సాక్షి, హైదరాబాద్: సినిమా పరిశ్రమకు పైరసీ వల్ల చాలా నష్టం జరిగిందన్నారు హైదరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్. పైరసీ మాస్టర్ మైండ్, ఐబొమ్మ నిర్వాహకుడు రవిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. కొత్త టెక్నాలజీ ఉపయోగించి రవి సినిమాలు అప్‌లోడ్ చేసేవాడు. పైరసీలో సినిమాలు చూసే వాళ్లపై నిఘా పెట్టినట్టు సజ్జనార్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు రవి రూ.20 కోట్లు సంపాదించాడని సజ్జనార్ వెల్లడించారు.
హైదరాబాద్ సీపీ సజ్జనార్ తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఐబొమ్మపై చాలా రోజులుగా దర్యాప్తు చేస్తున్నాం. పైరసీని అరికట్టడానికి ఎంతో శ్రమించాం. ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశాం. దేశవ్యాప్తంగా పైరసీ సమస్య ఉంది. నిందితుడు రవి.. కొత్త టెక్నాలజీ ఉపయోగించి సినిమాలు అప్‌లోడ్ చేసేవాడు. రవిని విచారిస్తున్నాం. నిందితుడికి అంతర్జాతీయ లింకులు ఉన్నాయి. ఐబొమ్మ రాకెట్ ఛేదించేందుకు జాతీయ సంస్థల సపోర్టు తీసుకుంటాం. ఉదయం విడుదలైన సినిమా.. సాయంత్రానికి ఐబొమ్మ రవి వద్ద ఉండేది. ఐబొమ్మ రవిపై మూడు పైరసీ కేసులు ఉన్నాయి. రవి వల్ల ప్రజలకు తీవ్ర నష్టం జరిగింది. రవి ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ వల్ల అనేక మంది ఆత్మహత్య చేసుకున్నారు. చాలా మంది డిజిటల్ అరెస్ట్ అయ్యారు. ఐబొమ్మ రవి వెనుక డార్క్ వెబ్‌సైట్లు ఉన్నాయి.
రవి స్వస్థలం విశాఖపట్నం. మహారాష్ట్రలో ప్రహ్లాద్ పేరుతో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడు. రవి.. పోలీసులకే సవాల్ విసిరాడు. 50 లక్షల మంది సబ్‌స్కైబర్ల డేటా ఇమంది రవి దగ్గర ఉంది. ఈ డేటాను దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. అమెరికా, నెదర్లాండ్స్‌లో సర్వర్లను పెట్టాడు. రవి హార్ట్ డిస్క్‌లో అన్ని సినిమాలు ఉన్నాయి. టెలిగ్రామ్ యాప్‌లో కూడా పైరసీ సినిమాలు అప్‌లోడ్ చేశాడు. నిందితులు ఎక్కడ ఉన్నా పోలీసులు పట్టుకుంటారు. పైరసీలో సినిమాలు చూసే వాళ్లపై నిఘా పెట్టామన్నారు. రవి చేసిన బెట్టింగ్ యాప్ ప్రమోషన్లతో చాలా మంది నష్టపోయారు. రవిపై ఐదు కేసులు నమోదు చేశాం. ఇప్పటి వరకు రవి రూ.20 కోట్లు సంపాదించాడు. రవి నుంచి రూ.3 స్వాధీనం చేసుకున్నారు. సినిమా పరిశ్రమకు పైరసీ వల్ల చాలా నష్టం జరిగింది. పైరసీ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోందన్నారు.
21వేల సినిమాలు హార్ట్ డిస్క్‌లో ఉన్నాయి. రవితో సినీ పరిశ్రమకు తీరని నష్టం జరిగింది. నిందితుడిపై ఐటీ సెక్షన్ల కింది కేసులు నమోదు చేశాం. ఇప్పటి వరకు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశాం. 1970 మూవీస్ దగ్గర నుంచి ఇప్పటి వరకు వచ్చిన అన్ని సినిమాలు రవి వద్ద ఉన్నాయి. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. ఐబొమ్మ రవిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా కృషి చేశారు. ఐబొమ్మ వెనుక పెద్ద రాకెట్ ఉంది. రవి.. పలు పేర్లతో లైసెన్స్‌లు, పాన్ కార్డులు తీసుకున్నాడు. నిందితుడు డేటా ఎక్కడ నుంచి సేకరించారనే దానిపై విచారిస్తున్నాం’ అని తెలిపారు.



