సాటి నటుడి పట్ల అక్కినేని నాగార్జున అపార గౌరవం
భావోద్వేగానికి గురైన విజయ్ సేతుపతి
ఏయన్నార్‌ను స్మరించిన మోహన్‌లాల్
ఎంచుకున్న రంగంలో ఏ స్థాయికి ఎదిగామన్నది కాదు... ఎంత ఎదిగినా, దాన్ని తలకెక్కించుకోకుండా ఎంత హుందాగా, సీనియర్ల నుంచి జూనియర్ల దాకా అందరితో ఎంత గౌరవంగా ప్రవర్తించామన్నది ముఖ్యం. అందరినీ ఆకట్టుకొనే ఆ తరహా ప్రవర్తనను అగ్ర నటుడు నాగార్జున మరోసారి ప్రదర్శించారు.
ఇటీవల చెన్నైలో జరిగిన ‘జియో – హాట్ స్టార్’ వారి ‘సౌత్ అన్ బౌండ్’ వేడుకలో ఆయన తన సీనియర్ నటుడు – మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌తో, మరో అగ్ర తమిళ నటుడు విజయ్ సేతుపతితో కలసి వేదిక పంచుకున్నారు.
ఆ సందర్భంగా వేదిక మీదకు వస్తూనే ఆయన చేసిన మొదటి పని ఏమిటో తెలుసా? పక్కనే ఉన్న విజయ్ సేతుపతి చేతి నుంచి చొరవగా ముందుగా మైకు తీసుకొని, మోహన్ లాల్‌ను అభినందించడం.
క్లాప్స్ కొట్టడం తప్ప మరేమీ చేయలేం!
మలయాళ చిత్రాల్లోనే కాక తెలుగు, హిందీ సహా వివిధ భాషల్లో నటించిన నటుడు మోహన్‌లాల్‌ను ఇటీవల కేంద్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇచ్చి, సత్కరించిన సంగతి తెలిసిందే.
ఆ తరువాత తొలిసారిగా వ్యక్తిగతంగా కలుస్తున్న మోహన్‌లాల్‌ను సభాముఖంగా నాగార్జున ఆత్మీయంగా అభినందించారు. “వెండితెర మీద ఎలాంటి పాత్రనైనా అద్భుతంగా పోషించగల అరుదైన నటుడు మోహన్‌లాల్ గారు.
ఏ తరహా పాత్ర అయినా సరే, అందులోకి పరకాయ ప్రవేశం చేసి, అద్భుతంగా పండిస్తారు. ఆయన ఏదైనా చేయగలరు. అలాంటి అభినయాన్ని చూసినప్పుడు చప్పట్లు కొట్టి, హర్షం వ్యక్తం చేయడం తప్ప మరేమీ చేయలేము” అంటూ నాగ్ తన మనసులో మాట ఆత్మీయంగా పంచుకున్నారు. ప్రత్యేకంగా శాలువా, పుష్పగుచ్ఛంతో మోహన్‌లాల్‌ను సత్కరించారు.
అడిగినా... అక్కినేని చెప్పలేదట!
ఆ సందర్భంగా నాగార్జున తన తండ్రి – సీనియర్ అగ్ర నటుడు స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావుతో జరిగిన ఓ ఆసక్తికరమైన సంఘటనను పంచుకున్నారు. సినీ రంగంలో కృషి చేసినవారికి భారత ప్రభుత్వమిచ్చే అత్యున్నత పురస్కారమైన “దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు మోహన్‌లాల్ గారు అన్ని విధాలా అర్హులైన నటుడు. ఈ అవార్డు ఎంత ప్రతిష్ఠాత్మకమైనదో నాకు బాగా తెలుసు.
ఎందుకంటే, కొన్నేళ్ళ క్రితం స్వయంగా మా నాన్న గారికి వచ్చింది. ఆ తరువాత ఫాల్కే అవార్డు విజేత ఎంపిక కమిటీలో మా నాన్న గారు కూడా సభ్యులుగా ఉన్నారు. ఒకసారి ఆ కమిటీ మీటింగ్ జరిగి, ఫాల్కే అవార్డు ఎవరికివ్వాలో నిర్ణయించారు. ఇంకా పేరు బయటకు ప్రకటించాల్సి ఉంది.
ఇంటికొచ్చాక నాన్న గారితో, ఈసారి ఫాల్కే అవార్డు ఎవరికిస్తున్నారని అడిగాను. ఎంత అడిగినా, ఆయన ఆ సంగతి చెప్పలేదు. గోప్యంగానే ఉంచారు. అంత నిజాయతీగా, నిఖార్సుగా ఇచ్చే అవార్డ్ గనకనే ఫాల్కే అవార్డ్ రావడమంటే అంత గొప్ప. అందుకే, మోహన్‌లాల్ గారికి ఈ అవార్డ్ రావడం ఎంతో ఆనందంగా ఉంది” అని నాగార్జున పాత సంగతులు ప్రస్తావించారు.
ఆ ఆటోగ్రాఫ్‌కు ఫ్రేమ్ కట్టుకున్న విజయ్ సేతుపతి!
వేదికపై ఉన్న తమిళ నటుడు విజయ్ సేతుపతి సైతం మోహన్ లాల్‌కు సత్కారం చేయడమే కాక, భావోద్వేగానికి గురవుతూ, “మోహన్‌లాల్ గారికీ, ఆయన నటనకూ నేను వీరాభిమానిని. ఏ పాత్ర ఇచ్చినా ఆయన అంత సునాయాసంగా ఎలా చేస్తారో అర్థం కాదు.
వీరాభిమానిగా నేను ఆయన దగ్గర తీసుకున్న ఆటోగ్రాఫ్‌ను భద్రంగా ఫ్రేమ్ కట్టి, ఇంట్లో దాచుకున్నాను. అలాంటి గొప్ప నటుడికి ఫాల్కే అవార్డ్ దక్కడం ఎంతో ఆనందం. ఆయనతో కలసి ఇలా వేదిక పంచుకోవడం, ఆయన ఎదురుగా మాట్లాడడం ఓ చెప్పలేని అనుభూతి” అని వ్యాఖ్యానించారు.
అనుకోని రీతిలో జరిగిన ఈ ఆత్మీయ అభినందనకు మోహన్‌లాల్ సైతం అంతే వినయంగా, ఆత్మీయంగా స్పందించారు. తనను అభినందించిన తోటి నటులకు కృతజ్ఞతలు చెబుతూనే, అక్కినేని నాగేశ్వరరావుతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.
మహానటుడు ఏయన్నార్‌తో కలసి నటించే అవకాశం, అదృష్టం తనకు దక్కాయంటూ, “బాలకృష్ణ హీరోగా దర్శకుడు ప్రియదర్శన్ తెలుగులో తీసిన ‘గాండీవం’ (1994) చిత్రంలో ఆయనతో కలసి నేను ఓ పాటలో (‘గోపబాలుడొచ్చెనమ్మ గోకులానికి...’ పాట) నటించాను.
డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగెన్‌లో ఆ పాట చిత్రీకరణ జరిగింది. ఏయన్నార్ గారి నటన, ప్రవర్తన నేను మర్చిపోలేను. ఎందరికో స్ఫూర్తిదాత అయిన ఆయన నాకు మంచి ఆత్మీయులయ్యారు” అని మోహన్‌లాల్ వివరించారు. ఇలా పరస్పర గౌరవం, ఆత్మీయ అభినందనలు చూసి, ప్రేక్షకులు పెద్దయెత్తున హర్షధ్వానాలు చేశారు. - రెంటాల జయదేవ


