
భారత ఫుట్‌బాల్‌లో అతనో దిగ్గజం
హెడ్ కోచ్ ఖాలిద్ జమీల్ స్పష్టీకరణ
బెంగళూరు: భారత స్టార్ ఫుట్‌బాలర్, మాజీ కెప్టెన్ సునీల్ ఛెత్రికి తలుపులు ఇంకా తెరిచే ఉన్నాయని కొత్త కోచ్ ఖాలీద్ జమీల్ అన్నారు. సెంట్రల్ ఏషియా ఫుట్‌బాల్ కాన్ఫడరేషన్ (సీఏఎఫ్‌ఏ) నేషన్స్ కప్ కేవలం సన్నాహక టోర్నీ మాత్రమే అని, దీని కోసం ఎంపిక చేసిన ప్రాబబుల్స్‌లో ఛెత్రి పేరు లేనంత మాత్రాన అతని ఆటకు తెరపడినట్లు కాదని ఆయన స్పష్టం చేశారు. తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌లలో జరిగే నేషన్స్ కప్ కోసం 35 మంది సభ్యులతో కూడిన జట్టును ఆదివారం ప్రకటించారు.
అయితే ఇందులో స్టార్ స్ట్రయికర్ సునీల్ ఛెత్రి పేరు లేకపోవడంతో మీడియాలో వస్తున్న ఊహాగానాలకు హెడ్ కోచ్ ముగింపు పలికే ప్రయత్నం చేశారు. ఆసియా కప్ క్వాలిఫయింగ్ రౌండ్ మ్యాచ్‌లకు ఛెత్రి సహా ఇతర కీలక ఆటగాళ్లు అందుబాటులో ఉంటారని అన్నారు. ఇందులో భాగంగా అక్టోబర్‌లో భారత్ ఇంటాబయటా సింగపూర్‌తో రెండు మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది. 9న సింగపూర్‌లో, 14న సొంతగడ్డపై ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. ‘భారత ఫుట్‌బాల్‌లో సునీల్ ఒక దిగ్గజం. మన సాకర్‌కు అతనో రోల్ మోడల్.
అంతేకాదు... నా ఫేవరెట్ ఆటగాడు కూడా! అతడితో తలపడిన (క్లబ్, లీగ్) సందర్భాలెన్నో ఉన్నాయి’ అని జమీల్ తెలిపినట్లు అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) ప్రకటనను విడుదల చేసింది. తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌లు ఉమ్మడిగా నిర్వహించబోయే నేషన్స్ కప్‌లో భారత్ గ్రూప్ ‘బి’లో ఉంది. ఈ నెల 29న తొలి మ్యాచ్‌లో తజికిస్తాన్‌తో భారత్ పోటీపడుతుంది.
సెప్టెంబర్1న ఇరాన్, 4న అఫ్గానిస్తాన్‌తో ఆడుతుంది. మూడో స్థానం సహా ఫైనల్ పోటీలు 8న తాష్కెంట్‌లో జరుగుతాయి. ఈ టోర్నీ కోసం శనివారమే ప్రాబబుల్స్‌కు శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం 22 మంది ఆటగాళ్లు శిబిరంలో ఉండగా... మిగతా 13 మంది డ్యురాండ్ కప్ ముగిసిన వెంటనే క్యాంప్‌లో పాల్గొంటారు.