
భారత్‌కు చెందిన ఓ యువ జట్టు ప్రపంచంలోనే అతి పెద్ద ఫుట్‌బాల్ టోర్నీని నెగ్గి చరిత్ర సృష్టించింది. కొద్ది రోజుల కిందట నార్వేలో జరిగిన నార్వే కప్ 2025లో పంజాబ్‌కు చెందిన మినర్వా అకాడమీ అబ్బురపరిచే ప్రదర్శనలతో టైటిల్‌ను కైవసం చేసుకుంది.
ఈ అండర్-13 జట్టుకు బ్రాండింగ్ లేకపోయనా, స్పాన్సర్లు లేకపోయినా, ప్రభుత్వ మద్దతు లేకపోయనా సంచలనాలు సృష్టించింది. ఈ యువ జట్టు తమ అభిరుచి, పట్టుదలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఫైనల్లో మినర్వా అకాడమీ స్థానిక జట్టు ఎస్‌ఐఎఫ్‌పై 14-1 గోల్స్ తేడాతో గెలుపొందింది. మినర్వా అకాడమీ తరఫున దనమోని, రాజ్ హ్యాట్రిక్ గోల్స్ సాధించారు. చింగ్కే, కే చేతన్, పున్షిబా, అమర్సన్, ఆజమ్, రీసన్ గోల్స్ చేశారు.
ఈ టోర్నీలో మినర్వా అకాడమీ ఆది నుంచి సంచలన ప్రదర్శనలు నమోదు చేసింది. గ్రూప్ స్టేజీలో అలస్కా ఐఎల్‌పై 25-0, ఫోర్డ్ ఐఎల్-3పై 15-0, క్కొకెల్వ్డలాన్ ఐఎల్‌పై 22-0 గోల్స్ తేడాతో గెలుపొందింది.
నాకౌట్ మ్యాచ్‌ల్లో రోగ్‌లాండర్స్‌పై (Round of 32) 11-0, అమ్డాల్ టొక్కెపై (Round of 16) 17-0, క్వార్టర్ ఫైనల్లో ఫైల్లింగ్స్‌డలెన్‌పై 18-1, సెమీస్‌లో రదథెల్ చరిఫ్ క్లబ్‌పై (పాలస్తీన్) 8-2 గోల్స్ తేడాతో నెగ్గి ఫైనల్‌కు చేరింది. ఈ టోర్నీలో మినర్వ అకాడమీ 8 మ్యాచ్‌ల్లో మొత్తం 130 గోల్స్ చేసింది.
ఈ యూరప్ సీజన్‌లో భారత్‌కు చెందిన జట్లు మూడు టైటిళ్లు సాధించాయి. నార్వే కప్‌కు ముందు భారత జట్లు గోథియా కప్, డానా కప్‌లు గెలిచాయి.
అనామక కుర్రాళ్లు ప్రతిష్టాత్మక నార్వే కప్ గెలిచిన తర్వాత స్వదేశంలో వారిపై ప్రశంసల జల్లు కురుస్తుంది. ఈ జట్టు యూరప్‌లో ట్రోఫీని మాత్రమే కైవసం చేసుకోలేదు. ప్రతి భారత ఫుట్‌బాల్ ప్రేమికుడి కలను సాకారం చేసింది. ఎక్కడో మారుమూల అకాడమీ నుంచి వచ్చి విశ్వవేదికపై భారత కీర్తిపతాకను రెపరెపలాడించింది. ఆట పట్ల అభిరుచి ఏమి చేయించగలదో నిరూపించింది. మొత్తంగా దేశం గర్వపడేలా చేసింది.