
తెలంగాణ భవన్‌లో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్న హరీశ్‌రావు
కాళేశ్వరం బరాజ్‌ల నిర్మాణం కేసీఆర్ సొంత నిర్ణయం కాదు
ఈ ప్రాజెక్టుకు కేబినెట్‌తోపాటు అసెంబ్లీ ఆమోదం కూడా ఉంది
పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో హరీశ్‌రావు స్పష్టీకరణ
వ్యాప్కోస్ నివేదిక, హై పవర్ కమిటీ సిఫారసులు, సీడబ్ల్యూసీ ఆమోదం మేరకే నిర్మాణం
వాస్తవాలు లేకుండా వండి వార్చిన నివేదికను ప్రభుత్వం బయటపెట్టింది
సీఎం రేవంత్‌రెడ్డి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు
కేసీఆర్‌ను హింసించాలన్నదే ఆయన ఉద్దేశం.. కమిషన్ నివేదిక కోర్టు ముందు నిలవదు
అసెంబ్లీలో పూర్తి నివేదికను పెడితే ప్రభుత్వాన్ని చీల్చిచెండాడతాం..
కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయిని..అధికారంలోకి రాగానే నిరూపిస్తాం
సాక్షి, హైదరాబాద్: ‘కాళేశ్వరం ప్రాజెక్టుపై వాస్తవాలు లేకుండా వండి వార్చిన నివేదికను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం బయట పెట్టింది. ఈ ప్రాజెక్టుకు కేబినెట్‌తో పాటు అసెంబ్లీ ఆమోదం కూడా ఉంది. గవర్నర్ ప్రసంగంలో కాళేశ్వరం అంశం ఉండటం కేబినెట్ ఆమోదాన్ని సూచిస్తుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణం నాటి సీఎం కేసీఆర్ సొంత నిర్ణయం కాదు. వ్యక్తుల నిర్ణయం ఆధారంగా బరాజ్‌ల నిర్మాణం జరగలేదు.
వ్యాప్కోస్ నివేదిక, హై పవర్ కమిటీ సిఫారసులు, కేబినెట్ నిర్ణయం, సీడబ్ల్యూసీ ఆమోదం మేరకు జరిగాయి. సీఎం రేవంత్‌రెడ్డి పాలనను గాలికి వదిలి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ‘డబ్బులు దండుకునేందుకు కమీషన్లు..కక్ష సాధింపుల కోసం కమిషన్లు’ అన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఉంది. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రేవంత్ టీవీ సీరియళ్ల తరహాలో కమిషన్లు, విచారణలతో కాలం గడుపుతున్నాడు.
కేసీఆర్‌ను హింసించాలన్నదే ఆయన ఉద్దేశం. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాయి..’ అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ కుట్రలు.. కమిషన్ వక్రీకరణలు, వాస్తవాలు’ అనే అంశంపై మంగళవారం తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో పార్టీ ముఖ్య నేతలు, రైతులు దీనిని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డ వద్దకు బరాజ్ మార్చడంలో నాటి సీఎం కేసీఆర్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఆరోపణలను హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే..
కుట్ర పూరిత విచారణ!
కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి రహస్యాలూ లేవు. అన్ని అంశాలు డీపీఆర్‌లో ఉన్నాయి. మేడిగడ్డ నుంచి మిడ్‌మానేరుకు నేరుగా తరలించలేమని నిపుణులు చెప్పారు. పీసీ ఘోష్ కమిషన్ విచారణ కుట్రపూరితంగా జరిగినట్లు కనిపిస్తోంది. కమిషన్ ఎదుట విచారణకు రావాలని మాకు నోటీసులు రాకమునుపే మీడియాలో లీకులు ఇచ్చారు. సంక్షిప్త నివేదిక పేరిట అవాస్తవాలు, రాజకీయ కక్ష సాధింపులతో 60 పేజీలు వండి వార్చారు.
నచ్చిన పేరాల లీకులు, నచ్చని నాయకులు బాధ్యులు అన్నట్లుగా నివేదిక తీరు ఉంది. ఒక వైపే చూసి, విని, నిలబడి ఇచ్చిన నిరాధార నివేదిక ఇది. అసెంబ్లీలో 665 పేజీల పూర్తి నివేదికను పెడితే వాస్తవాలను నిగ్గు తేల్చేలా నిలదీసి చీల్చి చెండాడతాం.
అనుమతుల్లేని ‘కొడంగల్’కు ఎలా శంకుస్థాపన చేస్తారు?
కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ సంస్థలను కూడా ఈ నివేదిక తప్పు పట్టింది. 11 కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు ప్రాజెక్టును ఆమోదించాయి. ప్రాణహితకు జాతీయ హోదా ఇవ్వాలని కేసీఆర్ గతంలో ప్రధానికి లేఖ రాశారు. ఏ అనుమతులు లేని కొడంగల్ ఎత్తిపోతల పథకానికి రేవంత్ ఎలా శంకుస్థాపన చేశారు? దీనిపై కూడా అసెంబ్లీలో దుమ్ము దులిపి అన్ని ఆధారాలు బయట పెడతాం.
కానీ మైక్ కట్ చేయకుండా, సభను వాయిదా వేసుకోకుండా వాస్తవాలు చెప్పే అవకాశం మాకు ఇవ్వాలి. గతంలో దేశంలో వేసిన అనేక కమిషన్ల తరహాలోనే ఈ కమిషన్ నివేదిక కూడా న్యాయస్థానం ముందు నిలవదు.
ప్రాజెక్టును పూర్తి చేసేందుకే మేడిగడ్డకు మార్పు
తుమ్మిడిహెట్టి వద్ద ఏ ప్రాతిపదికన గతంలో బరాజ్‌ను ప్రతిపాదించారో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి. అక్కడ నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీనే చెప్పింది. అందుకే మేడిగడ్డకు మార్చాం. ప్రతిపాదిత 165 టీఎంసీల్లో ఎగువ రాష్ట్రాల వాటా ఉంది. దాన్ని కాంగ్రెస్ దాచిపెట్టింది. ప్రాణహిత–చేవెళ్లకు హైడ్రాలజీ అనుమతి ఇచ్చినట్లు కాంగ్రెస్ చెప్తోంది. కానీ 152 మీ. ఎత్తులో బరాజ్ నిర్మించవద్దని మహారాష్ట్ర స్పష్టంగా చెప్పింది.
ఈ నేపథ్యంలో ప్రాజెక్టు పూర్తి కావాలన్న ఉద్దేశంతోనే తుమ్మిడిహెట్టి నుంచి మార్చాం. తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తున నిర్మించేందుకు ఒప్పందం చేసుకున్నట్లు నిరూపిస్తే సీఎం పదవికి రాజీనామా చేస్తానని కేసీఆర్ సవాలు చేసినా నాటి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పందించ లేదు.
అప్పట్లో ఖర్చు చేసింది రూ.3,700 కోట్లే..
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.11 వేల కోట్లతో 32 శాతం ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పనులు పూర్తి చేసినట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పాడు. కానీ ఈ ప్రాజెక్టు కోసం నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం రూ.3700 కోట్లే. అందులోనూ మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరిట రూ.2 వేల కోట్లు ఖర్చు చేశారు. కేసీఆర్ వందేళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేశారు.
నారాయణపేట– కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ఏ అనుమతి ఉందని రేవంత్‌రెడ్డి కొబ్బరికాయ కొట్టిండు. డీపీఆర్ లేకుండానే రేవంత్‌రెడ్డి పనులు ప్రారంభించాడు. ఎలాంటి అనుమతులు లేకుండానే బిల్లులు కూడా చెల్లించారు. దీనికి ఒక్క అనుమతైనా ఉంటే ఉత్తమ్ చూపించాలి. కాళేశ్వరం కూలిందని ప్రచారం చేస్తున్న రేవంత్ గందమల్ల రిజర్వాయర్‌కు కొబ్బరికాయ కొట్టి, మల్లన్నసాగర్ నుంచి మూసీకి నీళ్లు తెస్తానని టెండర్లు పిలుస్తున్నాడు. కాళేశ్వరం తెలంగాణ వరప్రదాయని. ప్రజల గుండెల్లో కేసీఆర్ దేవుడిలా నిలుస్తారు.
రాజకీయ కుట్రతోనే ఎన్‌డీఎస్‌ఏ నివేదిక
గోదావరి నదిపై పోలవరం ప్రాజెక్టు మూడుసార్లు కుప్పకూలినా స్పందించని ఎన్‌డీఎస్‌ఏ మేడిగడ్డ బరాజ్‌లో చిన్న ఘటన జరగ్గానే వచ్చింది. రాజకీయ కుట్రతోనే నివేదిక ఇచ్చింది. మేడిగడ్డలో రెండు పిల్లర్లు కూలితే కేసీఆర్‌ను బాధ్యులుగా చేస్తున్న వారు పోలవరం కట్టిన ఎన్‌డీఎస్‌ఏ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్‌పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? పోలవరం కట్టిన ప్రధాని మోదీపై చర్య తీసుకుంటారా? శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం కూలిన ఘటనకు సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ బాధ్యత వహించాలి.
అధికారంలోకి రాగానే మరమ్మతులు చేస్తాం
కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో బాగుంది. ప్రాజెక్టు ద్వారా రెండు పంటలు పండాయి. సుందిళ్ల, అన్నారం బరాజ్‌లు సురక్షితంగా ఉన్నాయని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా చెప్పాడు. మేడిగడ్డలో రెండు పియర్లు కుంగితే కాళేశ్వరం కూలిందని తప్పుడు ప్రచారం చేశారు. బీఆర్‌ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత కుంగిన రెండు పియర్లను బాగు చేసి కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణకు వరప్రదాయని అని నిరూపిస్తాం.