
ప్రపంచంలో కడలి తీరాలు ఎన్ని ఉన్నా పర్యాటకులు మెచ్చే బీచ్‌లకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. గ్రీస్‌లోని శాంటోరిని ద్వీపంలో ఉన్న అమూడీ బీచ్ అలాంటిదే. నిజానికి ఇది ఒక చిన్న నౌకాశ్రయం. ఓయా అనే గ్రామానికి ఆనుకుని ఉన్న ఈ బీచ్‌కి వెళ్లాలంటే 300 మెట్లు దిగితే చాలు.
నడవలేని వారు మరోదారిలో వాహనాలపైన కూడా వెళ్లొచ్చు. ఇక్కడ రాక్ జంపింగ్ ఫేమస్. ఓయా కొండ మీద నుంచి ఈ బీచ్‌లోకి చాలామంది ఔత్సాహికులు దూకుతుంటారు. ఇక్కడ సాయంత్రం వేళల్లో సరదాగా సేదతీరే స్థానికులతో, ప్రకృతి ఆస్వాదించే పర్యాటకులతో కిటకిటలాడుతుంది. ఇక్కడ అనేక ఫిష్ టావర్న్‌లు సందర్శకులను ఆకట్టుకుంటాయి.
రుచుల ప్రియులకు తాజా చేపలను, సంప్రదాయ గ్రీకు రెసిపీలతో వండి వడ్డిస్తుంటారు రెస్టారెంట్‌లోని షెఫ్స్. ఇక్కడి నుంచి సూర్యాస్తమయం చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడికి ఒక్కసారి వెళ్తే కచ్చితంగా మరోసారి వెళ్లాలనే ఆశ పుడుతుందట! నిజానికి ఈ బీచ్‌కి వెళ్లిన పర్యాటకులు ఓయా గ్రామస్థుల ఆదృష్టానికి కుళ్లుకోకుండా ఉండలేరేమో!
కళోత్సాహం
కళాకారులు ఎప్పుడూ ‘శభాష్’ అనే ప్రశంసలను, కరతాళ ధ్వనులను కోరుకుంటారు. అలాంటి కళలను అభినందించాలన్నా, ప్రదర్శించాలన్నా ఆగస్టు నెలలో స్కాట్లండ్ వెళ్లాల్సిందే! స్కాట్లండ్ రాజధాని ఎడిన్ బర్గ్‌లో ఆగస్ట్ 1 నుంచి ప్రారంభమైన ఎడిన్ బర్గ్ ఫెస్టివల్ ఫ్రింజ్ వేడుకలు ఆగస్టు 25 వరకు జరగనున్నాయి.
సుమారు మూడు వారాల పాటు కొనసాగుతున్న ఈ పండుగలో వేలాదిమంది కళాకారులు, నటులు, హాస్యనటులు, సంగీతకారులు, వివిధ ప్రదర్శకులు పాల్గొంటారు. ఈ ఫ్రింజ్‌లో నాటకాలు, కామెడీ షోలు, సంగీత ప్రదర్శనలు, నృత్యాలు, సర్కస్‌లు ఇలా మరెన్నో ప్రదర్శనలు ఉంటాయి.
ఎడిన్ బర్గ్‌లోని థియేటర్లు, పబ్‌లు, కేఫ్‌లు, వీధులలో ఏర్పాటు చేసే తాత్కాలిక వేదికలు సహా వందలాది ప్రదేశాలలో ప్రదర్శనలు జరుగుతాయి. ఈ పండుగ నూతన ప్రతిభను వెలికితీయడానికి, ప్రయోగాత్మక కళలను ప్రోత్సహించడానికి ఒక గొప్ప అవకాశం. ప్రపంచం నలుమూలల నుంచి కళాకారులు, ప్రేక్షకులు ఈ పండుగకు తరలివస్తారు.
(చదవండి: దెయ్యాల కొంపలను తలపించే నిర్జన కట్టడాలు)