- - భారతీయ సినిమా వైపు చూస్తున్న ప్రపంచం
- - భాషల హద్దులు దాటేసిన ‘కాంతార’, ‘దృశ్యం’, ‘అమరన్’
- - జనం భాషలో భాగమైన ‘బాహుబలి’, ‘పుష్ప’
అరచేతిలోని స్మార్ట్ ఫోన్‌లోనే అన్ని భాషల, ప్రాంతాల సినిమాలు, సీరియళ్ళు, ఓటీటీలు అందుబాటులోకి వచ్చేసిన నేపథ్యంలో... ప్రపంచం అక్షరాలా ఓ కుగ్రామమైంది. విభజనలు, సరిహద్దులు చెరిగిపోయి వినోద పరిశ్రమలో ఎన్నడూ లేని మార్పులు వస్తున్నాయి. ప్రముఖ సినీ నటుడు, పార్లమెంటు సభ్యుడు, ‘పద్మభూషణ్’ కమల్ హాసన్ ఆ సంగతే మరోసారి స్పష్టం చేశారు.
“ప్రాంతీయ సినిమా ఇవాళ ఎంతో మారిపోయింది. నిజం చెప్పాలంటే, ప్రాంతీయ సినిమా... ఇప్పుడు సరికొత్త జాతీయ స్థాయి సినిమాగా అవతరించింది. అలాగే, స్థానిక సంస్కృతిని ప్రతిబింబిస్తూ ఆ ప్రాంతపు మట్టి నుంచి పుట్టి, స్థానిక మూలాలపై తీస్తున్న సినిమా... నూతన అంతర్జాతీయ సినిమాగా మారిపోయింది. ఇవాళ మచిలీపట్నం, మదురై, మళప్పురమ్, మాండ్య... ఇలా దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడెక్కడో పుట్టిన కథలు సైతం కేవలం ప్రాంతీయ సినిమాలుగా మిగిలిపోవడం లేదు. అవి జాతీయస్థాయి సాంస్కృతిక సంరంభాలుగా మారుతున్నాయి” అని కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు.
బడ్జెట్ కాదు... నిజాయతీ ముఖ్యం!
కర్ణాటకలోని కోస్తా ప్రాంత్రంలోని స్థానిక సంస్కృతికి అద్దంపడుతూ, ‘భూతకోల’ సంప్రదాయం ఆధారంగా అల్లుకున్న ఓ జానపద కథ లాంటి సినిమా ‘కాంతార’ ఇవాళ దేశమంతటినీ ఊపేయడం అందుకు ఓ ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. అలాగే, కుటుంబాన్ని కాపాడుకోవాలనే ప్రయత్నంలో ఓ సాధారణ వ్యక్తి అసాధారణ రీతిలో సాగిన మలయాళ చిత్రకథ ‘దృశ్యం’ భాషలు, ప్రాంతాల సరిహద్దులు దాటేసిన సంగతి కమలహాసన్ గుర్తు చేశారు.
‘‘తెలుగులో వచ్చిన ‘బాహుబలి’, ‘పుష్ప’ లాంటివి ఇవాళ ముంబయ్ నుంచి మలేసియా దాకా ప్రతి ఒక్కరి దైనందిన జీవిత భాషలో భాగమైపోయాయి. తమిళం నుంచి వచ్చిన ‘విక్రమ్’, ‘అమరన్’ లాంటి చిత్రాలు సరిహద్దులు దాటి విజయం సాధించాయి. ఈ విజయాలకి కారణం సింపుల్... కథలు మన మట్టిలో నుండి పుట్టడమే. ఇవాళ బడ్జెట్ కాదు... స్థానికతను బలంగా చూపిస్తూనే సార్వత్రికంగా అందరినీ కదిలించే నిజాయతీతో కూడిన కథలు కీలకం. అవే భాషలు, ప్రాంతాల సరిహద్దుల్ని దాటేస్తాయి. ప్రామాణికత అనేది ఎప్పటికీ మురిగిపోని, ఎక్కడైనా చెల్లుబాటయ్యే కరెన్సీ లాంటిదని ఇది నిరూపిస్తోంది’’ అంటూ జాతీయ స్థాయిలో మన దక్షిణాది సినిమా కథలు సృష్టిస్తున్న సంచలనంపై ఆయన తన విశ్లేషణ అందించారు.
ఆ తేడా పోయింది..! ఇప్పుడు తెర కాదు... కథ కీలకం!!
దక్షిణాది వినోద మార్కెట్‌పై దృష్టి కేంద్రీకరిస్తూ, ‘జియో – హాట్ స్టార్’ నాలుగు దక్షిణాది భాషల్లో సరికొత్త సొంత కంటెంట్‌తో ముందుకొస్తున్న వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో జరిగిన ‘సౌత్ అన్ బౌండ్’ వేడుకలో ఈ అగ్రేసర దక్షిణాది నటుడు మాట్లాడుతూ, “భారతీయ వినోద రంగం అభివృద్ధి చెందడమే కాదు... ఓటీటీ సహా అనేక వాటితో సమూలంగా మారిపోతోంది. ఇవాళ ఏ కథ, ఏ తెర మీద చూస్తున్నామనే తేడా పోయింది. వినోద రంగంలో తొలిసారిగా ప్రేక్షకులే ఫ్లాట్ ఫాంగా మారుతున్న రోజులివి. కథలనేవి ఇక తెరకు మాత్రమే పరిమితం కాదు. ప్రజలు, ప్రేక్షకులతో కథలు ప్రయాణం చేయాలి. మన మూలాలతో కూడిన కథలను అందరికీ అందించేందుకు కృషి చేయాలి’’ అని కమల్ పేర్కొన్నారు. “అలాగే, తెరపై కథలను అందంగా చెప్పడం ప్రతిభతో ఆగిపోకూడదు. ఈ కథలను అత్యధిక మందికి చేరువ చేయడానికి సరైన నాయకత్వం అవసరం. ఈ విషయంలో జియో -హాట్ స్టార్ కీలక పాత్ర పోషిస్తుందని నమ్ముతున్నాను. వారు దక్షిణాదిని ఒక మార్కెట్ గా కాకుండా, క్రియేటివ్ గ్రావిటీగా చూడడం హర్షించదగ్గ విషయం’’ అని కమల్ అభినందించారు.
“ప్రపంచ సినిమా ఇప్పుడు భారతదేశం వైపు చూస్తోంది. మన భారతీయ మూలాలతో కూడిన కథలను ప్రపంచానికి అందించడానికి ఇది సరైన సమయం. యువతకు నేను చెప్పేది ఏమిటంటే, ప్రపంచ సినిమాలో మన కళాకారులు సత్తా చాటాలి. అదే నా కోరిక” అని ఆయన అన్నారు.


