
గత కొంతకాలంగా విజయాల్లేక తడబడుతున్న అక్కినేని ఫ్యామిలీకి ఈ ఏడాది వరుస హిట్లు వచ్చాయి. నాగచైతన్య తండేల్ సినిమాకు వంద కోట్లు రాగా, నాగార్జున (Nagarjuna Akkineni) కుబేర చిత్రానికి రూ.132 కోట్లు వచ్చాయి. అలా తండ్రీకొడుకులిద్దరూ ఈసారి సెంచరీ కొట్టారు. అఖిల్ అక్కినేని మాత్రం ఈ రేసులో ఎక్కడో ఆగిపోయాడు. ఏజెంట్‌తో డిజాస్టర్ అందుకున్న ఇతడు ప్రస్తుతం లెనిన్ మూవీ చేస్తున్నాడు.
టాక్ షోలో నాగ్
దీన్ని నాగవంశీతో కలిసి నాగార్జున నిర్మిస్తున్నాడు. అంతేకాదు ఈ మూవీలో అఖిల్‌కు తండ్రిగా కనిపించనున్నారన్న టాక్ కూడా వినిపించింది. ఈ మూవీలో నటించేందుకు జగపతిబాబుకు ఆఫర్ ఇస్తే.. దానికి నాగ్ ఒప్పుకోలేదట! ఈ విషయాన్ని ఆయన జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షోలో వెల్లడించాడు. ఈ షోకు జగపతిబాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు.
అవును, రిజెక్ట్ చేశా..
జగ్గూ భాయ్ మాట్లాడుతూ.. అఖిల్ (Akhil Akkineni) రీసెంట్ సినిమా(లెనిన్)లో ఏదో చిన్న పాత్రకు నన్ను అడిగారట! ఇంత చిన్న క్యారెక్టర్‌కు ఆయన్ను అడగడమేంటి? మేం కలిసేదే తక్కువ. ఇలాంటివి చేస్తే మా స్నేహమే చెడిపోతుంది అన్నావంట కదా అని అడిగాడు. అందుకు నాగ్.. అవును, ఆ చిన్న పాత్రకు నువ్వెందుకని తిరస్కరించాను అని చెప్పాడు. దీంతో జగపతిబాబు థాంక్యూ చెప్తూ.. నిజానికి నీకసలు సంబంధం లేదు. ఆ సినిమాకు నీతోపాటు మరో నిర్మాత కూడా ఉన్నారు.
ముందు మనం ఫ్రెండ్స్
నువ్వు విలువల్ని పాటిస్తావు.. అది నాకెంతో ఇష్టం అన్నాడు. అది వినగానే నాగ్.. వీటన్నింటికంటే ముందు మనమిద్దరం ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చాడు. లెనిన్ విషయానికి వస్తే.. వినరో భాగ్యము విష్ణు కథ ఫేమ్ కిరణ్ మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు.