కోటి ఆశలతో..
ఆలయాలకు పోటెత్తిన భక్తజనం
సంగారెడ్డి టౌన్/రామచంద్రాపురం (పటాన్‌చెరు): కొత్త ఏడాదిని పురస్కరించుకుని సంగారెడ్డి పట్టణంలోని దేవాలయాలు, చర్చిలు భక్తులతో కిటకిటలాడాయి. మహిళలు తమ ఇళ్ల ముందు వివిధ రకాల ముగ్గులను వేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైకుంఠపురం, సాయిబాబా మందిరంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సంగారెడ్డి మండలంలోని కలబ్‌గూర్ శివాలయంలో జిల్లా ఎస్పీ పంకజ్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామచంద్రాపురం పట్టణంలోని పంచముఖి ఆంజనేయస్వామి ఆలయంలో ఎమ్మెల్సీ సి.అంజిరెడ్డి, జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొల్లూరు కేసీఆర్‌నగర్ కాలనీలో వేడుకల్లో తెల్లాపూర్ మాజీ మున్సిపల్ వైస్‌చైర్మన్ రాములు గౌడ్, నియోజకవర్గ కో ఆర్టినేటర్ వి.ఆదర్శ్‌రెడ్డి, మాజీ సర్పంచ్ సోమిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలసి కేక్‌ను కట్ చేశారు.
గణనాథుని సన్నిధిలో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి
పటాన్‌చెరు/ పటాన్‌చెరు టౌన్: ఆంగ్ల నూతన సంవత్సరం పురస్కరించుకుని..ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారంలోని గణేశ్‌గడ్డ శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవాలయాన్ని గురువారం ఉదయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికి..వేద ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పటాన్‌చెరు డీఎస్పీ ప్రభాకర్, ఆలయ కమిటీ అధ్యక్షుడు హరిప్రసాద్‌రెడ్డి, మాజీ ఎంపీపీ గాయత్రి పాండు, సీఐలు వినాయకరెడ్డి, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి జోన్: ప్రతీ ఉద్యోగి అంకితభావంతో విధులు నిర్వర్తించాలని కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని గురువారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులు కలెక్టర్‌ను కలిసి మొక్కలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ పాండు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కోటి ఆశలతో..
కోటి ఆశలతో..
కోటి ఆశలతో..


