సుమారు నాలుగేళ్ల తర్వాత కన్నడ స్టార్ యశ్ మరోసారి బాక్సాఫీస్ వద్దకు రానున్నాడు. తన కొత్త సినిమా టాక్సిక్ నుంచి యశ్‌ను పరిచయం చేస్తూ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఒక శ్మశానంలో శత్రువులకు చుక్కలు చూపించేలా తన ఎంట్రీ ఉంటుంది. అయితే, కారులో ఒక నటితో యశ్ ఇంటిమేట్ అయ్యే సీన్ ఉంటుంది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మరీ ఇంత బోల్డ్‌గా ఎలా తెరకెక్కించారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే, యశ్‌తో రొమాన్స్ చేసిన నటి ఎవరు అంటూ సోషల్‌మీడియాలో నెటిజన్లు వెతుకుతున్నారు.
ఈ టీజర్‌లో యశ్‌తో కలిసి సన్నిహిత సీన్‌లో కనిపించింది హాలీవుడ్ నటి 'నటాలియా గుస్లిస్టాయా' (Natalia Guslistaya).. తన అసలు పేరు నటాలి బర్న్ (Natalie Burn). ఉక్రెయిన్‌కు చెందిన ఈ బ్యూటీ అమెరికాకు వెళ్లి, నటనలో కెరీర్ ప్రారంభించింది. నటనతో పాటు మోడల్, స్క్రీన్‌రైటర్, నిర్మాతగా కూడా విజయం అందుకుంది. ది ఎక్స్పెండబుల్స్ 3 చిత్రంతో పాటు హాలీవుడ్‌లో సుమారు 20కి పైగా సినిమాల్లో నటించింది. నిర్మాతగా 5 భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించింది. దీంతో ఆమెకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. తన నెట్ వర్త్ కూడా సుమారు రూ. 150 కోట్లకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో తనను తక్కువ అంచనా వేశారో పప్పులో కాలేసినట్లే..
అమెరికన్ పౌరసత్వం పొందిన తరువాత, ఆమె పలు స్టూడియోస్‌లలో కూడా భాగస్వామిగా ఉంది. హాలీవుడ్‌లో యాక్షన్ సినిమాలతో పాటు థ్రిల్లర్ మూవీస్‌తో పేరు తెచ్చుకున్న బహుముఖ ప్రతిభావంతురాలిగా గుర్తింపు పొందింది. అయితే, టాక్సిక్ సినిమాతో ఆమె ఇండియన్ స్క్రీన్‌పై కనిపించనుంది. ఇందులో ఆమె కీలకపాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. యశ్‌తో బోల్డ్ సీన్‌లో నటించడంతో ఒక్కసారిగా నెట్టింట తన పేరు వైరల్ అవుతుంది.


