వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా దూసుకెళుతున్నారు ప్రభాస్. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రంలో ‘స్పిరిట్’ ఒకటి. ‘అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’కి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ‘యానిమల్’ మూవీ ఫేమ్ త్రిప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తుండగా, సీనియర్ నటి కాంచన, బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. భద్రకాళి పిక్చర్స్, టీ–సిరీస్ బ్యానర్స్‌పై ప్రణయ్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.
ఈ షెడ్యూల్‌లో ప్రభాస్ సెట్స్‌లోకి ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు. ఇతర నటీనటులపై సన్నివేశాలను చిత్రీక రిస్తున్నారు సందీప్. ఇదిలా ఉంటే.. ‘స్పిరిట్’లో ప్రభాస్ ఒక అకాడమీ టాపర్ ఐపీఎస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఈ మూవీ కోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఓ భారీ పోలీస్ స్టేషన్ సెట్‌ను రూపొందిస్తున్నారట మేకర్స్. ఈ సెట్‌లో ప్రభాస్‌కు ఒక వైల్డ్ ఎంట్రీ సాంగ్ ఉంటుందట.
అంతేకాదు... ఇదే సెట్‌లో సినిమాలో కీలకమైన యాక్షన్ సన్నివేశాలను కూడా చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. త్వరలో ఈ పాట, ఫైట్ షూట్‌లో ప్రభాస్ పాల్గొంటారట. ఈ ఎపిసోడ్స్ ‘స్పిరిట్’కి హైలైట్‌గా నిలుస్తాయని ఫిల్మ్‌నగర్ టాక్. అక్టోబరు 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ‘స్పిరిట్’ నుంచి ‘సౌండ్ స్టోరీ’ పేరుతో టీమ్ ఒక యునిక్ ఆడియో టీజర్‌ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.


