
సాక్షి, సంగారెడ్డి: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటూ దసరా ఉత్సవాల్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డిలో తన భార్య నిర్మల బరిలో ఉంటారని తెలిపారు. తాను మరో పదేళ్ల తర్వాతే పోటీ చేస్తానంటూ చెప్పుకొచ్చారు.
గత ఏడాది దసరా వేడుకల్లో కూడా జగ్గారెడ్డి ఇదే విషయాన్ని బహిరంగంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. గత జూన్‌లో కూడా తెలంగాణలో ముఖ్యమంత్రి స్థానంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మూడేళ్లు సీఎంగా రేవంత్ రెడ్డి ఉంటారు.. ఆయన దిగిపోయాక నేను సీఎం కావడానికి ప్రయత్నం చేస్తాను అంటూ కామెంట్స్ చేశారు.
బీజేపీ నుంచి సంగారెడ్డి మున్సిపాలిటీకి కౌన్సిలర్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన జగ్గారెడ్డి.. 2004లో టీఆర్ఎస్(బీఆర్‌ఎస్)లో చేరి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి 2009లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో లోక్‌సభ ఉప ఎన్నికల కోసం మళ్లీ బీజేపీలో చేరి ఓడిపోయారు. 2015లో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు.
కాగా, సంగారెడ్డి జిల్లా కేంద్రం దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. జగ్గారెడి దాదాపు రెండున్నర దశాబ్దాలుగా ప్రతి ఏటా ఈ వేడుకలను తన సొంత ఖర్చులతో నిర్వహిస్తున్నారు. తాను మున్సిపల్ చైర్మన్‌గా పనిచేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏటా ఈ వేడుకలను స్వయంగా పర్యవేక్షిస్తారు. పండగను పురస్కరించుకుని పాత బస్టాండ్ రాంమందిర్ నుంచి శోభాయత్ర జరిగింది. అంబేద్కర్ స్టేడియంలో రావణ దహణ కార్యక్రమం నిర్వహించారు.