
అనిశ్చితిని అధిగమిస్తేనే మెరుగైన ఫలితాలు
సమష్టి కృషితోనే ఐఎస్‌ఎల్ భవితవ్యం
ఏఐఎఫ్‌ఎఫ్ అధ్యక్షడు కల్యాణ్ చౌబే వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలోని అగ్రశ్రేణి ఫుట్‌బాల్ టోర్నమెంట్... ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) భవిష్యత్తుపై అనిశ్చితి కారణంగా క్లబ్ ఫుట్‌బాల్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని అఖిల భారత ఫుట్‌బాట్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) అధ్యక్షుడు కల్యాణ్ చౌబే అన్నారు. ఈ కఠిన పరిస్థితులను అధిగమించడానికి సమష్టి కృషి అవసరమని పేర్కొన్నారు. 2010లో ఏఐఎఫ్‌ఎఫ్ చేసుకున్న మాస్టర్ రైట్స్ అగ్రిమెంట్ (ఎంఆర్‌ఏ) పునరుద్ధరణపై అనిశ్చితి కారణంగా 2025–26 ఐఎస్‌ఎల్ సీజన్‌ను నిలిపేయాల్సి వచ్చింది.
లీగ్ నిర్వాహకుల నిర్ణయం అనంతరం ఐఎస్‌ఎల్‌లోని మూడు క్లబ్‌లు తమ జట్టు కార్యకలాపాలను ఆపేశాయి. ఇందులో భాగంగా ఆటగాళ్లు, సిబ్బందికి వేతనాలు సైతం నిలిపివేశాయి. ఈ నేపథ్యంలో కల్యాణ్ చౌబే మాట్లాడుతూ... ‘సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామన్నది నిజమే. స్వార్థ ప్రయోజనాలతో కొంతమంది ఈ పరిస్థితిని సృష్టించారు. అయితే సమష్టి కృషితోనే దీన్ని దాటి ముందుకు సాగగలమనే నమ్మకముంది’ అని 1999 నుంచి 2006 వరకు భారత సీనియర్ జట్టుకు గోల్‌కీపర్‌గా వ్యవహరించిన కల్యాణ్ చౌబే అన్నారు.
క్లబ్ సీఈవోలతో చర్చలు విఫలం
భారత ఫుట్‌బాల్‌లోని ప్రస్తుత పరిస్థితిని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావాలని ఐఎస్‌ఎల్‌లోని 11 క్లబ్‌లు కోరడంపై కల్యాణ్ చౌబే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏఐఎఫ్‌ఎఫ్ తమ అభ్యర్థనపై చర్య తీసుకోకపోతే స్వతంత్రంగా న్యాయ సహాయం కోరడం తప్ప తమకు వేరే మార్గం లేదని ఐఎస్‌ఎల్ క్లబ్‌లు ఒక లేఖలో పేర్కొన్నాయి. మొత్తం 13 క్లబ్‌లలో మోహన్ బగాన్ సూపర్ జెయింట్, ఈస్ట్ బెంగాల్ మినహా మిగిలిన 11 జట్లు దానిపై సంతకం చేశాయి. క్లబ్ సీఈవోలతో చర్చించిన మరుసటి రోజే ఈ లేఖ వెలుగు చూడటం ఆశ్చర్యపరిచిందని కల్యాణ్ అన్నారు.
‘ఈనెల 7న ఢిల్లీలో 13 క్లబ్‌ల సీఈవోలతో జరిగిన సమావేశంలో అనేక అంశాలపై చర్చించాం. అయితే మరుసటి రోజే 11 క్లబ్‌లు లేఖ రాయడం ఆశ్చర్యం కలిగించింది. ఈ సమాచార లోపాన్ని నివారించి ఉండాల్సింది. ఏదేమైనా దేశంలో ఫుట్‌బాల్ అభివృద్ధికి ఏఐఎఫ్‌ఎఫ్ కట్టుబడి ఉంది. ఆటకు ఏది మంచిదో అది చేసేందుకు సదా సిద్ధంగా ఉంటాం. దీనిపై న్యాయ సలహా తీసుకునే ఆలోచనలో ఉన్నాం. ఆ తర్వాత తిరిగి క్లబ్‌ల సీఈవోలతో భేటీ అవుతాం.
ఈ నెల 17 తర్వాత మరోసారి సమావేశమవుతాం. క్లబ్‌ల ఆదాయ మార్గాలు పెంపొందించేందుకు ప్రణాళికలు రచించే అంశాన్ని సైతం పరిశీలిస్తున్నాం. తక్షణం తీసుకోవాల్సిన చర్యలతో కూడిన 5 అంశాల అజెండాను రూపొందిస్తున్నాం’ అని ఏఐఎఫ్‌ఎఫ్ అధ్యక్షుడు పేర్కొన్నారు.
సొంతంగా ఐఎస్‌ఎల్ సాధ్యమా..
మాస్టర్స్ రైట్స్ అగ్రిమెంట్ పునరుద్ధరణ అంశంలో అనిశ్చితి నెలకొనడంతో... ఐఎస్‌ఎల్ లీగ్‌ను సొంతంగా నిర్వహించే అంశాన్ని కూడా ఏఐఎఫ్‌ఎఫ్ పరిశీలిస్తోంది. ‘ప్రస్తుతానికి అలాంటి ప్రతిపాదనేం లేదు. అయితే అన్ని దారులు తెరిచే ఉన్నాయి. వాటాదారులతో చర్చిస్తున్నాం. ఎంఆర్‌ఏ పునరుద్ధరణ అంశంలో ఆలస్యం జరిగింది. దేశంలో ఫుట్‌బాల్ అభివృద్ధి కోసం ఎలాంటి సమావేశానికి అయినా ఫుట్‌బాల్ సమాఖ్య సదా సిద్ధంగా ఉంటుంది. ఐఎస్‌ఎల్‌తో దేశంలో ఫుట్‌బాల్ మౌలిక సదుపాయాలు మెరుగయ్యాయనేది ముమ్మాటికి నిజం.
మైదానాలు, ఆటగాళ్ల జీతాలు, విదేశీ ప్లేయర్ల సూచనలు, ప్రముఖ కోచ్‌ల మార్గనిర్దేశం, అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యం, సినీ రంగ ప్రముఖుల ప్రమేయం ఇలా అన్నీ అంశాల్లో భారత ఫుట్‌బాల్‌లో గణనీయమైన మార్పుకు ఈ లీగ్ కారణమైంది. దీంతో భారత ఫుట్‌బాల్ బ్రాండ్ విలువ పెరిగింది. ఈ సహకారం ఇలాగే కొనసాగుతూ... యువ నైపుణ్యాన్ని సరైన పద్ధతిలో వినియోగిస్తే వచ్చే పదేళ్లలో భారత జాతీయ జట్టు ర్యాంకింగ్ మెరుగవడం ఖాయమే’ అని 48 ఏళ్ల కల్యాణ్ అన్నారు.
ర్యాంకింగ్స్‌లో మెరుగవ్వాలంటే...
గత నెల విడుదల చేసిన ‘ఫిఫా’ ర్యాంకింగ్స్‌లో భారత పురుషుల జట్టు 133వ స్థానంలో నిలిచింది. తొమ్మిదేళ్లలో మన జట్టుకు ఇదే అత్యల్ప ర్యాంకు. ఇటీవలి కాలంలో టీమిండియా పేలవ ప్రదర్శన చేస్తుండటంతో ఆరు స్థానాలు కోల్పోవాల్సి వచి్చంది. దీనిపై కల్యాణ్ స్పందిస్తూ... ‘అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో మెరుగైన ప్రదర్శన కనబరిస్తేనే ర్యాంకింగ్స్‌లో పురోగతి ఉంటుంది. అయితే ఈ ర్యాంకింగ్ విధానం కూడా కాస్త సంక్లిష్టమైంది. ఆడిన మ్యాచ్‌లు, ప్రత్యర్థి ర్యాంక్‌ల ఆధారంగా దీన్ని లెక్కిస్తారు.
2023లో ఏఐఎఫ్‌ఎఫ్ అధ్యక్షుడిగా బాధ్యతలు అందుకున్న సమయంలో మన జట్టు 106వ ర్యాంక్ నుంచి 99వ స్థానానికి చేరింది. ఇప్పుడు రెండేళ్ల తర్వాత 133వ ర్యాంక్‌లో నిలిచింది. ఆ్రస్టేలియా, ఉజ్బెకిస్తాన్ వంటి బలమైన జట్ల చేతిలో ఓడటంతో ర్యాంకింగ్స్‌పై అధిక ప్రభావం చూపింది. అయితే ఆటగాళ్లపై విశ్వాసం కోల్పోము. సీఏఎఫ్‌ఏ నేషన్స్ కప్, ఆసియా కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో మన జట్టు మెరుగైన ఆటతీరు కనబరుస్తుందనే నమ్మకముంది.
‘ఫిఫా’ ర్యాంకింగ్స్ వ్యవస్థ ప్రవేశపెట్టిన సమయంలో భారత్ 143వ ర్యాంక్‌తో ప్రారంభించింది. ఆ తర్వాత అత్యల్పంగా 173వ స్థానానికి పడిపోయింది. 1996లో అత్యుత్తమంగా 94వ ర్యాంక్‌లో నిలిచింది. ఐఎస్‌ఎల్ ద్వారా దేశంలో క్లబ్ క్రికెట్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. ఆసియాలో అత్యధిక మంది వీక్షించిన ఫుట్‌బాల్ టోర్నీ ఐఎస్‌ఎల్‌నే. జాతీయ అంతర్జాతీయ సంస్థలు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. అయితే ఐఎస్‌ఎల్ ఫలాలు జాతీయ జట్టుకు అందడం లేదు. కానీ కష్టం ఎప్పటికే వృథా పోదు. దాని ప్రభావం టీమిండియాపై కనిపించే రోజులు ఎక్కువ దూరంలో లేవు’ అని కల్యాణ్ వివరించారు.