తార్ మార్ తక్కర్ మార్ అన్నట్లు... ఈ వారంలో విడుదల కావాల్సిన సినిమాల విడుదల తేదీలు తారుమారయ్యాయి. భారీ చిత్రం ‘అఖండ 2’ విడుదల అటూ ఇటూ కావడంతో ఈ వారంలో విడుదల కావాల్సిన కొన్ని చిత్రాలు వాయిదా పడ్డాయి. అయితే కార్తీ ‘అన్నగారు వస్తారు’ చిత్రం ఆర్థిక సమస్యల కారణంగా శుక్రవారం (డిసెంబరు 12) విడుదల కావడం లేదు. ఈ చిత్రం కొత్త తేదీ త్వరలో ప్రకటిస్తారు. ఇక... వాయిదా పడిన చిత్రాల గురించి తెలుసుకుందాం.
అన్నగారు... కమింగ్ సూన్
కార్తీ హీరోగా నటించిన తాజా తమిళ చిత్రం ‘వా వాత్తియార్’. కృతీ శెట్టి హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రం తెలుగులో ‘అన్నగారు వస్తారు’ టైటిల్‌తో విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని నలన్ కుమారస్వామి దర్శకత్వంలో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఈ సినిమా డిసెంబరు 12న రిలీజ్ కావాల్సింది. కానీ కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందుల కారణాల వల్ల ఈ చిత్రం నేడు విడుదల కావడం లేదు. త్వరలోనే కొత్త విడుదల తేదీని వెల్లడిస్తామని మేకర్స్ గురువారం తెలిపారు.
లాక్ డౌన్ మరోసారి వాయిదా
అనుపమా పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన ‘లాక్ డౌన్’ చిత్రం మరోసారి వాయిదా పడింది. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా పోస్ట్‌పోన్ అయింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రోడక్షన్స్ ప్రకటించింది. ఏఆర్ జీవా దర్శకత్వంలో అనుపమా పరమేశ్వరన్ లీడ్ రోల్‌లో రూపొందిన తమిళ చిత్రం ‘లాక్ డౌన్’. కరోనా సమ యంలో ఏర్పడిన లాక్ డౌన్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాను నవంబరు 23న గోవాలో జరిగిన 56వ ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’లో ప్రదర్శించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 5న విడుదల చేయనున్నట్లు తొలుత చిత్రబృందం ప్రకటించింది.
అయితే చెన్నైలో వర్షాల కారణంగా 5వ తేదీ నుంచి 12కు వాయిదా వేశారు. కానీ నేడు కూడా విడుదల చేయడం లేదంటూ... రిలీజ్‌కి ఒక్క రోజు ముందు (గురువారం) లైకా ప్రోడక్షన్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘కొన్ని పరిస్థితుల వల్ల మా ‘లాక్ డౌన్’ విడుదలను వాయిదా వేస్తున్నాం. మా మూవీ వాయిదా వల్ల ప్రేక్షకులకు, థియేటర్ భాగస్వాములకు, డిస్ట్రిబ్యూటర్లకు ఇబ్బంది కలుగుతున్నందుకు విచారణ వ్యక్తం చేస్తున్నాం. త్వరలో కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అని లైకా ప్రోడక్షన్స్ సంస్థ పేర్కొంది.
న్యూ ఇయర్‌కి సైక్ సిద్ధార్థ
శ్రీ నందు హీరోగా నటించిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ మూవీ ‘సైక్ సిద్ధార్థ’. యామినీ భాస్కర్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించగా, ప్రియాంక రెబెకా శ్రీనివాస్, సాక్షి అత్రీ, మౌనిక కీలక పాత్రల్లో నటించారు. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సపోర్ట్‌తో శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి నిర్మించిన ఈ చిత్రం ఈ డిసెంబరు 12న విడుదల కావాల్సింది. కానీ ఈ సినిమాను
జనవరి 1కి వాయిదా వేశారు.
వారం ఆలస్యంగా సఃకుటుంబానాం
రామ్ కిరణ్, మేఘా ఆకాశ్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘సఃకుటుంబానాం’. ఉదయ్ శర్మ దర్శకత్వంలో మహదేవ్ గౌడ్, నాగరత్న నిర్మించారు. ఈ సినిమా నేడు (డిసెంబరు 12న) రిలీజ్ కావాల్సింది. కానీ ఈ నెల 19కి వాయిదా వేసినట్లుగా మేకర్స్ గురువారం ప్రకటించారు. ‘‘బాలకృష్ణగారి ‘అఖండ 2: తాండవం’ డిసెంబరు 12న రిలీజ్‌కు సిద్ధమైంది. దీంతో మా సినిమా రిలీజ్‌ను 19కి వాయిదా వేశాం’’ అని యూనిట్ పేర్కొంది.
ఆలస్యంగా మిస్ టీరియస్
‘రక్త కన్నీరు’ సినిమా ఫేమ్, దివంగత నటుడు నాగభూషణం మనవడు అబిద్ భూషణ్‌తో పాటు రోహిత్ సహాని, రియా కపూర్, మేఘనా రాజ్‌పుత్ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘మిస్ టీరియస్’. మహి కోమటిరెడ్డి దర్శకత్వంలో జై వల్లందాస్ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. ఈ నెల 19న రిలీజ్ చేస్తామని జై వల్లందాస్ తెలిపారు.


