
మరణించినా.. మాట్లాడొచ్చు
భౌతిక మరణాన్ని జయించేలా ఏఐ టూల్స్
సాంకేతిక వనరులతో జీవం పోసి కొన్ని రూపాల్లో కృత్రిమ మేధతో కృషి
క్రమంగా పెరుగుతున్న ‘గ్రీఫ్ టెక్’ వినియోగం
ఇది వరమా? శాపమా?
మనకిష్టమైన వారు భౌతికంగా మరణించినా మనం వారితో మాట్లాడొచ్చు. ఇదెలా సాధ్యం? భవిష్యత్‌లో చోటుచేసుకోబోయే మార్పుల గురించి ముందుచూపుతో ఊహించే కొంతమంది శాస్త్రవేత్తలు చెబుతున్న దానిని బట్టి చూస్తే.. మనం సాంకేతిక అమరత్వాన్ని సాధించవచ్చనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ప్రస్తుతం ఆ పరిస్థితులకు మనం కొంత దూరంలో ఉన్నప్పటికీ ఆ దిశలో కొన్ని ప్రయత్నాలు మొదలయ్యాయి.
సాక్షి, హైదరాబాద్: కృత్రిమ మేధ (ఏఐ) అనేది మరణించిన వ్యక్తులను వారి స్వరం, ప్రవర్తన, నిర్ణయం తీసుకునే విధానం తదితర అంశాల ద్వారా ‘సజీవంగా’నిలిపే అవకాశాలను మెరుగుపరుస్తోంది. మీరు షేర్ చేసే ప్రతి ఫొటో, మీరు పంపే పోస్ట్, వాయిస్ నోట్ వంటివి డిజిటల్ డీఎన్‌ఏగా మారుతున్నాయి. ఇలాంటి సాంకేతిక వనరులకు జీవం పోసి కొన్నిరూపాల్లో చావును అధిగమించే దిశలో కృతిమ మేధ (ఏఐ) ద్వారా కృషి జరుగుతోంది.
ఇది అర్థంకాని సైన్స్ ఫిక్షన్‌లాగా కనిపిస్తున్నప్పటికీ భవిష్యత్ లో ఇలాంటివి ‘గ్రీఫ్‌టెక్’ద్వారా వాస్తవరూపం దాల్చే పరిస్థితులు ఉన్నాయని నిపుణులు ఘంటాపథంగా చెబుతున్నారు. ఈ గ్రీఫ్‌టెక్ వినియోగం ఇప్పుడిప్పుడే మొదలైందని అంటున్నారు.
ఏమిటీ ‘గ్రీఫ్ టెక్’?
2020లో దక్షిణ కొరియా టీవీషో ఒక అవాస్తవ పునఃకలయికను ప్రసారం చేసింది. శోకతప్తమై దుఃఖిస్తున్న ఓ తల్లి వర్చువల్ రియాలిటీ (వీఆర్) ద్వారా మరణించిన తన కుమార్తెతో సంభాషించింది. డిజిటల్ సాంకేతిక సహకారంతో ఆ బిడ్డ కదిలింది, మాట్లాడింది, తల్లి ప్రశ్నలకు ప్రతిస్పందించింది. ఇది వాయిస్ నమూనాలు, వీడియో ఫుటేజ్, మెషీన్ లెర్నింగ్ ఆధారంగా సాధ్యమైంది. దీనినే ‘గ్రీఫ్ టెక్’అని పిలుస్తున్నారు. మరణించిన వ్యక్తి ఎలా టెక్ట్స్ చేశాడు, ఎలా జోక్ చేశాడు లేదా ఎలా స్పందించాడు తదితర అంశాల ఆధారంగా అనుకరణ బ్యాట్‌లను సృష్టిస్తున్నారు.
ఈ అనుభూతులు ఎలా సాధ్యం?
చనిపోయిన వారిని ఏఐ ద్వారా డిజిటల్ రూపంలో పునర్‌జీవింపచేస్తారు లేదా ఆ అనుభూతిని కలిగిస్తారు.
–ప్రధానంగా సంబంధిత వ్యక్తుల నుంచి సేకరించిన ఏఐ నమూనాల నుంచి ఇది సాధ్యమవుతుంది.
–చనిపోయిన వారి టెక్సŠట్ మెసేజ్‌లు, ఈ–మెయిల్‌లు, సోషల్ మీడియా పోస్ట్‌లు, వాయిస్ నోట్‌లు, వీడియో రికార్డింగ్‌లు వంటివి ఉపకరిస్తున్నాయి. ఆ వ్యక్తికి సంబంధించిన వ్యక్తిత్వ లక్షణాలు, నిర్ణయం తీసుకునే విధానాలు సహాయపడుతున్నాయి.
–వారి బయోమెట్రిక్ డేటా (ముఖ కవళికలు, స్వరం) వంటివి దోహదపడుతున్నాయి.
–వీటి ఆధారంగా నాడీ నెట్‌వర్క్‌లకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఏఐ ఆయా వ్యక్తులను అనుకరించగలదు.
–ఫలానా వ్యక్తి ఇంకా సజీవంగా ఉన్నట్టుగా సంభాషించగలదు.
–రెప్లికా, ప్రొజెక్ట్ డిసెంబర్, హియర్ ఆఫ్టర్ ఏఐ వంటి సాధనాలు ఇప్పటికే ఇలాంటి వాటిని అందిస్తున్నాయి.
–మరణించిన వారి స్వరం మాదిరిగానే సంబం«దీకులతో సంభాషించేలా చేయొచ్చు. చనిపోయిన తాత లేదా బామ్మ స్వరాలను ఉపయోగించి మనవళ్లు, మనవరాళ్లకు నిద్రవేళ కథలను చెప్పే సౌలభ్యం కూడా కలుగుతుందని అంటున్నారు.
సమాధానం లేని ప్రశ్నలెన్నో...
ఒక వ్యక్తి భౌతికంగా మరణించాక కూడా బతికి ఉన్నట్టుగా భ్రమలో మునగడం డిజిటల్ మరణానంతర జీవితం అనే జవాబులేని ప్రశ్నలను ముందుకు తెస్తోంది.
⇒ ఇది మరణించిన వారి గురించి పడే బాధను తగ్గిస్తుందా? లేదా వారి జ్ఞాపకాలు వెంటాడేలా చేస్తుందా? ఈ డిజిటల్ సాంకేతిక భ్రాంతి/ అయోమయాల మధ్య చనిపోయిన వారు ఎంతకాలం ‘జీవించగలరు’? ఈ ఏఐ అమరత్వాన్ని ఎవరు నియంత్రిస్తారు? సంబంధిత వ్యక్తి కుటుంబమా, టెక్ కంపెనీలా లేక ఆయా దేశాలు/రాష్ట్రాల ప్రభుత్వాలా?
⇒ డిజిటల్ క్లోన్ ఓ వ్యక్తిగా ఉండటం విరమించి పూర్తిగా వేరే వ్యక్తిగా వ్యవహరిస్తే లేదా హ్యాకింగ్‌కు గురైతే ఏమి జరుగుతుంది?
⇒ ఆయా మాధ్యమాల ద్వారా మనం జ్ఞాపకశక్తిని కాపాడుకుంటున్నామా? లేదా భ్రమల్లో విహరించేలా తయారవుతున్నామా? ఇది వరంగా పరిణమిస్తుందా లేక శాపంగా మారుతుందా?
⇒ ఈ ప్రశ్నలకు జవాబులు డిజిటల్ సాంకేతికతను ఏ రూపంలో, ఏ అవసరానికి ఉపయోగిస్తారనే దానిపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.