
PC: AIFF
మిడ్‌ఫీల్డర్‌గా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఖాలిద్ జమీల్ తదనంతం కోచ్‌గా క్లబ్ జట్లపై ప్రభావం చూపాడు. అరకొర నిధులతో సరిపెట్టినా జట్టును మేటిగా నిలిపేందుకు గట్టి ప్రయత్నమే చేశాడు. అలా తక్కువ బడ్జెట్‌లో విజయవంతమైన కోచ్‌గా నిరూపించుకున్నాడు.
అందుబాటులో ఉన్న రూ. 2 కోట్ల నిధులతో 2016–17 సీజన్ ఐ–లీగ్‌లో ఐజ్వాల్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ)ని విజేతగా నిలబెట్టాడు. అదే విధంగా.. మోహన్ బగాన్, ఈస్ట్ బెంగాల్, ముంబై ఎఫ్‌సీ, నార్త్‌ఈస్ట్ యునైటెడ్, జంషెడ్‌పూర్ ఎఫ్‌సీ క్లబ్‌లకు కోచ్‌గా సేవలందించాడు.
ఇక ఐఎస్‌ఎల్‌లో నార్త్‌ఈస్ట్ యునైటెడ్ ప్లేఆఫ్‌కు చేర్చిన తొలి భారత కోచ్‌గా జమీల్‌దే ఘనత! తాజాగా మనొలో (స్పెయిన్) స్థానంలో భారత హెడ్ కోచ్‌గా నియమితుడైన 49 ఏళ్ల ఖాలిద్ తొలిసారిగా ఓ అంతర్జాతీయ జట్టుకు సేవలందించేందుకు సిద్ధమయ్యాడు.
జమీల్‌కు కలిసొచ్చిందిలా...
చాలా ఏళ్లుగా క్లబ్, ఫ్రాంచైజీ జట్లకు కోచింగ్ ఇచ్చిన ఖాలిద్ జమీల్‌కు ఇదే తొలి అంతర్జాతీయ స్థాయి నియామకం. అయితే ఇదేమీ గాలివాటంగా రాలేదు. ఇండియా లీగ్ (ఐ–లీగ్)లో ప్లేయర్‌గా విజయవంతమయ్యాడు. 2005లో మహీంద్ర యునైటెడ్ విజేత జట్టు సభ్యుడైన జమీల్ తదనంతరం మేనేజర్‌గా ఐజ్వాల్ ఎఫ్‌సీ తరఫున కమాల్ చేశాడు. ఐజ్వాల్‌ను విజేతగా నిలబెట్టడంలో కీలకపాత్ర ఖాలిద్‌దే!
కేవలం పరిమిత నిధులతోనే తక్కువ బడ్జెట్‌లోనే జట్టును విజయపథాన నిలిపాడు. ఆ తర్వాత ముంబై ఎఫ్‌సీకి కోచ్‌గా వెళ్లాడు. తదనంతరం ఐఎస్‌ఎల్‌లో నార్త్‌ఈస్ట్ యునైటెడ్‌ను సెమీఫైనల్ చేర్చిన కోచ్‌గా పేరు తెచ్చుకున్నాడు. జంషెడ్‌పూర్ ఎఫ్‌సీ కోచ్‌గాను పనిచేశాడు. టైటిళ్లు సాధించకపోయిన జట్టును సానబెట్టిన తీరుతో ఏఐఎఫ్‌ఎఫ్ ‘కోచ్ ఆఫ్ ద ఇయర్’గా రెండు సీజన్లపాటు అవార్డు గెలుచుకున్నాడు. ఇవన్నీ కూడా టీమిండియా కోచ్ అయ్యేందుకు సోపానంలా పనిచేశాయి.
అద్భుతాలు కాదు... కానీ!
ఇప్పటికిప్పుడు జమీల్ నుంచి అద్భుతాలను ఆశించడమంటే అది అత్యాశే అవుతుంది. అయితే ఆచరణీయ సాధన సంపత్తితో జట్టును తీర్చిదిద్దుతాడని గత ఫలితాలను బట్టి చెప్పొచ్చు. స్వయంగా ప్లేయర్ అయిన ఖాలిద్ జట్టు లోటుపాట్లపై తక్షణం విశ్లేషించగలడు. డిఫెన్స్ వైఫల్యంతో ఇటీవల దిగువ ర్యాంక్ జట్లతోనూ ఓడిన భారత్ జట్టును ఓ మెట్టుపైనే నిలబెట్టేందుకు తన వంతు కృషి చేయగలడు. డిఫెన్స్, ఫార్వర్డ్‌లపై తనకున్న అపారమైన అనుభవం జట్టుకు మేలు చేస్తుంది.
ముఖ్యంగా ఆటగాళ్లపై వ్యక్తిగత శ్రద్ద పెట్టి తీర్చిదిద్దే సామర్థ్యం అతనిలో ఉంది. సీనియర్లు, యువ ఆటగాళ్లను సమన్వయం చేసుకుంటూ ఫలితాలు సాధించే నైపుణ్యం జమీల్‌లో ఉంది. కానీ ఇవన్నీ కూడా ఒక్క సిరీస్‌తో, ఒక్క ఏడాదితో జరిగేది కాదు.
అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) కొత్త కోచ్‌కు తగినంత సమయం ఇవ్వాలి. దీర్ఘకాలిక లక్ష్యాలు చేరాలంటే మాత్రం ప్రణాళికబద్ధంగా శ్రమించాలి. కాబట్టి కోచ్‌గా కుదిరేందుకు, జట్టును మార్చేందుకు కచ్చితంగా సమయం పడుతుంది.
పెను సవాళ్లకు సిద్ధం
భారత కోచ్ పదవి కోసం సుమారు 170 మంది పోటీపడ్డారు. వీరిలో పేరున్న విదేశీ కోచ్‌లు కూడా ఉన్నారు. వారందరిని వెనక్కినెట్టిన ఖాలిద్ జమీల్ కొత్త హెడ్ కోచ్ అయ్యాడు. 2011–2012 తర్వాత స్వదేశీ కోచ్ ఈ బాధ్యతలు చేపట్టాడు. ఆ వెంటనే జమీల్ ముందున్న సవాళ్లపై దృష్టి పెట్టాడు. ఈ నెలలోనే సీఏఎఫ్‌ఏ నేషన్స్ కప్ జరుగనుంది. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 8 వరకు జరిగే టోర్నీతో టీమిండియాకు అతని కోచింగ్ మొదలవుతుంది.
తజికిస్తాన్‌తో జరిగే తొలిపోరులో భారత్ సాధించే సానుకూల ఫలితం అతన్ని ఆత్మవిశ్వాసంతో నడిపించనుంది. ఇటీవల హాంకాంగ్ చేతిలో 0–1తో ఓడిపోయిన భారత్... 2027 ఆసియా కప్ రేసులో ఉండాలంటే సింగపూర్‌తో తదుపరి జరిగే మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సి ఉంది.
తద్వారా ‘ఫిఫా’ ర్యాంకింగ్స్‌లో భారత్ ఎగబాకేందుకు అవకాశముంటుంది. ఇంటాబయటా జరిగే ఫ్రెండ్లీ మ్యాచ్‌లు, ఆసియా క్వాలిఫికేషన్ పోటీల్లో భారత్ రాణించాలంటే వెంటనే చేయాల్సింది సమీక్ష ఆ తర్వాతే సన్నద్ధతపై పూర్తి అవగాహన వస్తుంది.
తన శిష్యులకు కలిసొచ్చేనా...
సుదీర్ఘ కాలంపాటు క్లబ్, ఫ్రాంచైజీ జట్లతో ఉన్న అనుబంధంతో ఎంతో మంది శిష్యులు జతయ్యారు. వీరిలో అపూయా రాల్తే, సందేశ్ జింగాన్, మో సనన్‌లతో ఖాలిద్‌కు చక్కని బంధమేర్పడింది. ఇప్పుడు వీరందరికి అనుకూలమైన కోచ్ రావడం కాస్త అనుకూలించనుంది.
నార్త్‌ఈస్ట్, జంషెడ్‌పూర్, ముంబై ఎఫ్‌సీ ఇలా క్లబ్ జట్లలో విశేషంగా రాణించిన వారికి తప్పకుండా భారత జట్టులో చోటు లభిస్తుంది. సీనియర్లతో పాటు యువ ఆటగాళ్లకు స్వేచ్ఛనిచ్చే కోచ్ వల్ల తప్పకుండా కుర్రాళ్లకు కలిసిరానుంది. భారత జట్టు కోసం తన దృష్టిలో ఉన్న కోర్ గ్రూప్ ప్లేయర్లను సానబెడతాడనడంలో ఎలాంటి అతిశయోక్తి ఉండదు. తద్వారా జమీల్ జట్టులో తన ‘మార్క్’ చూపించే ప్రయత్నమైతే గట్టిగానే చేస్తాడు.
-సాక్షి క్రీడా విభాగం