఇరాన్‌తో, 4న అఫ్గానిస్తాన్‌తో తలపడుతుంది. అనంతరం ఆసియా కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా అక్టోబర్‌లో సింగపూర్‌తో టీమిండియా ఇంటా బయట మ్యాచ్‌లు ఆడనుంది.