
కృత్రిమ మేధను వినియోగిస్తున్న58% విద్యార్థులు
చాట్‌బాట్స్‌లో అత్యధికంగా చాట్‌జీపీటీ వాడకం
పాఠశాలల్లో ఏఐ బోధన కోరుతున్న స్టూడెంట్స్
ఏఐ సమాధానాలను పూర్తిగా నమ్మని నవతరం
సాక్షి, స్పెషల్ డెస్క్: స్మార్ట్‌ఫోన్ దొరికిందంటే గంటల తరబడి గేమ్స్ ఆడే పిల్లలు మనచుట్టూనే ఉన్నారు. వినోదానికి గేమ్స్ మాత్రమే కాదు.. హోమ్‌వర్క్ కూడా పూర్తి చేసేందుకు స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తున్నారు! అది కూడా ఆధునిక సాంకేతికత అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో!! అవును.. ప్రపంచవ్యాప్తంగా 58 శాతం విద్యార్థులు హోంవర్క్, అసైన్‌మెంట్స్, పాఠాలపై అవగాహన పెంచుకునేందుకు ఇప్పటికే ఏఐ ఉపయోగిస్తున్నారట. అన్నింటా మనం అన్నట్టు భారతీయ విద్యార్థులూ ఈ విషయంలో ముందున్నారు.
మొత్తం 29 దేశాలు..
‘అంతర్జాతీయ ఏఐ ప్రశంసా దినోత్సవం’సందర్భంగా ‘స్టూడెంట్స్ స్పీక్ ఆన్ ఏఐ’పేరుతో స్కిల్స్ ప్లాట్‌ఫామ్ ‘బ్రైట్‌చాంప్స్’ఒక నివేదికను విడుదల చేసింది. ఏఐ సాధించిన విజయాలు, మన జీవితాల్లో తెస్తున్న మంచి మార్పులకు గుర్తుగా ఏటా జూలై 16ను ‘అంతర్జాతీయ ఏఐ ప్రశంసా దినోత్సవం’గా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా.. పిల్లలు ఏఐతో మమేకమవుతున్న తీరును ఈ అధ్యయనం వెల్లడించింది. భారత్, అమెరికా, వియత్నాం, యూఏఈ సహా 29 దేశాల్లోని 1,425 మంది విద్యార్థులు ఈ సర్వేలో పాలుపంచుకున్నారు. ప్రపంచ సగటుతో పోలిస్తే భారత్‌లో ఏఐని ఉపయోగిస్తున్న విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండటం విశేషం. విద్యార్థులు చాట్‌జీపీటీని అత్యధికంగా వినియోగిస్తున్నారు. తాము ఎప్పుడూ మోసం చేయడానికి ఏఐని ఉపయోగించలేదని భారత్‌లో 95 శాతం, ప్రపంచవ్యాప్తంగా 86 శాతం మంది విద్యార్థులు చెప్పడం గమనార్హం.
‘ఏఐ చెప్తే నమ్మేయాలా?’
మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఏఐ ఇచ్చే సమాధానాలను విద్యార్థులు గుడ్డిగా నమ్మడం లేదని ఈ సర్వే స్పష్టం చేసింది. దాదాపు 70 శాతానికిపైగా పిల్లలు ఏఐ ఇచ్చిన సమాధానాలతో సంతృప్తి చెందకుండా సరిచూస్తున్నారట. మరీ ముఖ్యమైన అంశం ఏంటంటే.. దాదాపు 80 శాతం పిల్లలు ఏఐ ఇచ్చిన సమాధానాలను పూర్తిగా నమ్మడం లేదు.
పిల్లలు – ఏఐ
⇒ 58% హోంవర్క్, కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఏఐ ఉపయోగిస్తున్న విద్యార్థులు
⇒ ఏఐని తరచూ వినియోగిస్తున్నభారతీయ విద్యార్థులు 63%
⇒ 62% చాట్‌జీపీటీని అత్యధికంగా ఉపయోగిస్తున్నవారు
⇒ మోసం చేయడానికి ఏఐని ఉపయోగించలేదు 86%
⇒ 34% ఏఐ పని చేసే విధానం తెలిసిన పిల్లలు
⇒ ఏఐని సద్వినియోగం చేసుకునేందుకు మార్గదర్శకత్వం కోరుతున్నవారు 56%
⇒ 38% ఉద్యోగాలను ఏఐ ప్రభావితం చేస్తుందని ఆందోళన చెందుతున్నవారు
⇒ ఇమేజ్, వీడియో.. ఏఐతో రూపొందిందా లేదా అన్నది తెలియనివారు 50%
⇒ 70% పాఠశాలల్లో ఏఐ బోధించాలని కోరుతున్న విద్యార్థులు
⇒ తమకున్న ఏఐ అవగాహనపట్ల నమ్మకంగా ఉన్నవారు 10%
⇒ 29% ఏఐ ఇచ్చిన సమాధానాలను సరిచూడని పిల్లలు
⇒ ఏఐ ఇచ్చిన తప్పుడు జవాబులను నమ్మినవారు 20%