నిర్ణీత సమయంలో శ్రీవారి దర్శనం
తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం అర్ధరాత్రి వరకు వైకుంఠ ద్వార దర్శనం ద్వారా 70,256 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 25,102 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.79 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది.
15న సీఎం చేతుల మీదుగా లాటరీ
తిరుపతి అర్బన్: అర్హులైన వారికి శెట్టిపల్లి ప్లాట్లు, వ్యవసాయ భూముల కేటాయింపును లాటరీ పద్ధతిలో ఈ నెల 15వ తేదీన సీఎం చంద్రబాబునాయుడు చేతుల మీదుగా చేస్తా మని కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడించారు. గురువారం ఆయన కలెక్టరేట్‌లో ఇన్‌చార్జి జేసీ మౌర్య, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్‌రెడ్డితో కలసి రెవెన్యూ, తుడా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శెట్టిపల్లి లే అవుట్ పనులు పూర్తి చేశామని స్పష్టం చేశారు. ప్లాట్లు, వ్యవసాయ భూముల కేటాయింపు అనంతరం ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. కేటాయింపుల అనంతరం ఆ ప్రాంతంలో సకల సౌకర్యాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. రెండు సెంట్లు తక్కువ లేకుండా లబ్ధిదారులకు ప్లాట్లు ఇస్తామని చెప్పారు. తుడాకు కేటాయించిన 65 ఎకరాల్లో టౌన్‌షిప్ అత్యంత సుందరంగా, మెరుగైన మౌలిక సదుపాయాలు కలిగి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్, తుడా చీఫ్ ప్లానింగ్ అధికారి దేవికుమారి, తుడా భూ సేకరణ అధికారి సుజన, తుడా కార్యదర్శి శ్రీకాంత్‌బాబు, తహసీల్దార్ సురేష్‌బాబు, డీటీ రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
అనాథలతో ఎస్పీ
ఆంగ్లసంవత్సరాది వేడుకలు
తిరుపతి క్రైమ్: అనాథ పిల్లల నడుమ ఎస్పీ సుబ్బరాయుడు ఆంగ్లనూతన సంవత్సరాది వేడుకలు జరుపుకున్నారు. జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి జీవకోనలో రైజ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనాథ శరణాలయాన్ని గురువారం సందర్శించారు. అనంతరం అక్కడ ఉన్న అనాథ పిల్లలతో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు. ఆ పిల్లలతో కలిసి వారితో కేక్ కట్ చేయించి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే విద్యార్థినులకు టవళ్లు, నోటు పుస్తకాలు, సబ్బులు, స్టేషనరీ సామగ్రిని అందజేశారు. జిల్లా ఎస్పీ స్వయంగా కుటుంబ సభ్యులతో కలిసి హాజరవడంపై నిర్వాహకులు, విద్యార్థినులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టుకతో ఎవరూ అనాథలు కారని, నిజంగా అనాథలు అనేవారు తల్లిదండ్రులు, అయినవారు తమ బాధ్యతలను వదిలేసిన వారే అని పేర్కొన్నారు. సమాజం పిల్లల భవిష్యత్తుపై మరింత బాధ్యతతో వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అలిపిరి సీఐ రామ్ కిషోర్, ఎస్‌ఐలు, సిబ్బంది శరణాలయం సిబ్బంది పాల్గొన్నారు.
కల్యాణ వెంకన్న సన్నిధిలో ఎంపీ గురుమూర్తి
తిరుపతి రూరల్: తుమ్మలగుంటలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి వారిని తిరుపతి ఎంపీ గురుమూర్తి గురువారం దర్శించుకున్నారు. కొత్త సంవత్సరం రోజును పురస్కరించుకుని ఆయన కల్యాణవెంకన్నను దర్శించుకుని, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అక్రమ కేసుల్లో నుంచి త్వరగా బయటకు వచ్చేలా చూడాలని ప్రార్థించారు. ఎంపీ గురు మూర్తికి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సాదర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం శాలువతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
నిర్ణీత సమయంలో శ్రీవారి దర్శనం
నిర్ణీత సమయంలో శ్రీవారి దర్శనం


