రైలు టికెట్ రిజర్వేషన్‌లో మార్పులు
తిరుపతి అన్నమయ్యసర్కిల్: రైల్వే టికెట్ రిజర్వేషన్ విధానంలో పలు మార్పులు తీసుకొచ్చింది. కొత్త సంవత్సరం సందర్భంగా గురువారం నుంచి ఈ మార్పులు అమల్లోకి వచ్చాయి. రైల్వే శాఖ గతేడాది అక్టోబర్ ఒకటో తేదీ నుంచి జనరల్ టికెట్ రిజర్వేషన్‌కు సంబంధించిన నిబంధనలు మార్పు చేసింది. బుకింగ్ కోసం ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి చేసింది. అప్పటి నుంచి ఐఆర్‌సీటీసీతో ఆధార్ లింక్ అయిన వారు మాత్రమే మొదటి 15 నిమిషాల్లో టికెట్లు బుక్‌చేసుకోవచ్చు. అయితే అడ్వాన్‌న్స్ రిజర్వేషన్ పీరియడ్‌లో (ప్రయాణ తేదీకి 60 రోజుల ముందు) బుకింగ్‌కు సంబంధించి నిబంధనలను మరింత కఠినతరం చేస్తోంది. ప్రస్తుతం రిజర్వేషన్ ప్రారంభమైన తరువాత ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ ద్వారా తొలి 15 నిమిషాల్లో ఆధార్ అథెంటిఫికేషన్ ఉన్న వ్యక్తులకు మాత్రమే రిజర్వేషన్ చేసుకునే అవకాశం ఉంది. ఈ సమయాన్ని గతేడాది డిసెంబర్ 29 నుంచి నాలుగు గంటల వరకు పెంచింది. అంటే ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు టికెట్ బుక్ చేయాలంటే ఆథార్ అథెంటిఫికేటెడ్ అకౌంట్లకే సాధ్యమవుతుంది. కాగా, టికెట్ రిజర్వేషన్ సమయం 15 నిమిషాల నుంచి 4 గంటలకు పెంచింది. ఇక ఆధార్ అథెంటికేషన్ లేని వినియోగదారులు మధ్యాహ్నం 12 తర్వాత టికెట్లను బుక్ చేసుకునేందుకు వీలు ఉంటుంది. అయితే ఈ సమయాలను కూడా ఈ నెల 5 నుంచి ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, 12వ తేదీ నుంచి ఉదయం 8 నుంచి రాత్రి 12 గంటల వరకు పెంచనుంది. దీని ద్వారా ఈ సమయాల్లో కేవలం ఆధార్ వెరిఫైడ్ యూజర్లు మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవచ్చు. కాగా తత్కాల్ టికెట్లకు (ఆన్‌లైన్) సంబంధించి గతేడాది జులై ఒకటో తేదీ నుంచే ఆధార్ అథెంటికేషన్‌ను తప్పనిసరి చేసింది. పీఆర్‌ఎస్ కౌంటర్లు, ఏజెంట్ల ద్వారా తత్కాల్ టికెట్లు బుక్ చేసినా ఓటీపీ వెరిఫికేషన్ తప్పనిసరిగా ఉంది. ఇకపై నిబంధనలన్నీ ఆన్‌లైన్ బుకింగ్‌లకు సంబంధించినవే ఉంటాయి. ఇవి పీఆర్‌ఎస్ కౌంటర్ల ద్వారా టికెట్లను బుక్ చేసుకునేందుకు వర్తించవని రైల్వే అధికారులు వెల్లడించారు.


