సౌదీ అరేబియా మదీనా సమీపంలో జరిగిన ఘోర ప్రమాదంలో 42 మంది భారతీయ ఉమ్రా యాత్రికులు సజీవ దహనం అయ్యింది తెలిసిందే. మృతుల్లో అత్యధికంగా తెలంగాణ హైదరాబాద్‌కు చెందినవాళ్లే ఉన్నారు. అయితే ఈ ప్రమాదం నుంచి ఇద్దరు సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ అసిఫ్ నగర్, హబీబ్ నగర్‌కు చెందిన 44 మంది మక్కా యాత్ర కోసం అల్ మక్కా, ఫ్లై జోన్ ట్రావెల్స్ నుంచి టికెట్లు బుక్ చేసుకున్నారు. ఈ నెల 9వ తేదీన వాళ్లు అక్కడికి వెళ్లారు. మొత్తం 46 మంది ప్రయాణికులతో కూడిన బస్సు మక్కా యాత్ర తర్వాత గత రాత్రి మదీనాకు వెళ్తోంది. ఆ సమయంలో దాటాక వాళ్లు ప్రయాణిస్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీ కొట్టింది.
ఈ ఘోర ప్రమాదంలో 42 మంది మరణించగా.. మృతుల్లో హైదరాబాద్‌కు చెందిన వాళ్లే 16 మంది ఉన్నారు. అయితే మృతుల్లో నగరానికి రెండు కుటుంబాలకు చెందిన 15 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఒక కుటుంబంలో 8 మంది, మరో కుటుంబంలో ఏడుగురు ప్రమాదంలో సజీవ దహనం అయ్యారు. ఆ కుటుంబాల వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది.
బస్సు డ్రైవర్‌తో పాటు హైదరాబాద్‌కు చెందిన షోయబ్ అనే యువకుడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ విషయాన్ని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ధృవీకరించారు.‘‘మక్కా యాత్రికులు మరణించడం దురదృష్టకరం. హైదరాబాద్ నుంచి 44 మంది యాత్రికులు వెళ్లారు. ప్రమాద సమయంలో బస్సులో 46 మంది ఉన్నారు. నగరానికి చెందిన 16 మంది మరణించారు. వాళ్ల వివరాలు సేకరిస్తున్నాం. షోయబ్ అనే యువకుడు మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు’’ అని తెలిపారు. మరోవైపు.. ప్రమాద సమాచారం అందుకున్న బంధువులు ట్రావెల్ ఏజెన్సీలకు వద్దకు చేరుకుంటున్నారు. అయితే ఫ్లై జోన్ ట్రావెల్స్ నిర్వాహకులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
సాయంత్రానికే ఆ స్పష్టత: నాంపల్లి ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్
సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదం దిగ్భ్రాంతిని గురిచేసింది. మెహదీపట్నం నుంచి ఒక యువకుడు ఉదయాన్నే నాకు కాల్ చేశాడు. ఇక్కడ బాధిత కుటుంబాలను కలిసాను. సంబంధిత ట్రావెల్స్ నుంచి బాధిత కుటుంబాలకు సరైన సమాచారం ఇవ్వడం లేదు. మా పార్టీ అధినేత, ఎంపీ అసరుద్దీన్ ఓవైసీ ఇండియన్ ఎంబసీ, సౌదీ ఎంబసీతో మాట్లాడుతున్నారు. బాధ్యత కుటుంబాలను ఆదుకుంటాం. ప్రతి కుటుంబాన్ని స్వయంగా వెళ్లి కలుస్తాం. మృతదేహాలను ఇక్కడికి రప్పించడంపై సందేహాలు నెలకొన్నాయి. మా బృందం ఒకటి సాయంత్రానికి సౌదీ చేరుకుంటుంది. ఆ తర్వాతే మృతదేహాల తరలింపునకు అవకాశం ఉందా? లేదా? అనే దానిపై క్లారిటీ వస్తుంది.


