
సాక్షి, సిద్దిపేట: కాళేశ్వరం మోటర్లను నాశనం చేసే కుట్ర జరుగుతోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మోటర్లను నాశనం చేసి అది.. బీఆర్‌ఎస్‌పై నెపం వేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ మధ్య విభేదాలు ఉంటే మీరు మీరు చూసుకోండి.. కాళేశ్వరంపై బురద రాజకీయాలు మానుకోండి అంటూ ఘాటు విమర్శలు చేశారు.
సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్ర ప్రభుత్వం రైతుల మీద పగ, ప్రతీకారం తీర్చుకుంది. నీళ్లను గేట్లు ఎత్తి సముద్రంలోకి వదులుతున్నారు. కడెం ప్రాజెక్టుకు 62వేల క్యూసెక్కుల వరద వస్తోంది. నేను వారం రోజుల క్రితమే మంత్రి ఉత్తమ్ కుమార్‌కు లేఖ రాశాను. సీఎం రేవంత్, ఉత్తమ్ కుమార్‌కు నీళ్ల విలువ తెలియదు. ప్రభుత్వం నడపడం చేతకావడం లేదు.. ఎందుకు ప్రాజెక్టుల నీళ్లను వృథా చేస్తున్నారు. ఎందుకు నీళ్లను సముద్రం పాలు చేస్తున్నారు. ఎస్‌ఆర్‌ఎస్‌పీ వరద కాలువ ద్వారా అన్నపూర్ణ, మిడ్ మానేరు, ప్రాజెక్టును నింపాలి. వేలాది మంది రైతులతో వెళ్లి మేమే మోటార్లు ఆన్ చేస్తాం. మీరు ఆన్ చేయకుంటే మేమే ఆన్ చేస్తాం.
కాళేశ్వరంపై మరో కుట్ర చేస్తున్నారు.. మోటర్లను ఆన్ అండ్ ఆన్ చేయడం వలన మోటార్లు పనికి రాకుండా చేస్తున్నారు. కాళేశ్వరంపై బురద రాజకీయాలు మానుకోండి. ఆన్ చేసి ఆఫ్ చేయకూడడని బీహెచ్‌ఈఎల్ ఇప్పటికే హెచ్చరించింది. మోటర్లను నాశనం చేసి.. అది బీఆర్‌ఎస్‌పై వేయాలని కుట్ర చేస్తున్నారు. మీ మధ్య ఏమైనా విభేదాలు ఉంటే మీరే చూసుకోండి. దేవాదుల మోటార్లు ఆన్ చేయక వరంగల్‌కు నష్టం జరుగుతోంది. కమీషన్ పంచుకోవడానికి సమయం సరిపోవడం లేదు’ అని ఘాటు విమర్శలు చేశారు.