
హిందీ బిగ్‌బాస్ ఓటీటీ సీజన్-2 విజేత ఎల్విష్ యాదవ్ (Elvish Yadav) ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. సుమారు 24 బుల్లెట్లు ఆయన ఇంటిలోకి దూసుకెళ్లాయి. గురుగ్రామ్‌లో ఉన్న ఆయన ఇంటి వద్దకు ముగ్గురు యువకులు ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో చేరుకుని కాల్పులు జరిపారు.
దాడి చేసిన వ్యక్తులు పరారీలో ఉన్నారు. కాల్పులు జరిగినప్పుడు ఎల్విష్ యాదవ్ తన నివాసంలో లేడు. వివాదాస్పద యూట్యూబర్‌గా ఆయన పేరుంది. బహుళ అంతస్తులతో నిర్మించిబడిని ఆయన ఇంటి కింది అంతస్తులలో బుల్లెట్లు దూసుకుపోయాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 'ఈ సంఘటన ఈరోజు ఉదయం 5.30 మరియు 6 గంటల మధ్య జరిగింది. బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు సెక్టార్ 57లోని యాదవ్ ఇంటిపై 24 రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయారు. దాడి జరిగినప్పుడు అతని కేర్ టేకర్, కొంతమంది కుటుంబ సభ్యులు లోపల ఉన్నారు. కానీ ఎవరికీ గాయాలు కాలేదు.' అని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన వారు విచారణ ప్రారంభించారు.

2024లో నోయిడా పోలీసులు ఎల్విష్‌ను రేవ్ పార్టీలో పాము విషం సరఫరా కేసులో అరెస్టు చేశారు. అతడి దగ్గర 9 పాములతో పాటు 20ml పాము విషం స్వాధీనం చేసుకున్నారు. ఆపై కాశీ విశ్వనాథ ఆలయ సముదాయంలో ఫోటోలు, వీడియోలు తీసినందుకు ఎల్విష్‌పై కేసు నమోదైంది. జైపూర్‌లోని ఓ రెస్టారెంట్‌లో ఓ వ్యక్తిని ఎల్విష్ యాదవ్ చెంపపగలగొట్టిన వీడియో వైరల్ అయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలా పలు వివాదాలు ఆయన చుట్టూ ఉన్నాయి.