‘అఖండ 2: తాండవం’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌ | Akhanda 2: Thandavam Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

akhanda 2 Review: బాలకృష్ణ ‘అఖండ 2’ మూవీ హిట్టా? ఫట్టా?

Dec 12 2025 2:58 AM | Updated on Dec 12 2025 3:28 AM

Akhanda 2: Thandavam Movie Review And Rating In Telugu

టైటిల్‌ : అఖండ 2: తాండవం
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా, పూర్ణ, సాయి కుమార్‌, రచ్చ రవి తదితరులు
నిర్మాణ సంస్థ:  14 రీల్స్ ప్లస్
నిర్మాతలు: రామ్ ఆచంట, గోపి ఆచంట
రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను
సంగీతం: తమన్‌ ఎస్‌ ఎస్‌
సినిమాటోగ్రఫీ: సి. రాంప్రసాద్,సంతోష్ డేటాకే
ఎడిటర్: తమ్మిరాజు
విడుదల తేది: డిసెంబర్‌ 12, 2025    


సింహ, లెజెండ్‌, అఖండ తర్వాత బాలకృష​, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన నాలుగో చిత్రం ‘అఖండ 2: తాండవం’. 2021లో వచ్చిన అఖండ చిత్రానికి సీక్వెల్‌ ఇది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్‌ కూడా గట్టిగా చేయడంతో ‘అఖండ 2’పై బజ్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే..
చైనా ఆర్మీ జనరల్‌ తన కొడుకు చావుకు కారణమైన భారత్‌పై పగ తీర్చుకునేందుకు భారీ కుట్ర చేస్తాడు. మాజీ జనరల్‌  సహాయంతో బయోవార్‌ ద్వారా భారత్‌ను దొంగదెబ్బ తీయాలనుకుంటాడు. ఇందుకుగాను భారత్‌లో బలమైన ప్రతిపక్ష నేతగా ఉన్న ఠాకూర్‌(కబీర్‌ దుల్షన్‌ సింగ్‌) ని పావుగా వాడుతాడు. అతని సహాయంతో భారతీయులు బలంగా నమ్మే దేవుడు లేడని నిరూపించి..వారిమధ్య చిచ్చు పెట్టాలనుకుంటాడు. అందులో భాగంగా మహా కుంభమేళకు వచ్చిన భక్తులు స్నానం చేసే నదిలో డేంజర్‌ కెమికల్‌ కలిపిస్తాడు. దీంతో నదిలో స్నానం చేసినవారందరూ క్షణాల్లో కుప్పకూలిపోతారు. ప్రతిపక్ష నేత ఠాకూర్‌ ఈ ఘటనను రాద్ధాంతం చేసి దేవుడే ఉంటే ఇలా జరిగేకాదు..అసలు దేవుడు అనేవాడే లేడంటూ సామాన్యులను నమ్మిస్తాడు. జనాలు కూడా దేవుళ్లకు పూజలు చేయడం ఆపేస్తారు. మరోవైపు భక్తులకు వచ్చిన కొత్త రోగానికి వాక్సిన్‌ కనిపెట్టే పనిలో ట్రైనీ సైంటిస్ట్‌, ఎమ్మెల్యే బాలమురళీకృష్ణ(బాలకృష్ణ) కూతురు జనని(హర్షాలి మల్హోత్రా) సక్సెస్‌ అవుతుంది. ఈ విషయం తెలుసుకున్న ఠాకూర్‌ తన మనషులతో ఆ సైంటిస్టులను చంపేయిస్తాడు. జనని తప్పించుకొని పారిపోగా..ఠాకూర్‌ మనషులు ఆమెను వెతుకుతుంటారు. అదే సమయంలో రంగంలోకి దిగుతాడు అఖండ(బాలకృష్ణ). ఆ తర్వాత ఏం జరిగింది? ఠాకూర్‌ మనషుల నుంచి జననిని ఎలా కాపాడాడు? దేవుడే లేడని నమ్మిన జనాలకు.. ఆయన ఉన్నాడు? ఆపద వస్తే వస్తాడు? అని ఎలా నిరూపించాడు? సనాతనధర్మం పాటించే భారతీయులను దొంగదెబ్బ కొట్టాలనుకున్న చైనా ఆర్మీకి ఎలాంటి గుణపాఠం నేర్పించాడు? ఇందులో నేత్ర(ఆదిపినిశెట్టి), అర్చనగోస్వామి(సంయుక్త) పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే(Akhanda 2 Review).

ఎలా ఉందంటే.. 
బాలకృష్ణ సినిమా అంటే ఎలా ఉంటుందో జనాలకు ఓ అంచనా ఉంది. అందులోనూ బోయపాటితో సినిమా అంటే.. లాజిక్‌ అనే పదాన్ని భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. ఈ విషయం తెలిసి థియేటర్స్‌కి వెళ్లినా కూడా మన ఊహకు మించిన అనుభవం ఈ సినిమాలో ఎదురవుతుంది. లాజిక్స్‌ పక్కకి పెట్టి చూసినా కూడా సినిమాలోని కొన్ని సీన్లకు నవ్వాలో ఏడవాలో కూడా తెలియదు. దైవశక్తితో కథను ప్రారంభించిన బోయపాటి మధ్యలో దృష్టశక్తిని తీసుకొచ్చి.. చివరిలో దేశభక్తితో  ముగించాడు. మధ్య మధ్యలో సనానతధర్మం గురించి క్లాసులు తప్పితే..ఒక్క సీన్‌ కూడా ఆకట్టుకునేలా ఉండదు. అసలు కథనమే ఊహకందేలా సాగితే..ఇక ఆసక్తి ఎలా పెరుగుతుంది?

ఇక యాక్షన్‌ సీన్ల దగ్గరకు వస్తే..ప్రతిసారి త్రిశూలాన్ని అటు తిప్పడం..ఇటు తిప్పడం తప్ప కొత్తగా ఏమి ఉండదు. పైగా కొన్ని యాక్షన్‌ సీన్లు చూసినప్పుడు.. ‘బాలయ్య సినిమా కదా..అంతే..అంతే’అనుకోవాల్సిందే. మనిషిని తలకిందులు చేసి హారతి ఇవ్వాలన్నా.. త్రీశూలంతో హెలికాఫ్టర్‌ రెక్కల్ని గిరగిరా తిప్పాలన్నా... ఒక్కడే చైనా వెళ్లి ఆర్మీ సైన్యాన్ని మొత్తాన్ని చంపాలన్న.. ‘బాలయ్య సినిమాల్లోనే సాధ్యం’ అని మన మనసుకు నచ్చజెప్పుకోకపోతే.. క్లైమాక్స్‌ వరకు థియేటర్స్‌లో కూర్చోలేం. అసలే రొటీన్‌ కథ.. దానికి తోడు యాక్షన్‌ సీన్లు కూడా రొటీన్‌గా ఉండడంతో కథనం మొత్తం సాగదీతగా అనిపిస్తుంది.

అఖండ సినిమాకు కొనసాగింపుగా కథను ప్రారంభించారు. ఆ చిత్రంలోని చిన్నపాప పెరిగి పెద్దదై.. సైటిస్ట్‌గా మారుతుంది. మరోవైపు అఖండ సోదరుడు బాలమురళీకృష్ణ ఎమ్మెల్యే అయినట్లు చూపించారు. బాలయ్య 1 ఎంట్రీ సీన్‌కో ఎలివేషన్‌.. బాలయ్య 2 ఎట్రీ సీన్‌తో ఎలివేషన్ అవి తప్ప మొదటి అరగంట కథే ఉండదు.పైగా శివుడు ఎలిమెంట్స్‌ ఉన్న సినిమాలో బాలకృష్ణ ఎలివేషన్‌ తప్ప.. శివుడికి ఎలివేషన్‌ ఉండదు. ఒకటి రెండు సీన్లలో శివుడిని పవర్‌ఫుల్‌గా చూపించే ప్రయత్నం చేశారు. ఫస్టాఫ్‌ మొత్తం రొటీన్‌గా సాగుతూ...ఇంటర్వెల్‌ సీన్‌ నుంచి అసలు కథలోకి తీసుకెళ్లాడు. విరామానికి ముందు వచ్చే యాక్షన్‌ సీన్లు బాలయ్య ఫ్యాన్స్‌ ఎంజాయ్‌ చేస్తుంటే..నార్మల్‌ ప్రేక్షకులు మాత్రం ‘అరె..ఎంట్రా ఇది’ అనుకుంటారు. ఉన్నంతలో సెకండాఫ్‌లో కథనం కాస్త పరుగులు తీస్తుంది. అయితే ప్రతిసారి అఖండ రావడం..ఓ క్లాస్‌ తీసుకోవడం బోర్‌ అనిపిస్తుంది. ఇక సినిమాలో బాలయ్య చెప్పే కొన్ని డైలాగులు అయితే.. అక్కడ సీన్‌తో సంబంధమే ఉండదు. పెద్ద పెద్ద డైలాగులు చెబుతాడు కానీ ఒక్కటి కూడా అర్థం కాదు. పైగా ఇప్పుడెందుకు ఈ డైలాగు చెప్పాడు? అనే ఫీలింగ్‌ కలుగుతుంది. అలాగే ఆది పినిశెట్టి పాత్ర కూడా అనవసరంగా చొప్పించినట్లు అనిపిస్తుంది. దైవశక్తి కాన్సెప్ట్‌ ఉంది కాబట్టి.. దుష్టశక్తి సీన్లను కూడా చూపించాలనుకొని ఆది పాత్రను క్రియేట్‌ చేశారనిపిస్తుంది. ఆ పాత్ర ఎపిసోడ్‌ మొత్తం తీసేసినా.. అసలు కథకు ఎలాంటి ఇబ్బంది కలగదు. క్లైమాక్స్‌కి ముందు వచ్చే యాక్షన్‌ సీన్లు కొంతమేర ఆకట్టుకుంటాయి. మొత్తంగా అఖండ 2 బాలయ్య అభిమానులకు కాస్త నచ్చవచ్చేమో కానీ సాధారణ ప్రేక్షకులు మాత్రం సినిమా చూసి నీరసంగా నిట్టూరుస్తూ బయటకు వస్తారు. 
 

ఎవరెలా చేశారంటే.. 
బాలయ్య ఎప్పటి మాదిరే తెరపై హుషారుగా కనిపించే ప్రయత్నం చేశాడు.అయితే ఈ సారి మాత్రం తెరపై ఆయన  వృద్ధాప్యం కొట్టొచ్చినట్టు కనిపిచ్చింది. ముఖ్యంగా అఖండ పాత్రలో ఆయన ముసలితనం మొత్తం బయటపడింది. ఇక యంగ్‌ బాలకృష్ణ పాత్ర లుక్‌ బాగుంది. పెద్ద పెద్ద డైలాగులు ఉన్నా.. ఒక్కటి కూడా అర్థం కాదు. మాస్‌ పాట కోసం ఆయన వేసిన స్టెప్పులు ఆకట్టుకోకపోగా..ట్రోలింగ్‌కి మెటీరియల్‌గా మిగిలిపోయాయి. విలన్‌గా ఆది పినిశెట్టి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. అయితే ఆ పాత్ర సినిమాలో అనవసరం అనే ఫీలింగ్‌ కలుగుతుంది. సంయుక్త పాత్ర పరిధి తక్కువే అయినా ఉన్నంతలో బాగానే చేసింది. శివుడు పాత్ర చేసిన నటుడు బాగా నటించాడు.  పూర్ణ, సాయి కుమార్‌, రచ్చ రవి తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. 

సాంకేతిక విభాగాల పనితీరు విషయాలకొస్తే.. తమన్‌ సంగీతం బాగుంది. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. పాటలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. రామ్‌ప్రసాద్, సంతోష్‌ డేటాకే సినిమాటోగ్రఫీ బాగుంది.ఎడిటింగ్‌ ఓకే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement