
అరుదైన జాతిని గుర్తించిన అధికారులు
ఇవి విషపూరితమని, తినొద్దని సూచన
ఖమ్మం వ్యవసాయం: ఖమ్మం జిల్లాలోని పులిగుండాల అటవీ ప్రాంతంలో అరుదైన నీలి పుట్టగొడుగులను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. వీటిని ‘బ్లూ పిన్కిగిల్ మశ్రూమ్ ఎంటొలోమా హోచెస్టెటెరి’జాతికి చెందిన పుట్టగొడుగులుగా నిర్ధారించారు. గతంలో ఆదిలాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్ అటవీ విభాగంలో ఈ జాతి పుట్టగొడుగును గుర్తించగా, ఇప్పుడు ఖమ్మం జిల్లాలో కనిపించాయి. ఈ నీలిరంగు పుట్టగొడుగులకు పలు ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది ఆకర్షణీయంగా ఆకాశ నీలిరంగులో ఉంటుంది. దీంతో దీన్ని స్కై బ్లూ మశ్రూమ్ అని అంటారు.
న్యూజిలాండ్‌కు చెందిన ఈ జాతి మనదేశంలో అరుదుగా కనిపిస్తోంది. ఎంటొలోమా జాతికి చెందిన ఈ పుట్టగొడుగులు విషపూరితమని అటవీ అధికారులు భావిస్తున్నారు. దీంతో వీటిని ఆహారంగా వినియోగించవచ్చా.. లేదా అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా, పులిగుండాల అటవీ ప్రాంతంలో ఈ పుట్ట గొడుగు కనిపించడంతో ఖమ్మం అటవీ ప్రాంతంలో జీవవైవిధ్యం ప్రత్యేకతను సంతరించుకుంది.
అధ్యయనానికి చర్యలు
ఖమ్మం అడవుల్లో అరుదైన పుట్టగొడుగు జాతి దర్శనమిచ్చింది. ఇది ఇక్కడి పర్యావ రణ ప్రాధాన్యతను మరింతగా బలపరు స్తోంది. జీవవైవిధ్యం రక్షణలో ఇది ఒక ముఖ్యమైన అడుగు. అయితే, ప్రజలు అడ వుల్లో తెలియని పుట్టగొడుగులను తాకొద్దు, తినొద్దు. ఎందుకంటే ఇవి విషపూరితమై ఉండొచ్చు. అందువల్ల ఈ జాతిపై మరింతగా అధ్యయనం చేయనున్నాం. –సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, ఖమ్మం జిల్లా అటవీ అధికారి