తలకోనలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి
తిరుపతి రూరల్: తలకోన సిద్ధేశ్వర స్వామివారిని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి దర్శించుకున్నారు. నూతన ఆంగ్ల సంవత్సరాదిన పెద్దిరెడ్డి, చెవిరెడ్డి కుటుంబసభ్యులు కలసి తలకోన వెళ్లి సిద్ధేశ్వరస్వామివారిని గురువారం దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న పెద్దిరెడ్డి, చెవిరెడ్డి కుటుంబసభ్యులకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామివారిని దర్శించుకున్నారు. తరువాత ఆలయ ఈఓ రవీంద్రరాజు శాలువతో సత్కరించారు. వేదపండితులు ఆశీర్వచనాలు పలికి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ అన్నదాన కేంద్రంలో స్థానికులు ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు హాజరైన పెద్దిరెడ్డి, మోహిత్‌రెడ్డి అందరితో ఆత్మీయంగా మాట్లాడుతూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తిరుపతి నుంచి తలకోనకు బయలుదేరిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డికి దారి పొడవునా పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. డీసీఎంఎస్ మాజీ చైర్మన్ సహదేవరెడ్డి, సీనియర్ నాయకుడు చెంగల్‌రెడ్డి వారి వెంట రాగా భాకరాపేట సర్పంచ్ సాకిరి భూపాల్, పార్టీ మండల అధ్యక్షుడు సింహాల మోహన్ తదితరులు సాదర స్వాగతం పలికారు.


