ప్రమాదాల నివారణే లక్ష్యం
● రోడ్డు భద్రతా మాసోత్సవాలు
● ప్రజలకు అవగాహన కార్యక్రమాలు
నారాయణఖేడ్: రోడ్డు ప్రమాదాలను తగ్గించేందు కు ఈ ఏడాది జనవరి నెలంతా రోడ్డు భద్రతా మాసోత్సవాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతీ ఏటా జనవరి 1నుంచి వారం పాటు రోడ్డు భద్రతా వారోత్సవాలను నిర్వహించగా ఈసారిమాత్రం జనవరి 1 నుంచి 31 వరకు రోడ్డు భద్రతా మాసోత్సవాలను నిర్వహిస్తున్నట్లు రవాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించినసంగతి తెలిసిందే. జిల్లాలోనూ నెల రోజులపాటు రోడ్డు భద్రతా మాసోత్సవాలను నిర్వహించనున్నారు.
ఆర్టీసీ డిపోల్లో..
జిల్లాలోని అన్ని ఆర్టీసీ డిపోల్లో రోడ్డు భద్రతా మాసోత్సవాలను అధికారులు గురువారం ప్రారంభించారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో ప్రతీ ఒక్కరు పాల్గొనాలని ప్రభుత్వం సూచించింది. ప్రతీ విద్యార్థి తల్లిదండ్రులతో కలిసి రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తూ హామీ పత్రం ఇవ్వాలని, ప్రతీ పాఠశాల రోడ్డు భద్రతా క్లబ్‌లో చేరాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం, అధికారులు చర్యలు చేపట్టినా మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, రోడ్డు నియమ నిబంధనలు పాటించకపోవడంలాంటి కారణాల వల్ల తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
నెలంతా కార్యక్రమాలిలా..
రోడ్డు భద్రతా మాసోత్సవాలకు సంబంధించి ప్రభుత్వం షెడ్యూల్‌ను విడుదల చేసింది. జనవరి 1న రోడ్డు భద్రతా మాసోత్సవాలను ప్రారంభించడం, ప్రతిజ్ఞ, అన్ని శాఖల సిబ్బంది, ప్రజలతో రహదారి భద్రతా ప్రమాణం చేయిస్తారు. 2న సీటు బెల్టులపై అవగాహన, 3న హెల్మెట్‌పై అవగాహన, 4న డ్రైవర్లకు కంటి పరీక్షలు, 5న బడి బస్సులకు ఫిట్‌నెస్ పరీక్షల నిర్వహిస్తారు. 7న జాతీయ రహదారులపై అధిక వేగ నియంత్రణ కార్యక్రమం నిర్వహించనున్నారు. 10న పోలీసు, ఆర్‌అండ్‌బీ అధికారులతో కలిసి బ్లాక్ స్పాట్స్ తనిఖీలు చేస్తారు. 11న పరిమితికి మించి వెళ్లే వాహనాలపై చర్యలు, 17న వాహనాల ఫిట్‌నెస్, కాలుష్య తనిఖీలు, 28న రెడ్‌క్రాస్, వైద్యశాఖ సహకారంతో ప్రజలకు, డ్రైవర్లకు ప్రాథమిక చికిత్స, అత్యవసర సేవలపై శిక్షణ, 31న ముగింపు కార్యక్రమాలను నిర్వహిస్తారు.
ప్రమాదరహితంగా డ్రైవింగ్ చేయాలి
ప్రమాద రహితంగా వాహనాలు డ్రైవింగ్ చేయాలని డ్రైవర్లకు ఖేడ్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి సూచించారు. ఖేడ్ ఆర్టీసీ డిపోలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైవింగ్ సమయంలో ఏకాగ్రతే ప్రధానమన్నారు. ఖేడ్, కంగ్టి సీఐలు శ్రీనివాస్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, డీఎం సుబ్రహ్మణ్యం, సీనియర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ నందులాల్, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ శ్రీనివాస్‌రావు, నెహ్రూ తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు నియమాలు పాటించాలి
జహీరాబాద్ టౌన్: బస్సులు నడిపేటప్పుడు డ్రైవర్లు భద్రతా నియమాలు పాటించాలని జహీరాబాద్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్(ఎంవీఐ) వెంకటయ్య పేర్కొన్నారు. పట్టణంలోని ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రతా మాసోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంవీఐ,డీఎం తదితరులు కరపత్రం విడుదల చేశారు.
రహదారి భద్రత
అందరి బాధ్యత: కలెక్టర్ ప్రావీణ్య
సంగారెడ్డి జోన్: రహదారి భద్రత అందరి బాధ్యతని కలెక్టర్ ప్రావీణ్య స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల వాల్ పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..భద్రతకు సంబంధించి ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి అరుణ, జిల్లా పరిషత్తు సీఈఓ జానకీరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలో 2024లో 958 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోగా 433మంది మృత్యువాత పడ్డారు. 1,011మంది గాయాలపాలయ్యారు. 2025లో 917 రోడ్డు ప్రమాదాల్లో 423మంది మరణించగా, 895 మంది క్షతగాత్రులయ్యారు.


