
సాక్షి, తిరుపతి: జూనియర్ ఎన్టీఆర్‌పై ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వాఖ్యలపై వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. సినిమా, రాజకీయాలు మిక్స్ చేయెద్దంటూ ఆమె హితవు పలికారు. అరచేతితో సూర్యుడ్ని ఆపలేరన్నారు. ఎమ్మెల్యేలు టికెట్లు కొన్నా.. అభిమానులు పవన్ సినిమాకు రాలేదంటూ రోజా వ్యాఖ్యానించారు.
ఉచిత బస్సు ప్రయాణంలో ఆంక్షలపై రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్త్రీశక్తి పేరుతో మహిళలను దగా చేశారని ఆమె మండిపడ్డారు. 16 రకాలు బస్సులు ఉన్నాయి.. ఇప్పుడు 5 బస్సులకు మాత్రమే అమలు చేస్తున్నారంటూ రోజా దుయ్యబట్టారు. 14 నెలలు తర్వాత స్తీశక్తి బస్సు ప్రారంభించారు. లోకల్‌గా తిరిగే బస్సుల్లో మాత్రమే ఉచిత బస్సులకు అమలు చేశారు’’ అంటూ ఆర్కే రోజా నిలదీశారు.
‘‘రాష్ట్రం మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీ అని చెప్పి.. ఇవాళ ఆంక్షలు పెట్టారు. చంద్రబాబు ప్రభుత్వం కోతలు ప్రభుత్వమని మరోసారి నిరూపించుకుంది. తిరుమల, అన్నవరం, విజయవాడ, శ్రీశైలం పుణ్య క్షేత్రాలకు ఉచిత దర్శనం లేదు. భగవంతుడు పేరు చెప్పి ఓట్లు దండుకున్నారు. మహిళల్ని మోసం చేశారు. పల్లె వెలుగు బస్సుల్లోనే పంపిస్తామని ఎన్నికలు ముందు మీరు చెప్పారు. మహిళల్ని మోసం చేయడమే పనిగా పెట్టుకున్నారు.
..కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదు. సూపర్ సిక్స్.. హిట్ కాదు.. సూపర్ ప్లాప్. తిరుపతి నుంచి తిరుమలకు ఉచిత బస్సు ప్రయాణం లేదు. శ్రీశైలం, విజయవాడ దుర్గమ్మ గుడి, సింహాచలానికి ఉచిత ప్రయాణం లేదు. ఆడబిడ్డ నిధి.. 18 ఏళ్లు నిండిన వారికి ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పి ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఆడబిడ్డ లేరు కాబట్టి.. చంద్రబాబుకు ఆడవాళ్లను గౌరవించడం తెలీదు. కానీ, పవన్ కళ్యాణ్‌కు ఆడబిడ్డలు ఉన్నారు కాబట్టి ఆయన ప్రశ్నించాలి.

జగనన్న ఆడబిడ్డలకు చెప్పింది చెప్పినట్లుగా అమలు చేశారు. చంద్రబాబు అధికారంలోకి రావడం కోసమే.. అబద్ధాలు చెప్పారు. మహిళల్ని మోసం చేసినవాళ్లు ఏ రాష్ట్రంలో బాగుపడింది లేదు. వైఎస్ జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తామంటూ చెప్పి చంద్రబాబు మోసం చేశాడు’’ అంటూ ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.