నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం ‘గుర్రం పాపిరెడ్డి’. మురళీ మనోహర్ దర్శకత్వంలో డా. సంధ్య గోలీ సమర్పణలో వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో చిత్రదర్శకుడు మురళీ మనోహర్ మాట్లాడుతూ– ‘‘శివ, నాయకుడు’ వంటి సినిమాలు చూసి, సినిమా ఇండస్ట్రీపై ఆసక్తి కలిగింది. ఎమ్‌బీఏ పూర్తి చేసిన తర్వాత లండన్‌లోని ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చేరాను. వార్నర్ బ్రదర్స్ సినిమాలకు టెక్నికల్ వర్క్ చేశాను.
ఆ తర్వాత ఇండియా వచ్చాను. 2010 నుంచి టాలీవుడ్‌లోనే ఉంటున్నాను. సంపత్ నందిగారి దగ్గర వర్క్ చేశాను. ‘సింబా’ చిత్రంతో ఆయన నన్ను డైరెక్టర్‌గా లాంచ్ చేశారు. నా దర్శకత్వంలోని తాజా సినిమా ‘గుర్రం పాపిరెడ్డి’. తెలివైనవాళ్ళు, తెలివి తక్కువవాళ్ల మధ్య జరిగే యుద్ధమే ఈ సినిమా కథ. తెలివైనవాడు తెలివి తక్కువ పని చేసినా, తెలివి తక్కువవాడు తెలివైన పని చేసినా... వారి జీవితాలు ఏ విధంగా తారుమారు అవుతాయి? అన్నది ప్రధానాంశం. కథలో కొందరు తమ తెలివితక్కువ పనులతో ఇబ్బందులు పడుతుంటారు. వాళ్ల ఇబ్బందులు మనకు నవ్వు పుట్టిస్తాయి.
సినిమాలో మంచి ఆర్గానిక్ కామెడీ ఉంది. నాకు రెగ్యులర్ సినిమాలు చేయడం ఇష్టం లేదు. నా తొలి సినిమా ‘సింబా’తో పోలిస్తే, ‘గుర్రం పాపిరెడ్డి’ పూర్తిగా విభిన్నమైన చిత్రం. నరేష్ అగస్త్య నటించిన గత చిత్రాలు చూసి, ఈ సినిమాలోని గుర్రం పాపిరెడ్డి క్యారెక్టర్ కోసం అతన్ని తీసుకున్నాను. బ్రహ్మానందంగారు జడ్జ్ పాత్రలో కనిపిస్తారు. సినిమాలో ఆయనది ఫుల్ లెంగ్త్ రోల్ ఉంటుంది. యోగిబాబు వంటి ఇతర భాషల తారలు కూడా నటించారు. ఇక ఈ చిత్రనిర్మాతలతోనే ఓ హారర్ మూవీ కమిట్‌మెంట్ ఉంది. అలాగే ఓ మ్యూజికల్ రొమాంటిక్ మూవీ చేయాలనుకుంటున్నాను’’ అని చెప్పారు.


