
బెంగళూరు: నేషన్స్ కప్ సన్నాహాల్లో భాగంగా భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టు కొత్త హెడ్ కోచ్ ఖాలిద్ జమీల్ ఆధ్వర్యంలో శిక్షణ శిబిరంలో పాల్గొంటోంది. ఈ శిబిరానికి మొత్తం 35 మంది ప్లేయర్లు ఎంపిక కాగా... 16 నుంచి బెంగళూరులో శిక్షణ ప్రారంభమైంది. అయితే ప్రస్తుతం 25 మంది ప్లేయర్లు మాత్రమే శిక్షణలో పాల్గొంటున్నారు.
మరో 11 మంది ఆటగాళ్లు ఇంకా శిబిరంలో చేరాల్సి ఉంది. జాతీయ శిబిరానికి ఎంపికైన ప్లేయర్లలో ఏడుగురు ఆటగాళ్లు... డ్యురాండ్ కప్‌లో మోహన్ బగాన్ సూపర్ జెయింట్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఆ ఏడుగురు ఎవరంటే?
ఈ ఏడుగురిని ఆ క్లబ్ ఇంకా విడుదల చేయకపోవడంతో... అనిరుధ్ థాపా, దీపక్, రాల్టె, లిస్టన్ కొలాకో, మాన్‌వీర్ సింగ్, సహల్ అబ్దుల్ సమద్, విశాల్ జాతీయ శిబిరంలో పాల్గొనలేకపోతున్నారు. నేషన్స్ కప్‌లో భాగంగా ఈ నెల 29న భారత జట్టు తజకిస్తాన్‌తో పోటీపడాల్సి ఉంది. అయితే నేషన్స్ కప్ ఫిఫా అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో భాగం కాకపోవడంతో... నిబంధనల ప్రకారం ప్లేయర్లను విడుదల చేయాల్సిన అవసరం లేదు.
డ్యురాండ్ కప్‌లో భాగంగా ఈ నెల 17న జరిగిన క్వార్టర్ ఫైనల్లోనే మోహన్ బగాన్ పరాజయం పాలై... టోర్నీ నుంచి వైదొలిగినా ఇప్పటి వరకు ఆటగాళ్లను మాత్రం జాతీయ శిబిరానికి పంపలేదు. ఈ టోర్నీ సెమీస్‌లో ఓడిన ఈస్ట్ బెంగాల్ జట్టులోనూ శిబిరానికి ఎంపికైన ముగ్గురు ఆటగాళ్లు అన్వర్ అలీ, జాక్సన్ సింగ్, మహేశ్ సింగ్ ఉండగా... వాళ్లు కూడా ఇప్పటి వరకు క్యాంప్‌లో అడుగు పెట్టలేదు.
కోచ్ ఏమన్నాడంటే..
ఈ నేపథ్యంలో కొత్త కోచ్ జమీల్ మాట్లాడుతూ... ‘ఆటగాళ్ల కోసం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో శిబిరం కొనసాగుతోంది. మరింత మంది ప్లేయర్లను పరీక్షిస్తాం. ఆసియా కప్ క్వాలిఫయర్స్‌లో అత్యుత్తమ ప్లేయర్లతోనే బరిలోకి దిగుతాం’ అని అన్నాడు.
నమ్మకాన్ని నిలబెట్టుకుంటా
శిబిరంలో పాల్గొంటున్న మాన్‌వీర్ మాట్లాడుతూ... ‘గత ఆరేళ్లుగా జాతీయ జట్టు జెర్సీ వేసుకోవాలని ఎదురుచూస్తున్నా. ఎట్టకేలకు ఇప్పు డు అవకాశం వచి్చంది. అండర్–19 స్థాయిలో 2019లో ఏఎఫ్‌సీ అండర్–19 ఆసియా చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నా.
భారత జట్టుకు స్ట్రయికర్ స్థానంలో ఆడటం చాలా కష్టం. కోచ్ జమీల్ ఆధ్వర్యంలో గతంలో మ్యాచ్‌లు ఆడా. నా శక్తి సామర్థ్యాలు కోచ్‌కు తెలుసు. నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తా’ అని అన్నాడు.