గుడిపాల మండలంలో దొరికిన ఇన్నోవా
గుడిపాల: బెంగళూరులో ఏటీఎంలలో నగదు నింపే వాహనం నుంచి బుధవారం పట్టపగలే రూ.7.11 కోట్లు కొట్టేసిన ఆరుగురు దుండగులు డబ్బుతో పరారైన ఇన్నోవా వాహనం గురువారం చిత్తూరు జిల్లాలో లభించింది. రిజర్వు బ్యాంకు, ఆదాయపన్ను అధికారులమంటూ ఏటీఎంలకు నగదు తీసుకెళుతున్న వాహనాన్ని అడ్డగించి సిబ్బందిని దించేసి డ్రైవర్‌ను తీసుకెళ్లిన దుండగులు కొంతదూరం వెళ్లాక డ్రైవర్‌కు పిస్టల్ చూపించి కేంద్రప్రభుత్వ స్టిక్కర్ ఉన్న ఇన్నోవా వాహనంలోకి ఆ నగదును మార్చి పరారైన విషయం తెలిసిందే.
జీపీఎస్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన కర్ణాటక పోలీసులు.. చెన్నై–బెంగళూరు రహదారిలోని చిత్తూరు జిల్లా గుడిపాల మండలం 190 రామాపురం చర్చివద్ద యుపి14–బిఎక్స్2500 నంబరుగల ఆ ఇన్నోవా వాహనం ఉన్నట్లు గుర్తించారు. ఇన్నోవాను అక్కడ ఆపేసిన దుండగులు డబ్బును మరో వాహనంలో తీసుకెళ్లినట్లు అనుమానిస్తున్నారు. ఇన్నోవా వాహనం బుధవారం రాత్రి 11 గంటల సమయంలో గుడిపాల మండల కేంద్రం మీదుగా మండలంలోని చిత్తపార గ్రామానికి వెళ్లి కొంత సమయం తరువాత వెనక్కి వచ్చినట్టు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. దీంతో చిత్తపార గ్రామంలో ఎవరైనా అనుమానితులు ఉన్నారా అనే కోణంలో విచారిస్తున్నారు.


